మంగళవారం 11 ఆగస్టు 2020
Zindagi - Jul 01, 2020 , 23:57:18

పిల్లల నోట..పెద్ద మాట!

పిల్లల నోట..పెద్ద మాట!

అపార జీవితానుభవం కలిగిన పెద్దలే కొన్ని సందర్భాల్లో మాటల కోసం తడుముకుంటారు, ఎలా చెప్పాలో తెలియక తికమకపడతారు. అసలు, మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తారు. కానీ, కొంతమంది పసివాళ్లు వయసుకు మించిన పెద్దరికాన్ని ్ర పదర్శిస్తారు. మాట్లాడకూడని మాటలూ మాట్లాడేస్తుంటారు. ఎందుకిలా?

ఎక్కడ నేర్చుకుంటారు ఇన్ని మాటలు? ఎలా వస్తాయి ఇన్నిన్ని ఆలోచనలు? ఆ తెలివికి మురిసిపోవాలో, ఆ అతి తెలివికి బాధపడాలో తేల్చుకోలేని పరిస్థితి కన్నవారిది. ఆ ఆరిందాతనం బంధుమిత్రులకు నవ్వు తెప్పిస్తే తెప్పించవచ్చు కానీ, అమ్మానాన్నలకు మాత్రం.. లోలోన కొత్త భయాలు మొదలవుతాయి. మొదట్లో ‘భలే తెలివైనవాడోయ్‌' అన్నవాళ్లే క్రమంగా ‘వాడి పిల్లలా... ముదుర్లు!’ అంటూ ఎగతాళి చేస్తారు. ‘జాగ్రత్త... బిడ్డల్ని అదుపులో పెట్టుకో’ అంటూ హెచ్చరిస్తారు. ‘ఇవన్నీ పూర్వజన్మ తెలివితేటలు.  గత జన్మలో మీ వాడు..’ అంటూ ఒకరిద్దరు కర్మసిద్ధాంతాన్ని జోడించే ప్రయత్నం చేస్తారు. వీటన్నిటి ఫలితంగా అమ్మానాన్నల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాన్నంతా మూటగట్టి పిల్లల మీద రుద్దేస్తారు. ఒకటిరెండు సార్లు ‘నా బాబు గుడ్‌బాయ్‌. నా పాప బంగారం. 

అలా మాట్లాడకూడదు. సరేనా?’ అంటూ ముద్దుముద్దుగా చెప్పిచూస్తారు. అయినా ఆ పిల్లలు వినరు. ఇక, ‘పళ్లు రాలిపోతాయ్‌, చెంప పగిలిపోతుంది’ తరహా హెచ్చరికలు జారీ అవుతాయి. ప్చ్‌.. అయినా మొండికేస్తారు. ఇంకేముంది, చేతులు లేస్తాయి. పసిబిడ్డలు కుదేలైపోతారు. కన్నవాళ్లని శత్రువుల్లా చూస్తారు. పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతారు. పెద్దలు వృత్తి ఉద్యోగాల మీద ధ్యాస పెట్టలేకపోతారు.  నిన్నమొన్నటివరకూ ప్రశాంతంగా ఉన్న ఇల్లు నరకంలా మారిపోతుంది. ఏ సమస్యను పరిష్కరించాలన్నా ముందు మూలాల్లోకి వెళ్లాలి. కారణాల్ని తెలుసుకోవాలి. పిల్లలు ప్రతికొత్త విషయాన్నీ  వినడం ద్వారానో, చూడటం ద్వారానో, చదవడం ద్వారానో తెలుసుకుంటారు. ఈ మూడు ద్వారాలలో... ఏదో ఓ మార్గం నుంచి ఆ పదజాలం బిడ్డ బుర్రకు చేరి ఉంటుంది. అదేమిటో కనిపెట్టాలి. 

