మంగళవారం 11 ఆగస్టు 2020
Zindagi - Jul 02, 2020 , 23:32:37

పావురాలు

పావురాలు

ఒక ఊరిలో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పావురాలంటే ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను పెంచేవాడు. వాటికి పప్పులు, పళ్ళు పెట్టి పోషించడం వల్ల అవి ఎంతో అందంగా ఉండేవి. ఓ నాడు, గూళ్ళల్లోని పావురాలన్నింటినీ విడిచి పెట్టి వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ,  అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని  మురిసిపోయాడు. అంతలో ఆ పావురాలు నేలమీది చిన్నచిన్న రాళ్ళ పిసళ్ళను వెదుక్కొని తినసాగాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కలిగింది! అసహ్యం  వేసింది.  ‘మంచి మంచి పప్పులు, పళ్ళు పెడుతూవుంటే, ఇవి రాళ్ళు మింగుతున్నాయేమిటి?’ అన్న కోపం కూడా వచ్చింది. వెంటనే..  ‘మట్టి తినే ఈ పావురాలను పెంచడం నాదే తప్పు’ అనుకొంటూ, చేతిలో ఉన్న కర్రను, వాటి మీదికి బలంగా విసిరాడు. కర్రదెబ్బ తప్పించుకొని పావురాలన్నీ ఎగిరిపోయాయి.  

కానీ, పావురాలతో పాటు రాతి పిసళ్ళను మింగుతూవున్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగిలింది. దీనివల్ల అది పక్కకు ఒరిగి పడిపోయింది. ‘అయ్యో’ అనుకొంటూ దగ్గరకు వచ్చిన ఓ పావురంతో ఆ పిచ్చుక తన బాధను పంచుకుంది... ‘మన బతుకు ఇతడికి తెలియదు. తను పెట్టే పప్పులు, పళ్ళు తదితర  బలమైన ఆహారం తింటున్నాం. అవి జీర్ణం కావడానికి రాళ్ళు కూడా తింటాం. ఇదీ మన తిండి పద్ధతి! ఆ విషయం తెలుసుకోలేక, మనల్ని కొట్టి తరుముతున్నాడు. ఇలాంటి తెలివి తక్కువవాడి వద్ద ఉండటం మనదే తప్పు, ప్రమాదం కూడానూ, పద, పోదాం’ అంటూ పావురం సాయంతో పిచ్చుక ఎగిరి పోయింది! పావురాలన్నీ తలొక దిక్కుకూ పోయాయి. నిశ్చేష్టుడైన వెంకయ్య అలానే కూర్చుండి పోయాడు, ఆకాశంలోకి ఎగిరి పోతున్న పావురాల వంక చూస్తూ...!


logo