శుక్రవారం 07 ఆగస్టు 2020
Zindagi - Jul 04, 2020 , 00:49:13

ఆర్డర్‌..ఆర్డర్‌!

ఆర్డర్‌..ఆర్డర్‌!

ఇటీవల, రెండు ఉన్నత న్యాయస్థానాలు స్త్రీల పట్ల వివక్షనూ, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలనూ తీవ్రంగా గర్హించాయి. కాలం చెల్లిన చట్టాలను మార్చాల్సిన అవసరాన్ని చాటి చెప్పాయి. ఓ కేసులో తన భార్య నల్లగా ఉందని ఏకంగా హత్యకే తెగబడ్డాడు భర్త. మరొకటి అక్రమ ట్రాఫికింగ్‌ వ్యవహారం.

‘మనిషి రంగువల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయా? నల్లగా ఉండటమే తను చేసిన పాపమా? రంగు తక్కువగా ఉంటే ఏకంగా హత్యచేస్తారా?’ అంటూ కోల్‌కతా హైకోర్టు ఓ సందర్భంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసులో.. భార్య నల్లగా ఉందంటూ ఓ మొగుడు ఏకంగా ఆమెని హత్య చేశాడు. దానికి అతడి తమ్ముళ్లూ సహకరించారు. ఈ కేసులో భర్తతోపాటు మరుదులకు ఐపీసీ సెక్షన్‌ 498ఎ ప్రకారం జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్‌ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌ జిల్లాకు చెందిన యువతిని అదే ప్రాంతంలోని ఓ వ్యక్తికి ఇచ్చి  పెండ్లి చేశారు. కట్నమూ ముట్టజెప్పారు. ఆమె చామనఛాయగా ఉందన్న కోపంతో పెండ్లయిన మూడో రోజు నుంచే వేధించడం మొదలుపెట్టాడు భర్త. ఎప్పుడూ రంగు ప్రస్తావనే! భర్తతోపాటు మరుదులు సైతం సూటిపోటి మాటలు అనేవారు. ఆమెను ఇంట్లోంచి తరిమేసి, పశువుల కొట్టంలో బంధించారు. ‘ఆ నల్లదానితో కాపురం చేయలేను. తెల్లతోలు పిల్లను చూసి రెండో పెండ్లి చేసుకుంటాను’ అని భర్త ఆమె ముందే అనేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. ఆ అసహనం హత్య వరకూ వెళ్లింది. కోర్టు తీర్పుతో ఆ నేరానికి ఫలితం అనుభవిస్తున్నాడు. 

    

అమ్మాయిలంటే అంత చులకనా..?

‘ఒక నేరస్తుడు డ్రగ్స్‌ సరఫరా చేస్తూ పట్టుబడితే.. పది సంవత్సరాల జైలు శిక్ష విధించేలా చట్టం ఉంది. అదే ఒక అమ్మాయిని అక్రమ రవాణా చేస్తూనో, వ్యభిచార కూపంలోకి దించుతూనో పట్టుబడే వ్యక్తికి మాత్రం కేవలం మూడు సంవత్సరాల జైలు శిక్షా? అవసరమైతే, నేరస్తులు దర్జాగా బెయిల్‌పై విడుదలయ్యే అవకాశాలూ చట్టంలో ఉన్నాయి’ అంటూ ఒడిషా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.కె పాణిగ్రాహి ఓ విచారణ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మానవ అక్రమ రవాణాలో పట్టుబడినవారికి  బెయిల్‌ ఇవ్వడం వల్ల అమ్మాయిలకు భద్రత లేకుండా పోతున్నదని ఆవేదన చెందారు. నిజమే, చట్టాల్ని చుట్టాలుగా మార్చుకునే మనుషులు ఉన్నంత కాలం  ఆమెకు రక్షణ కరువే.


logo