బుధవారం 21 అక్టోబర్ 2020
Zindagi - Jul 06, 2020 , 00:15:57

నెలసరిలో వ్యాయామం తప్పనిసరి

నెలసరిలో వ్యాయామం తప్పనిసరి

నెలసరి.. మొదలైన నాటినుంచీ ప్రతి నెలా ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఆ సమయంలో మహిళలు పడే బాధను ఇంట్లోవాళ్లు కూడా అర్థం చేసుకోరు. 

ఇంటి పని, వంట పని... ఉద్యోగినులైతే ఆఫీసు పని.. ఒంటిచేత్తో చేసుకుపోతారు మహిళలు. నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి, నడుము నొప్పి సాధారణమే కదా అనుకుంటూ ఆ బాధ భరిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈస్ట్రోజన్‌ స్థాయి తగ్గి ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయి పెరగడం వల్ల అనేక రకాలుగా శారీరక సమస్యలు ఎదురవుతాయి. చిన్నచిన్న చిట్కాల ద్వారా కూడా వీటినుంచి బయటపడవచ్చు. ఆరోగ్యాన్నందించే తులసి.. పీరియడ్స్‌ నొప్పి తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తులసి ఆకుల్ని నీటిలో మరిగించి, చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా రెండు గంటలకోసారి తాగుతూ ఉంటే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. నడుమునొప్పి కూడా ఎక్కువగా ఉండేవాళ్లు అరటి ఆకును కొద్దిగా నూనెలో వేసి ఉడికించి, దాన్ని పెరుగులో కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇకపోతే నెలసరి సమయంలో కొందరు స్నానం చేయడాన్ని కూడా వాయిదా వేస్తుంటారు. 

ఈ సమయంలో వేడి నీళ్లలో కొద్దిగా యూకలిప్టస్‌ నూనె వేసుకుని స్నానం చేస్తే శరీరం రిలాక్స్‌ అవుతుంది. వేడినీటి స్నానం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. కడుపునొప్పి, కాళ్ల నొప్పులు తగ్గుతాయి. నెలసరి సమయంలో చాలామంది వ్యాయామం మానేస్తుంటారు. కానీ యోగా నిపుణుల్ని సంప్రదించి ఆ సమయంలో కూడా ప్రత్యేకమైన ఆసనాలు వేయవచ్చు. వాకింగ్‌ వల్ల కూడా కడుపు నొప్పి, కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అన్నింటి కన్నా ముఖ్యంగా.. బలవర్దకమైన ఆహారాన్ని తీసుకోవడం అవసరం. logo