శనివారం 04 జూలై 2020
Zindagi - Jul 01, 2020 , 00:07:16

‘కనిపించని’ ఆకలి!

‘కనిపించని’ ఆకలి!

అసలే కరోనా కాలం.. ఎప్పుడు ఎటువైపు నుంచి, ఎవరి ద్వారా ఆ వైరస్‌ మనపై దాడి చేస్తుందో తెలియని స్థితి. ఈ  పరిస్థితుల్లో పరిసరాల పరిశుభ్రతే కాదు. ఒంట్లో సత్తువ కూడా ముఖ్యమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకు పౌష్టికాహారం కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు.

రోజూ కడుపునిండా తినేస్తున్నాం కదా! అని అనుకోకుండా, శరీరానికి తగినన్ని పోషకాలనూ అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనాను  ఎదుర్కోవడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పాటును అందించే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలను ఒంటబట్టించుకోవాలని వివరిస్తున్నారు. తినే తిండిలో శరీరం అడుగుతున్నదెంత? మనం ఇస్తున్నదెంత? తదితర ప్రశ్నలు వేసుకుంటే మన ఆరోగ్యస్థితి మనకు అర్థం అవుతుంది. కడుపు నింపుకోకుండా మన ఒంట్లోని కణాల ఆకలి తీర్చాలి. అంటే.. కావాల్సిన పోషకాలను అందించాలన్న మాట. కణాలు రోజూ.. తమ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి కావాల్సిన పోషకాల కోసం ఎదురుచూస్తుంటాయి. దీన్నే శాస్త్రీయ పరిభాషలో అదృశ్య ఆకలి (హిడెన్‌ హంగర్‌) అని పిలుస్తారు. మనం ఆ ఆకలిని తీర్చినప్పుడే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. మనం రోజూ ఏ ఆహారం ఏ మోతాదులో తినాలో సూచిస్తూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ఓ పట్టికను రూపొందించింది. కరోనా వేళ దీనిని కచ్చితంగా పాటించాలని  సూచిస్తున్నది.

పోషకాలు చేసే మేలు..

మన ఒంటికి వివిధ మార్గాల ద్వారా రెండు వేల కిలో క్యాలరీల పోషకాలు అందాలి. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు తగిన మోతాదులో ఉండాలి. పోషకాహారంతోనే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే బ్యాక్టీరియా, వైరస్‌ వంటి రోగకారక సూక్ష్మక్రిములపై పోరాటం చేయవచ్చు. శరీరంలోని మేలు చేసే బ్యాక్టీరియా సంతతిని కాపాడుకోవచ్చు. అంతేకాదు, రక్తంలో చక్కెరస్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం దరిచేరదు.  కొవ్వు పేరుకుపోదు. ఫలితంగా గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. రక్తంలో మూలకాల స్థాయి నియంత్రణలో ఉంటుంది. దాంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు. పీచుపదార్థాలు సరైన మోతాదులో అందితే మలబద్ధక సమస్యే ఉత్పన్నం కాదు.  గుడ్లు, చేపలు, మాంసం వంటివి చిరుధ్యానాల స్థానాన్ని భర్తీ చేస్తాయి. కూరగాయలను నేరుగా కూడా తీసుకోవచ్చు. జ్యూస్‌ల కన్నా పండ్లను నేరుగా తినడం ఉత్తమం. ఎప్పుడూ ఒకే వంటనూనె కాకుండా.. పల్లి, కుసుమ, రైస్‌బ్రాన్‌ ఇలా వివిధ రకాలను ప్రయత్నించాలి.

మన పళ్లెంలో ఉండాల్సిన మోతాదు (ఎన్‌ఐఎన్‌ ప్రకారం) 

ఆహారం
రోజుకు (గ్రా.ల్లో)
ధాన్యాలు
270
చిరుధాన్యాలు
90
పాలు/పెరుగు
300
కూరగాయలు
300
పండ్లు
100
గింజలు
20
నూనెలు
27


logo