సీరియళ్ల ప్రభావం

చిన్నారుల మీద టీవీ ప్రభావం ఎక్కువే. సాధారణంగా ఆ వయసులో  ఏ కార్టూన్‌ నెట్‌వర్క్‌నో ఇష్టపడతారు. హాస్యం కోసమని పిల్లల చానెళ్లలో ఒకట్రెండు క్యారెక్టర్లలోఇలాంటి ‘అతి’భాషని జొప్పించి ఉండవచ్చు. లేదంటే.. అమ్మో, నానమ్మో ఎటూ టీవీ సీరియళ్ల వీరాభిమానులే అయి ఉంటారు కాబట్టి,  ఆ సమయంలో పిల్లలు కూడా ఆ ధారావాహికలకు అలవాటుపడి ఉంటారు. ఆ సీరియళ్ల నిండా కుట్రలూ కుతంత్రాలే. పిల్లల  భాషకు మూలం,  ఆలోచనలకు ఆధారం అక్కడే ఉండవచ్చు. పనిమనుషులూ  వాచ్‌మెన్‌లూ చిన్నారుల్ని ముద్దుచేస్తూ.. వినోదానికి పెద్దపెద్ద మాటలు మాట్లాడిస్తుంటారు. స్కూల్లోనో, ట్యూషన్‌లోనో ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. పిల్లల మీద తోటి పిల్లల ప్రభావమూ ఎక్కువే.   

ఇల్లేబడి..

ఏ ఇంటి చిలుక ఆ ఇంటి పలుకులే పలుకుతుంది. కన్నతండ్రి మాటకు ముందూ, తర్వాతా బూతులు జోడిస్తూ.. తన పిల్లలు మాత్రం సంస్కారవంతమైన భాష మాట్లాడాలని అనుకోవడం దురాశే. అమ్మలు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లో బంధువులతోనో, స్నేహితులతోనో మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల పిల్లలు ఉన్నారన్న స్పృహతోనే సంభాషించాలి.  పదజాలాన్నీ జాగ్రత్తగా ఎంచుకోవాలి. మాట చిన్నదే కావచ్చు. కానీ దాని వెనుక అర్థం పెద్దది. ఆ వయసు పిల్లలకు జిజ్ఞాస ఎక్కువ. ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. దీనివల్ల బిడ్డల ఆలోచనలు దారితప్పుతాయి. ఇంట్లో ఎవరికైనా మద్యం, ధూమపానం తదితర అలవాట్లు ఉంటే.. పెద్దయ్యాక పిల్లలూ ఆ వ్యసనాలవైపు ఆకర్షితులు కావడానికి తొంభైశాతం అవకాశం ఉంది. అబద్ధాలు, భాష, సంభాషణా శైలి కూడా ఎంతోకొంత వారసత్వంగా వచ్చేవే. 

నచ్చజెప్పడమే మార్గం

‘మీరు చిన్నపిల్లలు. మీకేమీ తెలియదు’ అంటే ఏ పిల్లలూ ఒప్పుకోరు. వాళ్లను దార్లో పెట్టాల్సిన పద్ధతీ అది కాదు. మెల్లగా నచ్చజెప్పాలి. మంచిచెడులు వివరించాలి. వాల్మీకి మహర్షి  రాముడిని మృదుభాషి, హితభాషి, స్మితభాషి.. అని కొనియాడాడు. ఆ కథలన్నీ చెప్పాలి. పిల్లలతో మనం మాట్లాడే పద్ధతి కూడా మారాలి. ఒసేయ్‌, అరేయ్‌.. తదితర సంబోధనలు సరికాదు. చక్కగా పేరు పెట్టి పిలవాలి. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయిస్తే... పిల్లలు నేస్తాలతో ఆడుకునే అవకాశం కల్పించాలి. ఎప్పుడూ పెద్దల మధ్య ఉండటం వల్ల.. సహజంగానే పెద్దల భాష అలవడుతుంది. 

