సోమవారం 06 జూలై 2020
Zindagi - Jun 30, 2020 , 00:06:02

లగ్గమైంది.!

లగ్గమైంది.!

అందరికీ శనార్తులు.. 

వార్తలకు స్వాగతం.. నేను మీ పోశమ్మ. 

ముందుగాల ముందుగాల.. ముఖ్యాంశాలు. 

బొమ్మతోటి లగ్గం.. దావతిల పట్టిండ్రు పగ్గం

బొంబాట్‌ పిలగాడు.. ఇసొంటోడెక్కడా తగలడు 

బొచ్చెడు జెనాలు.. మందుతోటి మస్తు తానాలు  

లగ్గమై ఒకడేడిస్తే.. లగ్గంగాక ఒకడేడ్శిండంట సూడుండ్రి. గట్లనే ఉందొక పోరగాని కత. 

దగ్గెర్‌ దగ్గెర ముప్పై ఐదేండ్ల ఈడొచ్చింది. ఐనా ఏడ పిల్ల దొర్కలేదు. చూసి చూసి యాష్టకొచ్చి.. ఏ ఛల్‌.. లగ్గంజేస్కోవాలంటే పిల్లనే చేస్కోవాల్నా? దిష్టిబొమ్మను చేస్కుంటే తప్పేముంది? 

ఎవ్వలెట్ల అన్కుంటె నాకేంది?  నా పెండ్లి నా యిష్టం.. అన్కుంట బొమ్మకు బాషింగం సుట్టి.. తల్వాలు పోసుకుంట తాళి కట్టిండొక పిలగాడు.! 

పిచ్చి కుదిర్తేగానీ పెండ్లిగాదు.. పెండ్లయితేగానీ పిచ్చి కుద్రదు అంటర్‌ గదా? అది తెల్వనట్టుంది మనోడికి. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగల శివమోహన్‌ అనే ముస్లాయ్నె ఉంటడు. ఆయ్నె శిన్న కొడుకు పంచెరాజు. పదేండ్ల నుంచి కొడుక్కు పెండ్లి సమ్మందం చూస్తుండ్రు. 

పంచెరాజుకు కొంచెం తెల్వి తక్వుందంట. అందుకే పిల్లనిచ్చేటందుకు ఎవలూ ఒస్తలేరు. 

నాకేమైంది బాగనే ఉన్నగదా? ఆళ్లింటి పొంటి ఈళ్లింటి పొంటి తిర్గి పిల్లనియ్యిరయ్యా అని అడగాల్నా?  బాశింగ బలం గట్టిగుంటే.. అదే ఐతదని భరోసతోటి ఉండంట పంచెరాజు. 

ఏండ్లు గడుస్తున్నయ్‌గనీ జాడలేదు జవాబ్‌ లేదు. 

అన్ని అన్కున్నట్టు జర్గితే.. ఇయ్యాల్ల.. ఇద్దరు పిల్లల తండ్రి మనోడు. 

కానీ ఏంజేస్తం? రాశిపెట్టి లేనట్టుంది. ఇంతకంటే ఎక్కేం చేస్తం అన్కొని బొమ్మతోటి లగ్గం చేసుకుండు. 

ఓర్నీ.. పోరడా.. ఎంత లగ్గంగాకపోతే మాత్రం గిట్లజేస్తవా? గట్టిగ దెవ్లాడితే దొర్కకపాయెనా? అని ఎవలేమన్నా పట్టించుకోలేదు. ఖుషీతోటి పంచెరాజు పెండ్లి జోరుగ చేస్కుంటే తేరుసాగినట్లు జెనాలొచ్చిండ్రంట. 

చెక్కతోటి తయార్జేసిన దిష్టిబొమ్మకు ఎర్ర శీరె.. బంగారి సొమ్ములు.. పూలు పుదిచ్చి పిలగాని పక్కన పీటెమీద కూసుండవెట్టిర్రు. 

లగ్గంయాల్ల కాంగనే పంతులు మంత్రాలు సదువుడు మొదలువెట్టిండు. జిల్కరబెల్లం.. ఏడడుగులు.. అన్నీ సుట్టాల శేతిమీదికెల్లి నడ్శినయి. 

ఆ ఊళ్లె ఎవరూ చేస్కోనంత గొప్పగ పెండ్లి చేస్కొని ఊరోళ్లందరికీ గట్టి దావతిచ్చిండంట  కూడా. 

మనోడు బొమ్మను లగ్గం చేస్కోనీకె బలమైన కారణం గూడ ఉందంట. 

వాళ్ల నాయ్నె శివమోహన్‌ పానం మంచిగలేదంట. 

సూడు బిడ్యా.. నేను అందరి పెండ్లిళ్లు చేసిన. నీ ఒక్కనిదే చేయలే. పానం దినదినానికి దగ్గరైతుంది. నీ పెండ్లి సూస్తనో సూడనో. 

నేను బత్కున్నప్పుడే నాలుగిత్తులు నెత్తిమీదేస్కొని ఓ ఇంటోడివైతే నాకు నిమ్మలముంటది. 

అని తండ్రి తండ్లాడితే బొమ్మతో బొంబాట్‌ లగ్గం జేస్కొని నాయ్నెను ఖుషీ చేసిండు పంచెరాజు. 


logo