సోమవారం 03 ఆగస్టు 2020
Zindagi - Jul 01, 2020 , 23:57:18

నెలసరికి ముందే ఇలా ఎందుకు?

నెలసరికి ముందే ఇలా ఎందుకు?

నాకు 41 ఏండ్లు. పెండ్లయి పన్నెండేండ్లయింది. అంతకు ముందు బాగానే ఉండేది.  పెండ్లి తర్వాతే సమస్య మొదలైంది. పీరియడ్స్‌కు మూడు నాలుగు రోజుల ముందు ఒకట్రెండు చుక్కలు కనిపిస్తాయి.  ప్రతి నెలా ఇలాగే అవుతున్నది. ఎవరిని అడిగినా అసలు సమస్య ఏమిటో చెప్పడం లేదు. మీరైనా వివరించండి.

- వనజ, బెంగళూరు

సాధారణంగా హార్మోన్‌ సమతుల్యత దెబ్బతినడం వల్ల  ఇలాంటి సమస్య కనిపిస్తుంది. పెండ్లి తర్వాత కలయిక వల్ల గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌)లో ఇన్‌ఫెక్షన్లు రావడం సహజం. పదేపదే ఇన్‌ఫెక్షన్లు వచ్చి ఆ భాగంలో ఒరుసుకుపోయినట్టుగా కావచ్చు. గైనకాలజిస్టు పరీక్షచేస్తే సమస్య తెలిసిపోతుంది. నెలసరి ముందు గర్భసంచి ముఖద్వారం వైపు రక్తప్రసరణ ఎక్కువ కావడం వల్ల ఇలాంటిది కనిపించవచ్చు. కొన్నిసార్లు సర్విక్స్‌లో చిన్నచిన్న పాలిప్స్‌ ఏర్పడవచ్చు. వీటివల్ల కూడా ఇలా నెలసరి ముందు కొంచెం రక్తస్రావం కనిపించే అవకాశం ఉంటుంది. ఇకపోతే పెండ్లయిన కొత్తలో అమ్మాయికి శారీరకంగా, మానసికంగా రకరకాల ఒత్తిళ్లు కలుగుతాయి. ఎక్కువగా ఫంక్షన్లకు వెళ్లాల్సి రావడం, బయట తినడం వల్ల బరువు పెరుగుతారు. స్ట్రెస్‌, బరువు .. ఏ కారణంతో అయినా  హార్మోన్లలో తేడాలు వస్తాయి. దీనివల్ల కూడా సమస్య పెండ్లికాగానే కనిపిస్తుంది. ఇలాంటప్పుడు సర్విక్స్‌ భాగాన్ని పరీక్షించడం ద్వారా దాదాపుగా సమస్య ఏమిటో తెలిసిపోతుంది. తదనుగుణంగా చికిత్స తీసుకుంటే సరిపోతుంది. హార్మోన్ల అసమతుల్యతకు కూడా చికిత్స ఉంది. మరో విషయం ఏమిటంటే, మెనోపాజ్‌ ప్రారంభానికి అయిదేండ్ల ముందు నుంచి కూడా ఇలాంటి సమస్య కనిపించే అవకాశం ఉంటుంది. మీరు వెంటనే దగ్గర్లోని గైనకాలజిస్టును సంప్రదించండి. 


డాక్టర్‌ ఆండాళ్‌ రెడ్డి

కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌

అపోలో క్రెడిల్‌, హైదరాబాద్‌


logo