తెలివితేటల్నీ గుర్తించాలి

కొందరు పిల్లల్లో నిజంగానే వయసుకు మించిన ఆలోచనా శక్తి ఉంటుంది. మనం ఊహించనంత గ్రహణశక్తి ఉంటుంది. ఆ ప్రత్యేకతని గుర్తించి, సద్వినియోగం చేసుకునే అవకాశం ఇస్తే వాళ్లు బాల మేధావులు అవుతారు. ఆ కోవలోకి వచ్చే పిల్లలు.. తమను అర్థం చేసుకోలేకపోయినా, తమ తెలివితేటల్ని గుర్తించకపోయినా నిస్పృహకు గురి అవుతారు. ప్రతి విషయాన్నీ ‘ఎందుకు?’ అన్న ప్రశ్నతోనే మొదలుపెడతారు చిన్నారులు. మనం ఓపికగా జవాబు చెప్పాలి. అంతేకానీ, దాన్ని వాదనగా మార్చకూడదు. బాలబాలికల్లో స్వేచ్ఛా కాంక్ష ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి. 

ఓ పరిధికి లోబడి కొన్ని విషయాల్లో కొంత స్వేచ్ఛ ఇవ్వడం తప్పేమీ కాదు. రెండు సురక్షితమైన ఆప్షన్స్‌ ఇచ్చి... అందులో ఏదో ఒకటి ఎంచుకోమనవచ్చు. ఈ రోజు ఏం వండాలి? అని కాకుండా... క్యారెట్‌ వండాలా? బీట్రూట్‌ వండాలా? అని అడగవచ్చు. పోషక విలువల పరంగా రెండూ మంచివే. తెలివైన తల్లిదండ్రులు తాము చెప్పాలనుకున్నదే పిల్లలతో చెప్పిస్తారు. ఇన్ఫర్మేషన్‌ ఓవర్‌లోడ్‌.. పిల్లల చేతిలో చాలా సమాచారం ఉంటున్నది. మనం పదహారేండ్ల వయసులో తెలుసుకున్న విషయాలే, వీళ్లకు పదేండ్లకంతా తెలిసిపోతున్నాయి. సమాచారం వెనకాలే  పదజాలమూ వస్త్తుంది. పదజాలంతోనే భాష కూడా మారుతుంది. అలా అని, ప్రతి మార్పునూ స్వాగతించాలని లేదు. అందులోని మంచిని మాత్రమే గ్రహించాలి. ఇది కూడా.. పండ్లబుట్టలోని తీపి ఫలాల్ని  పిల్లలకు ఇచ్చి, పుచ్చుకాయల్ని చెత్తబుట్టలో పడేయడం లాంటిదే.


మంచిచెడులు తెలుసుకునే వయసు వచ్చే వరకూ కన్నవాళ్లు పిల్లల చుట్టూ ఓ సురక్షితమైన వలయాన్ని నిర్మించాలి. ఏం చూడాలి, ఏం చదవాలి, ఎవరితో మాట్లాడాలి.. అన్నది తామే నిర్ణయించాలి.  పిల్లలకు వయసుకు మించిన భాషను పరిచయం చేస్తున్నది  ఆత్మీయులైనా సరే.. వాళ్లను సున్నితంగా హెచ్చరించాలి.  ఆ వయసులో పిల్లలకు అర్థం కాని విషయాలూ, అపార్థానికి దారితీసే విషయాలూ కొన్ని ఉంటాయి. వాటితోనే ప్రమాదం. 

‘ఈ బట్టతల డాడీని ఎలా చేసుకున్నావ్‌ మమ్మీ? నేను ప్రేమించే వాడు మాత్రం.. ఆరున్నర అడుగులు ఉండాల్సిందే! మహేష్‌బాబులా స్మార్ట్‌గా ఉండాలి. సల్మాన్‌ఖాన్‌లా రఫ్‌గానూ కనిపించాలి’

- తల్లితో పదేండ్ల అన్విత మాటలివి.

‘పెద్దయ్యాక నేను మనుషుల్ని మర్డర్‌ చేయడం ఎలా? అనే పుస్తకం రాస్తాను డాడ్‌. ప్రతి సినిమాలోనూ హీరో ఒక్క విలన్‌ని చంపడానికి జీవితమంతా కష్టపడతాడు’

- తండ్రి ముందు ఎనిమిదేండ్ల అంకిత్‌ స్టేట్‌మెంట్‌. 

మనిషి చనిపోతే ఎందుకు బాధపడాలి. ఇట్స్‌ న్యాచురల్‌! 

- క్లాస్‌ టీచర్‌తో రామ్‌ వాదన. 

- వీరేందర్‌


logo