మంగళవారం 11 ఆగస్టు 2020
Zindagi - Jul 03, 2020 , 02:41:32

తెలుగుపై మమకారం అకాడమీగా మారి..

తెలుగుపై మమకారం అకాడమీగా మారి..

ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని భాషలు నేర్చినా.. పీవీ నరసింహారావుకు మాతృ భాష తెలుగు అంటే, తెలుగు నేల అంటే అభిమానం ఎక్కువ. ప్రధాని అయ్యాక ఢిల్లీలో ఎవరైనా తెలుగువాళ్లు కనిపిస్తే వారిని కుటుంబసభ్యునిలా, ప్రేమతో పలకరించేవారు. అయితే, విద్యారంగంలో తెలుగుకు ప్రాధాన్యత లేకపోవడం ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. నిజాం ప్రభుత్వంలో ఉర్దూ మీడి యం, ఆ తర్వాత ఇంటర్‌ నుంచి అంతా ఇంగ్లిష్‌ మీడియమే కావడంతో తెలుగుకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన ఎప్పుడూ అనుకునేవారు. పీజీ వరకు తెలుగు మీడియం తీసుకురావాలని పట్టుదలతో ఉండేవారు. పీవీ కార్యదక్షత, ప్రజ్ఞా విశేషాలను గుర్తించిన బ్రహ్మానందరెడ్డి ఆయనకు విద్యాశాఖను అప్పగించారు. తనకిష్టమైన శాఖను చేపట్టడంతో ఆయన పలు కీలక సంస్కరణలు చేపట్టారు. అందులో అత్యం త కీలకమైనది తెలుగు అకాడమీ ఆవిర్భావం. డిగ్రీ వరకు తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. 


ఇతర రాష్ర్టాల్లో ఆయా భాషలకు జరుగుతున్న కృషిని అధ్యయనం చేశారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభు త్వం భారతీయ భాషలు, ప్రాంతీయ భాషల అభివృద్ధికి, వాటి ఆధునికీకరణకు ప్రతి రాష్ర్టానికి రూ.కోటి గ్రాంటును మంజూరు చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషాభివృద్ధికి, ఆధునికీకరణకు, సుసంపన్నతకు 1968 ఆగస్టు 6న తెలుగు అకాడమీని స్థాపించారు. విద్యావంతులను అందులో సభ్యులుగా చేసి తెలుగు పుస్తకాలను రాయించారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌, డిగ్రీ వరకు అన్ని సబ్జెక్టులను తెలుగులో తయారు చేయించారు. తెలుగు అధికారభాషగా, బోధనాభాషగా రూపుదిద్దే కార్యక్రమంలో, విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్య గ్రంథరచనలోనూ పారిభాషిక పదకోశాలను రూపొందించడంలో తెలగు అకాడమీ ప్రముఖ పాత్ర వహించింది. విద్యాశాఖమంత్రిగా ఉన్న పీవీ యే స్వయంగా తెలుగు అకాడమీకి చైర్మన్‌గా సారథ్యం వహించారు. ఆరేండ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆయన పట్టుదల, కార్యదీక్ష, దూరదృష్టి, విజ్ఞత వల్ల అనేక విద్యా సంస్కరణలు విజయవంతమయ్యాయి.

- స్పెషల్‌ డెస్క్‌


logo