గురువారం 13 ఆగస్టు 2020
Zindagi - Jul 11, 2020 , 22:49:57

ప్రేమలో స్వచ్ఛత ఉండాలి

ప్రేమలో స్వచ్ఛత ఉండాలి

జోనర్స్‌తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక పాత్రలతో  ప్రతిభను నిరూపించుకోవాలన్నదే తన అభిమతమని చెబుతున్నది  సీరత్‌కపూర్‌. కొరియోగ్రాఫర్‌గా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సీరత్‌.. నటనపై మక్కువతో కథానాయికగా మారింది. ‘రన్‌ రాజా రన్‌'  ద్వారా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసి.. అందచందాలతో, అభినయంతో ఆకట్టుకుంటున్నది. ‘రాజుగారి గది-2’, ‘ఒక్క క్షణం’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్ని పోషించి మెప్పించింది. ఆరేండ్ల సినీ ప్రయాణం తనకు ఎన్నో అనుభవ పాఠాలను నేర్పిందంటూ  సీరత్‌కపూర్‌ చెప్పిన ముచ్చట్లు...

‘ఒక్క క్షణం’ తర్వాత రెండేండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. కారణమేమిటి?

తొలి సినిమా నుంచీ  ఎప్పుడూ సుదీర్ఘమైన విరామం తీసుకోలేదు.  ప్రతి ఏడాది ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తున్నా.  ఒకేసారి నాలుగైదు సినిమాలు అంగీకరించి మరీ ఎక్కువ పేరు తెచ్చుకోవాలనే కోరిక నాకు లేదు.  అవకాశాలు చాలా వస్తున్నాయి. వాటిలో అభినయానికి ప్రాధాన్యమున్నవే ఎంచుకుంటున్నాను.  ‘టచ్‌ చేసి చూడు’, ‘ఒక్క క్షణం’ సినిమాల్ని ఒకే సమయంలో పూర్తిచేశా. పగలు ఓ షూటింగ్‌.. రాత్రి మరో చిత్రీకరణ.. ఇలా నెలలపాటు  శ్రమించాను. మనసుకు నచ్చిన మంచి కథలు కావడంతో కష్టమైనా ఇష్టంగా పనిచేశా. 

ఆరేండ్లలో చాలా తక్కువ సినిమాల్లో నటించారే?  

‘రన్‌ రాజా రన్‌'తో ఆరేండ్ల క్రితం నా కెరీర్‌ ఆరంభమైంది. ఆ సమయంలో టాలీవుడ్‌తో పాటు, తెలుగు భాష పట్లా నాకు ఎలాంటి అవగాహన లేదు. కొత్త కథానాయికను అయినా నా ప్రతిభను గుర్తించి తెలుగు ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు.  ఉత్తరాది నుంచి వచ్చిన నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించారు. ఆ  ప్రోత్సాహమే నటిగా నన్ను ముందుకు నడిపిస్తున్నది. విభిన్నమైన పాత్రలు చేసేలా స్ఫూర్తిని నింపుతున్నది. సినీ ప్రయాణంలో ఇప్పటివరకు   సాధించింది తక్కువే. భవిష్యత్‌లో చేయాల్సిన పాత్రలు, సినిమాలు ఎన్నో మిగిలి ఉన్నాయి. 

లాక్‌డౌన్‌ టైమ్‌ ఎలా గడిచింది?

లాక్‌డౌన్‌లో  ఇంట్లోనే ఉన్నా.   వంట చేయడం, క్లీనింగ్‌, వర్కవుట్స్‌, వెబ్‌సిరీస్‌లు చూడటం.. లాంటి పనులతో ఈ విరామం గడిచింది.  ఇంటీరియర్‌ డిజైనింగ్‌ అంటే ఇష్టం. అమ్మతో కలిసి ఇంటిని అందంగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టా. అమ్మానాన్నలతో  సరదాగా కబుర్లు చెప్పుకోవడం, కలిసి సినిమాలు చూడటం.. ఇవన్నీ నన్ను మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లాయి.  నా ఇష్టాల్ని గుర్తించి  అమ్మానాన్నలు ప్రోత్సహించారు.  నాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. సినిమాల వల్ల వారికి చాలా రోజులు దూరంగా ఉండాల్సివచ్చింది. మళ్లీ  పేరెంట్స్‌తో గడిపే  అవకాశం దొరకడం ఆనందాన్ని ఇచ్చింది. 

ఈ విరామం నుంచి ఏం నేర్చుకున్నారు? 

బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి.  తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయో? లేదో?  ఎవరికీ అవగాహన లేదు. ఈ విపత్కర వాతావరణంలో సానుకూల దృక్పథం అవసరం. ఆత్మైస్థెర్యంతో జీవితాన్ని కొనసాగించడం ముఖ్యమని తెలుసుకున్నా. 

వెబ్‌సిరీస్‌లలో నటించే ఆలోచన ఉందా?

వినూత్నమైన కథాంశాలతో వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. పాత్ర బాగుంటే తప్పకుండా  నటిస్తా. 

ఎలాంటి సినిమాలు చేయడం ఇష్టం?

రొమాంటిక్‌ కామెడీ నా ఫేవరేట్‌ జోనర్‌. థ్రిల్లర్‌, యాక్షన్‌ సినిమాల్లో నటించాలని ఉంది. 

ప్రేమంటే మీ దృష్టిలో?

ప్రేమలో  స్వచ్ఛత, వాస్తవికత ఉండాలి. తొలినాళ్లలో ప్రేమబంధాలు సరదాగా, హాయిగా గడిచిపోతాయి. కాలం గడుస్తున్న కొద్దీ అంతరంగాల్లోని మాధుర్యమేమిటో అర్థమవుతుంది. ఒక తెలియని రహస్యం ప్రేమలో గోచరిస్తుంది. నా మట్టుకు నాకు దీర్ఘకాలిక ప్రణయబంధాలు ఇష్టం. 


-నరేష్‌ నెల్కి


logo