శనివారం 04 జూలై 2020
Zindagi - Jul 01, 2020 , 00:07:16

వైద్యం.. వృత్తి సేవ.. సంతృప్తి!

వైద్యం.. వృత్తి సేవ.. సంతృప్తి!

నేడు..డాక్టర్స్‌ డే

వ్యాధుల బాధలు ముసిరేవేళ.. మృత్యువు కోరలు సాచేవేళ.. మేమున్నామంటూ అభయమిస్తారు.. ఊపిరికి ఊపిరులూదుతారు. డాక్టర్లు ఆరోగ్య సైనికులు!  ఏ పరిస్థితుల్లో అయినా సిద్ధంగా ఉండాలి. మెడలో స్టెతస్కోప్‌తో మృత్యువు మీద యుద్ధానికి బయల్దేరాలి. జంతా, వారమంతా, నెలంతా, ఏడాదంతా.. ఆమాటకొస్తే జీవితమంతా వృత్తికే అంకితం కావాలి. వ్యక్తిగత జీవితం నామమాత్రమే. ఆ కొద్దిపాటి సమయాన్ని కూడా సమాజానికి కేటాయిస్తున్న డాక్టర్లూ ఉన్నారు.  ఎన్జీవోల ద్వారా...  పేదల్లోని మరింత పేదలకు అండగా నిలుస్తున్న వైద్యులు ఎంతోమంది. ఆ ‘స్వచ్ఛంద’ సేవకులకు ప్రతినిధులు.. డాక్టర్‌ మంజుల అనగాని, డాక్టర్‌ ఎస్‌. శిరీషా రాణి. ‘డాక్టర్స్‌ డే’ సందర్భంగా ఇద్దరి సేవా ప్రస్థానం..

దేవుడిచ్చిన అవకాశం

పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ మంజుల అనగాని పేరు తెలియనివాళ్లు చాలా తక్కువ. గైనకాలజీలో మొదటి లాపరోస్కోపిక్‌ సర్జరీ నిపుణురాలిగా ఆమె పేరు సుపరిచితం. రోగులతో కుటుంబ సభ్యురాలిలా కలిసిపోయి, ఆత్మీయవైద్యం అందిస్తారామె. ఒకచేత్తో గైనిక్‌ సర్జరీలు, బోధనలు.. మరోచేత్తో స్వచ్ఛంద సంస్థ నిర్వహణ. అక్కినేని సమంతతో కలిసి ‘ప్రత్యూష’ అనే ఎన్జీవోను నడుపుతున్నారు. ఆ సేవా ప్రయాణం మంజుల మాటల్లోనే..

మహిళలు తమ శరీరానికి రెండో ప్రాధాన్యం ఇస్తారు. తొలి ప్రాధాన్యం భర్త, పిల్లలు, కుటుంబానికే. ఏ చిన్న జబ్బు చేసినా మగవాళ్లు వెంటనే డాక్టర్‌ దగ్గరికి పరుగులు తీస్తారు. కానీ, ఆడవాళ్లే తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతారు. ఆడ పిల్లల విషయంలోనూ అంతే. డబ్బుల్లేవని చికిత్స కూడా చేయించరు. ఇంకోరోజు ఐసీయూలో పెడితే బాగవుతుందని చెప్పినా వినకుండా తీసుకెళ్లిపోతారు. 90వ దశకంలో చిన్న వయసులోనే ఆడవాళ్లు హిస్టరెక్టమీ (గర్భసంచి తీసేసే సర్జరీ) చేయించుకునేవాళ్లు. అపెండిక్స్‌ తీయించుకోవడానికి వచ్చి గర్భసంచి తీయించుకున్నవాళ్లూ ఉన్నారు. ఇలాంటి వాళ్లకు ఒక డాక్టర్‌గా అవగాహన కల్పిస్తూ ఉండేదాన్ని. మహిళల ఆరోగ్యంలో గర్భసంచి ఎంత కీలకమైందో వివరించేదాన్ని. అయినా సరే, చాలామంది హిస్టరెక్టమీకి సిద్ధపడేవారు. ఇది నన్ను చాలా కలవరపెట్టేది. అందుకే ఆడవాళ్లు, పిల్లల కోసం ప్రత్యేకంగా పనిచేయాలని  నిర్ణయించుకున్నా. నా ఆలోచనకు శామ్‌ (సమంత అక్కినేని) తోడయింది. అలా 2013లో... ‘ప్రత్యూష’ ప్రారంభమైంది. 

అలా పుట్టింది..

