ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 28, 2020 , 23:49:03

ఆధునిక.. వస్త్రశిల్పి

ఆధునిక.. వస్త్రశిల్పి

ఫ్యాషన్‌ ప్రపంచంలో బ్రాండ్‌కి, లేబుల్‌కి తేడా ప్రత్యేకమైంది. బ్రాండ్‌ అంటే సొంత వ్యక్తిత్వం. మీదైన పంథా. మీకే చెల్లిన ప్రత్యేకమైన పోకడ. అదే లేబుల్‌..  వివిధ రకాల ప్రత్యేక బ్రాండ్ల గురించి తెలియజెప్పేది. ఆయా బ్రాండ్లకి తనదైన అధికార ముద్ర వేసి మొత్తంగా ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఏలాలనుకునే ధోరణిని చాటేది. అట్లా చూస్తే, లేబుల్‌ పేరిట అర్చనరావు తనదైన ఫ్యాషన్‌ ప్రపంచానికి పెట్టుకున్నపేరే ఆమె స్వతంత్ర వైఖరిని, విజయ కాంక్షను చాటుతున్నది. చిత్రమేమిటంటే, ఇదంతా ఆమె దేశీయ వస్త్రశైలితోనే సాధించడం. అయినా, ప్రపంచ ఆమోదం పొందడం. ఇరుకైన ఫ్యాషన్‌ ప్రపంచంలో చురుగ్గా రాణిస్తున్న అర్చనరావు వికాసం నేటి ‘జిందగీ’ ప్రత్యేకం.

హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ అర్చనరావు ఆధునిక వస్త్ర కోవిదురాలు. కానీ ఆమె స్ఫూర్తి పొందేది మాత్రం భిన్న సంస్కృతులు, సంప్రదాయాల నుంచే. తాను అత్యాధునిక కాలం అమ్మాయే. అయినా, పాతకాలం వస్తువులే తనకు ప్రేరణ. వాటిలోంచే అనూహ్యమైన నూతన శైలిని ఆవిష్కరించి విస్మయపరుస్తారు. ఆ అభిరుచే ఆమెను చక్కటి ఫ్యాషన్‌ డిజైనర్‌గా ప్రపంచానికి చాటింది. ‘మహానటి’ సినిమాకు నాటి కాలానికి తగ్గ వస్త్రధారణను డిజైన్‌ చేసే అవకాశాన్నీ కలిగించింది. ఆ పనితనానికిగానూ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ పురస్కారం అందుకునేలా చేసింది.

అర్చనది చురుకుదనం, గాంభీర్యం కలగలిసిన వ్యక్తిత్వం. చరిత్ర అధ్యయనం తన అభిరుచి. ఆమె దేశీయ ఫ్యాబ్రిక్‌నే వాడతారు. దానికి ఎంబ్రాయిడరీ పనితనం, నేతకళా జోడించి వస్త్ర ప్రపంచంలో తనదైన సంతకాన్ని ఆవిష్కరించారు. అర్చన తండ్రి వెంకటేశ్వర్‌రావు వైద్యులు,  స్వస్థలం కామారెడ్డి. తల్లి విజయరావుది హైదరాబాద్‌. అర్చనకి చిన్నప్పటి నుంచే కళలపై మోజు. అదే తనని  హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో చదివేలా చేసింది. తర్వాత అర్చన న్యూయార్క్‌లోని పార్సన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం, కౌఫ్‌ మన్‌ ఫ్రాంకో, TSE డిజైనింగ్‌ కలెక్షన్స్‌కు పని చేయడం చక్కటి అనుభవాన్ని ఇచ్చింది. ఆమెలోని డిజైనర్‌కి అక్కడే ఒక రూపం వచ్చింది. ‘ఇక నేను ఆగలేదు. సాంకేతికతను అందిపుచ్చుకుని నా భారతీయ మూలాల వైపు దృష్టి సారించాను. హైదరాబాద్‌ తిరిగి వచ్చి నా సొంత లేబుల్‌ స్థాపించాను’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పారామె. 

