ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Jul 06, 2020 , 00:15:57

అమ్మ ఆస్తి నాకెలా వస్తుంది?

అమ్మ ఆస్తి నాకెలా వస్తుంది?

మేమిద్దరం అక్కాచెల్లెళ్లం. మా నాన్నగారు చిన్నప్పుడే పోయారు. అమ్మకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుని మా అక్క వెళ్లిపోయింది. మా అమ్మ సంపాదన అంతా నగదు రూపంలోకి మార్చి ఒక ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్‌ చేసింది. దానికి నన్ను నామినీగా పెట్టింది. ఇప్పుడు మా అమ్మ చనిపోయింది. అమ్మ డబ్బుకి నామినీగా ఉన్నాను కాబట్టి, నేను బ్యాంకుకు వెళ్లి డబ్బు ఇవ్వమని అడిగాను. కానీ వాళ్లు కుదరదు అంటున్నారు. ఎందుకంటే మా అక్క తనకూ వాటా వస్తుందని బ్యాంకుకు లెటర్‌ పెట్టిందట. నాకు ఇంకా పెండ్లి కాలేదు. ఒంటరిగానే ఉంటున్నాను. నాకెవరూ లేకపోవడంతో మా అక్కాబావ కలిసి అమ్మ ఆస్తి, డబ్బు నాకు రాకుండా చేస్తున్నారు. నాకు న్యాయం జరుగుతుందా?                  

- సుచరిత, జగిత్యాల

ఈ మధ్య అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములు ఆస్తి కోసం కక్షలు పెంచుకుని కొట్టుకోవడం బాగా పెరిగిపోయింది. మీ విషయంలో కూడా ఇలా జరగడం బాధాకరం. అయితే బ్యాంకు వాళ్లు చెప్పింది నిజమే. క్లెయిమ్‌ ప్రాసెస్‌లో ఉండగా.. ఇలా ఏదైనా లెటర్‌ వస్తే అది తేలేవరకు ఎవరికీ ఇవ్వరు. నామినీ అంటే ట్రస్టీ మాత్రమే. పూర్తి హక్కులు ఉండవు. ఇంకెవరైనా కూడా వాటా ఉన్నట్టుగా క్లెయిమ్‌ చేస్తే అది కోర్టు ద్వారా తేలేవరకు బ్యాంకు వాళ్లు ఎవరికీ డబ్బు చెల్లించరు. మీ అమ్మ విల్లు రాసివుంటే బాగుండేది. తల్లిదండ్రులు విల్లు రాయకుండా చనిపోతే డైడ్‌ ఇంటెస్టేట్‌ అంటారు. విల్లు లేనప్పుడు హిందూ వారసత్వ చట్టం ప్రకారం పిల్లలు అందరికీ ఆస్తిపై సమాన హక్కులు ఉంటాయి.

వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తికి పిల్లలు, వాళ్ల పిల్లలు ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒక షేర్‌ వస్తుందని వారసత్వ చట్టం నిర్ణయించింది. ఆస్తి వాళ్ల స్వార్జితం అయివుండి, విల్లు రాసి ఉంటే ఎవరికి రాశారో వారికే చెందుతుంది. స్వార్జితం కాకుండా ఆస్తి పూర్వీకుల నుంచి వస్తున్నట్టయితే.. వారసులందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఒక్కొక్కరికి షేర్‌ ఉంటుంది. మీ అమ్మగారిది స్వార్జితం. విల్లు రాయకుండా చనిపోయారు. కాబట్టి, మీ అక్కా చెల్లెళ్లు ఇద్దరికీ కోర్టు ద్వారా సమానంగా పంచబడుతుంది. ఇప్పుడు మీరు సివిల్‌ కోర్ట్‌లో మీ అమ్మ ఆస్తిపాస్తులను అన్నింటిని స్పష్టంగా వివరిస్తూ పార్టీషన్‌ దావా (పార్టిషన్‌ సూట్‌) వేయండి. న్యాయస్థానం అన్నీ పరిశీలించి హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఎవరికెంత, ఏమేమి ఇవ్వాలన్నది విభాగం చేసి పంచుతుంది. కోర్టు ద్వారా పంపకాల పత్రం తీసుకుని,  బ్యాంక్‌ వాళ్లకు చూపిస్తే డబ్బు ఇస్తారు. 

ఎం. అనురాగసుధ

సీనియర్‌ ,న్యాయవాది


logo