అంతకు ముందు కూడా నేను, శామ్‌ వేరువేరుగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లం. హిమోఫీలియా సొసైటీ లాంటి ఎన్జీవోలకు సాయం చేసేవాళ్లం. 2010 నుంచే సంయుక్తంగా ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాలన్న ఆలోచన ఉండేది. ఇది కేవలం వైద్యపరమైన సేవలకే పరిమితం కావాలని అనుకున్నాం. దీన్ని సమర్థంగా ముందుకు తీసుకుపోవాలంటే ఒక సెలబ్రిటీ అవసరం. కాబట్టే, ఆ బాధ్యతను సమంత తీసుకుంది. ఏవైనా ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు.. వాళ్లు ఇచ్చేదేదైనా ప్రత్యూష కోసం, ప్రత్యూష పేరు మీదనే ఇవ్వమని అడుగుతుంది. వైద్యపరమైన అంశాలన్నీ నేను పర్యవేక్షిస్తాను. అవసరంలో ఉన్న పేషెంట్లను గుర్తించే బాధ్యత మేనేజర్‌ శశి చూసుకుంటుంది. 

ప్రత్యూష  ఏం చేస్తుంది?

 • ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టింది. 
 • ప్రజల్లో అవగాహన: ఆరోగ్యం, జబ్బుల నివారణపై చైతన్యం. 
 • ఉచిత టీకాలు అందించడం. 
 • భావసారూప్యం ఉన్న ఎన్జీవోలకు మద్దతు: ‘మేక్‌ ఎ విష్‌ ఫౌండేషన్‌'కి కూడా ప్రత్యూష సహకారం అందుతుంది. పిల్లల కోరికలకు ఓ రూపం ఇవ్వడానికి ప్రత్యూష  తోడ్పాటును ఇస్తున్నది. 

పేదరోగులకు ఆర్థిక సాయం:  ప్రత్యూషకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చెన్నైలలోని చాలా హాస్పిటల్స్‌తో థర్డ్‌ పార్టీ అగ్రిమెంట్స్‌ ఉన్నాయి. హైదరాబాద్‌లో రెయిన్‌బో, అంకుర, లిటిల్‌ స్టార్‌ లాంటి దవాఖానలు ప్రత్యూషకు సపోర్టుగా ఉన్నాయి. డబ్బు లేకపోవడం వల్ల వైద్యం అందుకోలేని పరిస్థితిలో ఉన్న పిల్లలను గుర్తించి ఆర్థిక సహాయం చేస్తుంది ప్రత్యూష. చికిత్సకు అయ్యే ఖర్చులో మూడింట ఒక వంతు పెట్టుకుంటే చాలు. మరో వంతు ప్రత్యూష భరిస్తుంది. ఇంకో వంతు హాస్పిటల్‌ నుంచి అందుతుంది. 

చిన్నప్పటి నుంచే..


కష్టంలో ఉన్నవాళ్లకు ఏదైనా చేయాలని బాల్యం నుంచీ నా కోరిక. ఆ అవకాశం దేవుడు ఇలా ఇచ్చాడు. ఏదైనా ఒక సంస్థ విజయం సాధించాలంటే టీమ్‌ వర్క్‌ ఉండాలి. అదృష్టవశాత్తు మేం ముగ్గురం అలాగే ఉన్నాం. ముగ్గురి ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది. నేను డాక్టర్‌గా, సమంత నటిగా, శశి ఫ్యాషన్‌ డిజైనర్‌గా.. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూనే ప్రత్యూష కోసం పనిచేస్తున్నాం. ఒక్క పైసా కూడా తీసుకోం. ప్రత్యూష పనులు చూసుకోవడంతో పాటుగా బెంగళూరుకు చెందిన వరల్డ్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ (వ్యాప్‌), ఆంధ్రప్రదేశ్‌ బాడీ డోనర్స్‌ అసోసియేషన్‌, సావిత్రీబాయి పూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌కి మెడికల్‌ ఆడ్వైజర్‌గా పనిచేస్తున్నా. 

 • డాక్టర్‌ మంజుల అనగాని
 • గైనకాలజిస్టు, లాపరోస్కోపిక్‌ సర్జన్‌
 • మెడికవర్‌ మదర్‌ అండ్‌ చైల్డ్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌

ఆదుకోవడంలోనే ఆనందం

హెమటాలజిస్టుగా, బ్లడ్‌ క్యాన్సర్‌ స్పెషలిస్టుగానే కాదు..తలసీమియా-సికిల్‌ సెల్‌ సొసైటీ ప్రతినిధిగా కూడా ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి రోగులకు తోడుగా నిలుస్తున్నారు డాక్టర్‌ శిరీష. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఔషధం సేవేనంటున్నారు ఆమె.

తలసీమియా, సికిల్‌ సెల్‌ అనీమియా, హిమోఫిలియా లాంటి రుగ్మతలతో బాధపడే పసివాళ్లు.. ఒకవైపు జబ్బుతో, మరోవైపు చికిత్సకు అయ్యే ఖర్చుతో పోరాడాలి. అలాంటివాళ్లకు అండగా ఉండటానికే పుట్టింది తలసీమియా-సికిల్‌ సెల్‌ సొసైటీ (టీఎస్‌సీఎస్‌) అనే ఎన్జీవో. ఇలాంటి రక్త సంబంధ రుగ్మతలు ఉన్న  పిల్లలకు చికిత్స, ఇతర అవసరాల కోసం సహాయం అందిస్తుంది. ఇరవై రెండేండ్ల క్రితం ఎ.ఎన్‌. కృష్ణకుమారి దీన్ని స్థాపించారు. నేను ఆ సంస్థతో కలిసి పనిచేస్తున్నాను. 

