శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 29, 2020 , 00:04:00

అహంకారపు సింహం

అహంకారపు సింహం

అనగనగా ఒక అడవిలో ఓ బలమైన సింహం ఉండేది. దృఢమైన పండ్లతో, చేతి గోర్లతో అన్ని జంతువులనూ  చంపుతూ ఉండేది. తన బలాన్ని చూసుకొని  అహంకారంతో విర్రవీగేది.  దాని ఆకలికి ఎన్నో జంతువులు బలయ్యాయి. అదే అడవిలో ఒక జింక, కుందేలు స్నేహితులుగా ఉండేవి. సింహం గురించి తెలుసుకున్న ఆ రెండూ, దానికి బుద్ధి చెప్పాలని అనుకున్నాయి. ఒక ఉపాయం వేసుకున్నాయి.

ఒకరోజు జింక, కుందేలు ఆడుకొంటున్నాయి. వాటిని సింహం చూసింది. ముందుగా కుందేలును తినాలనుకుంది. సింహం రాకను పసిగట్టిన ఈ రెండూ తమ ఉపాయాన్ని అమలులో పెట్టాయి. సింహాన్ని చూసిన కుందేలు పరుగు తీసింది. సింహం కూడా దాని వెనకాలే పరిగెత్తింది. కుందేలు రెండు బండరాళ్ల మధ్యలోకి వేగంగా దూరిపోయింది. సింహం తన వేగాన్ని అపుకోలేక వెళ్లి బండరాయికి గుద్దుకుంది. దీంతో దాని పండ్లు రాలిపోయాయి. కుందేలు చిక్కకపోవడంతో దాని కండ్లు  జింక మీద పడ్డాయి. జింక ఓ దృఢమైన చెట్టు దగ్గర నిల్చుని ఉంది.  ఎలాగైనా దాన్ని తినాలనుకొని సింహం దానివైపు పరిగెత్తింది. సింహం రాకను గమనించిన జింక అప్రమత్తం అయింది. అది దగ్గరకు వచ్చి మీద దూకగానే క్షణాల్లో జింక పక్కకు తప్పుకుంది. సింహం పంజా చెట్టును తాకింది. దీంతో చేతిగోర్లు విరిగిపోయాయి. నోటి నుంచి, గోర్ల నుంచి రక్తం బొటబొటా కారసాగింది. ఉపాయం ఫలించిందని జింక, కుందేలు  సంతోషించాయి. గాయాలతో సింహం  దుఃఖించింది. అహంకారం వల్ల  అపజయమే తప్ప, సంతోషం లభించదని సింహానికి అర్థమైంది.

- దేవరకొండ ప్రవీణ్‌,ఆలేరు, యాదాద్రి జిల్లా(శుక్రవారం నాటి సంచికలో ‘కథ రాస్తారా?’శీర్షికలో ఇచ్చిన ఐదు పదాలకు స్పందన)


logo