నగరంలో ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌


అంతర్జాతీయ అనుభవంతో అర్చన శరవేగంగా తన ఫ్యాషన్‌ సామ్రాజ్యాన్ని విస్తరించారు. తన లేబుల్‌ని అభిరుచి ఉన్న వినియోగదారుల వద్దకు చేర్చగలిగారు. ఫ్యాషన్‌ పండితుల దృష్టిలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ అనుభవంతోనే, 2015లో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అత్యాధునిక హంగులతో  ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌ని ప్రారంభించారు.  

అర్చనరావు లేబుల్‌

2011లో తన మానస పుత్రికగా ‘అర్చనరావు లేబుల్‌'ను ప్రారంభించారు. ఇక వెనుదిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆ తర్వాత ఏడాదే లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో జెనరేషన్‌ నెక్ట్స్‌ విభాగంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ తర్వాత, 2013లో వోగ్‌ ఇండియా ఫ్యాషన్‌ వేడుకకు ఎంపికకావడం మరో మలుపు. దాంతో అర్చన ఫ్యాషన్‌ రంగంలో మేటి డిజైనర్లను నేరుగా కలుసుకోగలిగింది. తన లేబుల్‌ని విశ్వవ్యాప్తం చేసుకోవడానికి కావాల్సిన మేనేజింగ్‌ మెలకువలు, సృజనాత్మకత అక్కడే అలవడ్డాయి. అంతేకాదు, క్యాష్‌ ప్రైజ్‌తో పాటు వరించిన వోగ్‌ మెంటర్‌షిప్‌ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వెన్నుదన్ను అందించింది. ఆ తర్వాతి ఏడాదే అమెజాన్‌ ఇండియా ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొనడమూ అర్చనకు కలిసి వచ్చింది. కాలాతీతంగా మన్నే ఫ్యాషన్‌ అంటే అర్చనకు ఇష్టం. అందువల్ల తనదైన సృజన సంక్షోభంలో పడే పరిస్థితి లేదని అన్నారు. ‘నా వరకు నాకు ఫ్యాషన్‌ అన్నది ప్రత్యేకమైన స్పర్శానుభూతితో కూడిన శాస్త్రం. ఈ రెండు అంశాలతో నా కళను విభిన్నంగా మలిచేందుకు ప్రయత్నిస్తుంటాను, అది కూడా ఆడంబరం లేకుండానే’ అన్నారు. నిజమే. తన వస్త్రశైలి అంతా కూడా.. సూక్ష్మం (Minimalistic), సంక్షిప్తం (Understated),  సమకాలీనం (Contemporary) - ఈ మూడు అంశాల చుట్టే తిరుగుతుంది. అదీ భారతీయ మూలాలను వదలకుండానే. 

మూవీ ైస్టెలింగ్‌.. 


2018లో అర్చన కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మరో అంకాన్ని ప్రారంభించారు. ఆమెలోని సృజనాత్మక వ్యక్తీకరణకు ఇదో సవాలు. ఇందులోనూ తనను తాను నిరూపించుకున్నారు. పని చేసిన తొలిసినిమా ‘మహానటి’తోనే సంచలనం సృష్టించారు. ఆ పిరియాడిక్‌ చిత్రంలో నటీనటుల వస్ర్తాలంకరణకు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ ఒక్క సినిమాయే కాదు, ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన ‘జెర్సీ’ చిత్రానికి కూడా పనిచేశారు. అతిత్వరలో మరో అగ్రశ్రేణి చిత్రానికి  తన నైపుణ్యాన్ని జోడించనున్నారు. ఆ వివరాల్ని అధికారికంగా వెల్లడిస్తానని అర్చన చిరునవ్వుతో చెప్పారు.

భారతీయ వస్త్రశైలి 

అర్చనరావు రూపొందించే వస్ర్తాలు నోస్టాల్జియాని కలిగిస్తాయి. ధరించిన వారిలో... సంగీతాన్ని తలపించే పురాజ్ఞాపకాల దొంతరని సుతారంగా కదుపుతాయి. ఆయా వస్ర్తాలు ఒంటికి మన్నికనివ్వడమే కాదు, మనసుకు ఒకింత నిమ్మళాన్నీ కలిగిస్తాయి. ఇందుకు కారణం డిజైనింగ్‌కి తానెంచుకునే వస్త్రం. రంగులు, ఎంబ్రాయిడరీ, ఆయా ప్రింట్ల ప్యాటర్న్‌లు అవన్నీ కలిసి వస్త్రధారణని ఒక ప్రత్యేక అనుభవంగా మలుస్తాయని అంటారామే. నిజానికి ఆమె సౌందర్యాత్మ ఆధునికం, అదే సమయంలో భారతీయం కూడా. ముందే చెప్పినట్టు, తాను తరచూ ఎంచుకునేది స్థానిక ఫ్యాబ్రిక్‌నే. దానికి ఎంబ్రాయిడరీ పనితనం, నేతకళా తోడై ఆధునిక రీతిని  సంతరించుకుంటాయి. ఆమె లేబుల్‌కి మరో సబ్‌ బ్రాండ్‌ ఉంది. దాని పేరు ఫ్రూ ఫ్రూ. ఇది ఫ్రెంచి పదం. చేతితో రుద్దితే మెత్తగా సదరు వస్త్రం చేసే శబ్దరవాన్నే ఆమె బ్రాండ్‌ నేమ్‌గా ఎంచుకున్నారు. దీనికింద రెడీమేడ్‌గా ధరించడానికి వీలున్న పలు రకాల దుస్తులు, బ్యాగ్‌లు, పాదరక్షలు, ప్రత్యేకమైన స్టేషనరీ, ఇతర ఆర్ట్‌వర్క్‌లను స్వయంగా డిజైన్‌ చేసి స్టోర్‌లో అందుబాటులో పెడుతున్నారు. ‘నిజానికి నా తొలి లేబుల్‌ ఇదే. న్యూయార్క్‌ కేంద్రంగా  పాశ్చాత్య ప్రపంచానికి దుస్తులు డిజైన్‌ చేసే క్రమంలో ఆ పేరు పెట్టాను. అయితే, మన

దేశాన్ని కేంద్రంగా చేసుకుని హైదరాబాద్‌ నుంచి పని చేయాలనుకున్నాక, దాన్ని సబ్‌ బ్రాండ్‌గా ఉంచి.. నా పేరిటే లేబుల్‌ని ప్రారంభించాను’ అని వివరించారు అర్చన.

జీవిత భాగస్వామి : కుటుంబ లేబుల్‌


అర్చనది ప్రేమ వివాహం. భర్త అఖిల్‌రెడ్డి ఫొటోగ్రాఫర్‌, ఎకోస్‌ ఫొటో ఆర్ట్‌ వ్యవస్థాపకులు. వివిధ సమస్యలపై స్పందించే కళాకారుల వేదిక ‘దబాకీ’ డైరెక్టర్‌. తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ కార్యదర్శి కొమ్మిడి విశ్వేందర్‌రెడ్డి కుమారుడు. తల్లిదండ్రుల గురించి చెబుతూ, ‘నాన్న నుంచే నాకు పట్టుదల వచ్చింది. అమ్మ నుంచి నా కళాహృదయం వికసించింది’ అన్నారు అర్చన. ఇక భర్త, తన సృజనకు అందమైన అండాదండా అని చెబుతారు. అర్చన కలెక్షన్స్‌ను చూడాలంటే బంజారాహిల్స్‌లోని తన లేబుల్‌ స్టోర్‌ని సందర్శించవచ్చు. వివరాలకు: www.archanaraolabel.com.


  • కందుకూరి రమేష్‌ బాబు


logo