తలసీమియా పేషెంట్లకు వయసు పెరుగుతున్నకొద్దీ.. నాలుగు వారాలకు ఒకసారి, మూడు వారాలకు ఒకసారి, రెండు వారాలకు ఒకసారి  రక్తం ఎక్కించాల్సి రావచ్చు. అలా 10 నుంచి 12 సార్లు రక్తం ఇచ్చిన తరువాత శరీరంలో ఐరన్‌ శాతం పెరిగిపోతుంది. దాన్ని నియంత్రించకపోతే కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, మెదడు, ఎండోక్రైన్‌ గ్రంథులు.. ఇలా కీలక భాగాలన్నీ దెబ్బతింటాయి. కాబట్టి, పదిసార్లు రక్తం ఎక్కించిన తర్వాత ఐరన్‌ ఎంత ఎక్కువ అయ్యిందో పరీక్షించాలి. దాన్ని నియంత్రించడానికి కీలేషన్‌ థెరపీ ఇవ్వాలి. ఆ తరువాత కూడా, ఎప్పటికప్పుడు ఐరన్‌ శాతాన్ని తనిఖీచేస్తూ ఉండాలి. ఇదంతా జీవితకాల చికిత్స. ఆ ఖర్చును సామాన్యులు భరించలేరు. మధ్యలోనే చికిత్స ఆపేస్తే పిల్లల ప్రాణాలకే ప్రమాదం. 


నేను ఇండియాకి వచ్చిన కొత్తలో.. రెయిన్‌బోలో చేరిన తర్వాత నా తోటి డాక్టర్‌ తలసీమియా సొసైటీ ద్వారా పిల్లలకు ఉచితంగా వైద్యం అందించేది. పేద పిల్లలకు నా వంతు సాయం చేసేందుకు ఇది మంచి మార్గమని అనిపించింది. నేను కూడా వాళ్లతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. దాదాపు పన్నెండు ఏండ్లుగా ఈ సొసైటీతో ఉన్నా. వీళ్లు నెలకి ఒకసారి క్యాంపులు నిర్వహిస్తుంటారు. అప్పుడు మాకు చెప్తారు. మేం వెళ్లి అవసరమైన వైద్యసేవలు అందిస్తాం. ఆ తరువాత కూడా రెయిన్‌బోకి వస్తే ఉచితంగా కన్సల్టేషన్‌ ఇస్తాం. ఈ సొసైటీ ద్వారా ఉచితంగా రక్తం ఎక్కిస్తాం. వాళ్ల ఎదుగుదల ఎలా ఉంది, రక్తంలో ఇనుము పెరగడం వల్ల వచ్చే కాంప్లికేషన్లు, ఎండోక్రైన్‌ పనితీరు, బయోకెమికల్‌ పరీక్షల లాంటి హెమటాలజీకి సంబంధించిన సేవలన్నీ చూసుకుంటాను. రెయిన్‌బో చిల్డ్రన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా కూడా అనేక రకాలుగా వైద్యసేవలందిస్తున్నాం. 

దీర్ఘకాలిక జబ్బులున్న పిల్లలను వాటికి తగిన ఎన్జీవోలకు సిఫార్సు చేస్తాం. నేను చూసేవి ఎక్కువగా బ్లడ్‌ క్యాన్సర్‌ కేసులే. అలాంటి పిల్లల కోసం కూడా నిధులను సమకూరుస్తాం. క్యాన్సర్‌ పేషెంట్ల కోసం ముంబయి, ఢిల్లీ లాంటి చోట్ల వేర్వేరు సంస్థలు ఉన్నాయి. మా దగ్గరకు వచ్చిన రోగి వివరాలతో ఒక లేఖ రాసి వాళ్లకు పంపిస్తాం. వాళ్ల ద్వారా ఈ పిల్లలకు సహాయం చేస్తాం. అవసరం అయితే ప్రజల నుంచి కూడా నిధులు సమీకరిస్తాం. పీడియాట్రిక్‌ క్యాన్సర్‌ పేషెంట్ల కోసం హైదరాబాదులో కూడా ప్రత్యేకంగా సెయింట్‌ జూడ్‌ చారిటీ హోమ్‌ అనే సంస్థ ఉంది. దానికి కూడా మా వంతు సహకారం అందుతుంది.  ఎంత పనిలో ఉన్నా.. వైద్యపరంగా కష్టంలో ఉన్నవాళ్లకు సాయం చేయడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.  ఒక జీవితం నిలబడిందనే ఆనందం ముందు.. అదో శ్రమే కాదు.  

 • డాక్టర్‌ ఎస్‌. శిరీషా రాణి
 • సీనియర్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రిక్‌ 
 • హెమటాలజిస్ట్‌, ఆంకాలజిస్ట్‌
 • రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo