సోమవారం 03 ఆగస్టు 2020
Zindagi - Jul 05, 2020 , 00:19:13

ఆయనకు మరొకరితో..

ఆయనకు మరొకరితో..

నా వయసు ముప్పై. ఇద్దరు పిల్లలు. నా భర్తకు వేరే స్త్రీలతో లైంగిక సంబంధాలు ఉన్నాయి. అడిగితే గొడవ పడతాడు. నా గురించి అస్సలు పట్టించుకోడు. నాకు లైంగిక వ్యాధులు అంటిస్తాడేమో అని భయంగానూ  ఉంది. నేను డిగ్రీ వరకు చదివాను. పరువు పోతుందని ఇంతవరకూ ఆగాను. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. నాకు సరైన సలహా ఇవ్వగలరు. 

- సుచరిత, హైదరాబాద్‌

పరాయి స్త్రీలతో లైంగిక సంబంధాల వల్ల ఎయిడ్స్‌ లాంటి ప్రమాదకరమైన లైంగిక వ్యాధులు వస్తాయి. వెంటనే మీ పుట్టింట్లో, అత్తింట్లో ఈ విషయం చెప్పు. నువ్వు పరువు కోసం ఆలోచిస్తుంటే అతను ఏమన్నా మారాడా? నిన్ను గౌరవించని భర్త గురించి నువ్వు దాచిపెడితే.. ఏదో ఒకరోజు నీకు అతని వల్ల అన్ని రకాల లైంగిక వ్యాధులు అంటుకుంటాయి. నీ దేహాన్ని రోగగ్రస్థం చేసే అధికారం, హక్కూ అతనికి లేవు. నీ ఆరోగ్యం, నీ జీవితం ఎప్పుడూ నీ చేతుల్లోనే ఉండాలి. ముందు ఎస్‌టీడీ, వీడీఆర్‌ఎల్‌, హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకో. అతనికీ చేయించు. 

నీకు నెగెటివ్‌ వచ్చి, అతనికి పాజిటివ్‌ వస్తే దూరం పెట్టు. కాపురమే కాదు, నీ ప్రాణం, పిల్లల జీవితం ముఖ్యం కదా. అతనికి నెగెటివ్‌ వస్తే అతడిని మారిటల్‌ కౌన్సెలర్‌ దగ్గరికి తీసుకెళ్లు. వివాహేతర సంబంధాలు మానే దిశగానే కాదు.. కుటుంబం, భార్యతో బాంధవ్యాలు పెంపొందించే దిశగా కౌన్సెలింగ్‌.. రిలేషన్‌షిప్‌ థెరపీ అవసరం. మారలేదనుకో, గృహహింస చట్టం ప్రకారం అతని మీద కేసు పెట్టు. ఈ లోపల భర్తతో శారీరక సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండు. ఆ స్త్రీలోలుడికి భార్యగా కొనసాగడం అవసరమా అన్నది కూడా ఆలోచించు. ఎలాగూ డిగ్రీ చదివావు. ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. ధైర్యంగా ఉండు. 

డాక్టర్‌ భారతి

సెక్సాలజిస్ట్‌, మారిటల్‌ అండ్‌ సైకోథెరపిస్ట్‌

డైరెక్టర్‌ జివిఎస్‌ రీసెర్చ్‌ సెంటల్‌ ఫర్‌ 

సెక్సువల్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌

హైదరాబాద్‌, 9849770409

[email protected]


logo