శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 05, 2020 , 00:19:13

పరిపూర్ణత్వ ప్రతీక!

పరిపూర్ణత్వ ప్రతీక!

గురువు దీక్ష ఇస్తాడు. దీక్ష అంటే కేవలం సమాచారం కాదు. దీక్ష అంటే.. వివేకంతో కూడిన అత్యున్నతమైన తెలివితేటలు. నీలో జ్ఞానాన్ని నింపడమే కాదు, నీలోని జీవశక్తిని వెలిగించేవాడు గురువు. గురువు సన్నిధిలో ఏం జరుగుతుంది? నీవు మరింతగా జీవించడం మొదలు పెడతావు. మీ శరీరంలోని ప్రతి కణమూ జీవంతో నిండిపోతుంది. నీ బుద్ధితో పాటు.. వివేకాన్ని, తెలివితేటలను ఉద్దీపింపజేస్తాడు గురువు. ఆ తెలివితేటల అత్యున్నత స్థితికి ఎరుక అని పేరు. మనసు చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. పున్నమి చంద్రుడు పూర్ణత్వాన్ని, అత్యున్నతమైన స్థితిని సూచిస్తాడు. శిష్యుడు (లేదా శిష్యురాలు) తన అత్యున్నతమైన స్థితిలోకి చేరుకునే రోజు, తాను సంపూర్ణంగా ఉండే రోజు - పూర్ణిమ. 

ఆ సంపూర్ణత్వంలో శిష్యుడు కృతజ్ఞతలు చెప్పడం తప్ప మరేం చేయగలడు? ఆ కృతజ్ఞత అనేది నీవు, నేను అనే (ద్వైత) భావనలో ఏర్పడేది కాదు. అది అద్వైతభావన. ఇది, ఒక నది మరొకనదిలోకి ప్రవహించడం లాంటిది కాదు. ఒక సముద్రం తనలోతానే కదలటం వంటిది. నది ఎక్కడో ప్రారంభమై మరెక్కడికో ప్రవహిస్తుంది. కానీ సముద్రం ఎక్కడకు వెళుతుంది? అది తనలో తానే కదులుతూ ఉంటుంది. గురుపూర్ణిమ శిష్యుని పూర్ణత్వాన్ని సూచిస్తుంది. శిష్యుడు కృతజ్ఞతా భావనలో మునిగి ఉత్సవం జరుపుకుంటాడు. మొట్టమొదటి గురువు దక్షిణామూర్తి. అనంతత్వం మూర్తీభవించిన రూపమే దక్షిణామూర్తి. అనంతమైన దైవ స్వరూపం, భౌతికమైన విశ్వంతో ఎంతో నైపుణ్యంతో అల్లుకున్న స్వరూపం అది. అనంతత్వమూ, భౌతిక విశ్వమూ ఒకే సమయంలో గోచరించే స్వరూపం అది.


logo