శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 27, 2020 , 23:45:04

పీవీ, కేసీఆర్‌ ఇద్దరూ ఇద్దరే

పీవీ, కేసీఆర్‌ ఇద్దరూ ఇద్దరే

చరిత్ర అద్భుతాలకు ఆలవాలం. సామాజిక పరిణామ క్రమంలో మనం ఒక బిందువు దగ్గర నిలబడి వెనక్కి తిరిగి చూస్తే గత చరిత్రకు  వర్తమానానికి నడుమ  కనిపించే  సామ్యం ఆశ్చర్యాన్ని ఆసక్తిని కలిగిస్తుంది. ఆ సామ్యత వ్యక్తుల నడుమనైనా  కావచ్చు, సంఘటనల నడుమనైనా కావచ్చు పీవీ నరసింహారావు శతజయంతి అటువంటి ఒక ప్రత్యేక సందర్భం.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో పీవీ నరసింహారావు ప్రాసంగికత, మరింత పెరిగింది. ప్రధాని పదవిని అధిరోహించిన ప్రప్రథమ దక్షిణ భారతీయుడుగానే కాకుండా, తెలంగాణ భూమిపుత్రుడిగా పీవీకి నూతన అస్తిత్వ కోణం అమరింది. పీవీ శతజయంతిని ఆయన ఔన్నత్యాన్ని, సాహిత్య సంపత్తిని, సాధికార ప్రతిపత్తిని చాటే విధంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాయత్తమయ్యారు. పీవీ, కేసీఆర్‌ ఇద్దరివీ చాలా విశిష్టమైన వ్యక్తిత్వాలు. వీరిరువురూ దేశచరిత్రను మలుపు తిప్పిన నాయకులు. ఇద్దరూ గ్రామీణ భూస్వామ్య కుటుంబాల నేపథ్యంలో పుట్టి  ఉద్యమాల వైపు రావటమే కాకుండా నాయకత్వం వహించారు. ఇద్దరూ సాహిత్యప్రియులు. 

తెలంగాణా సాయుధ పోరాట సందర్భం పీవీలో రాజకీయ చైతన్యానికి బీజాలు నాటింది. హైదరాబాద్‌ సంస్థానంలో వందేమాతరం గీతాలాపనపై  నిషేధం అమలులో ఉన్నప్పుడు ఉస్మానియా హాస్టల్‌లో  వందేమాతర గీతాన్ని గొంతెత్తి పాడిన సాహసి పీవీ. అందుకు  రాజ్యధిక్కార నేరం కింద హైదరాబాద్‌ రాజ్యంలోని విద్యాలయాలలో ప్రవేశం నిరాకరించారు. ఈనేపథ్యంలో పీవీ ఉన్నత విద్యకోసం నాగపూర్‌ విశ్వవిద్యాలయంలో చేరారు. రామానంద తీర్థ ప్రభావంతో హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకునిగా ఎదిగారు. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ కొంతకాలం సాయుధ ప్రతిఘటనలో పాల్గొన్నది. నరసింహారావుకు  పూనా, ఆగ్రా, బెంగళూరు నుంచి తెలంగాణ ఉద్యమ వీరులకు ఆయుధాలు పంపించిన చరిత్ర ఉంది. తెలంగాణ అన్న మాటనే నిషేధించినచోట స్వాభిమాన సమరాన్ని జ్వలింప చేసిన ఘనత  కేసీఆర్‌ది. ఇద్దరికీ విధి నిషేధాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన చరిత్ర ఉంది.

పీవీ, కేసీఆర్‌  ఇద్దరినీ తెలంగాణా ఉద్యమమే ముఖ్యమంత్రుల్ని చేసింది. 1969లో చెలరేగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీద అప్పటి ముఖ్యమంత్రి  కాసు బ్రహ్మానందరెడ్డి దారుణమైన అణచివేతను ప్రయోగించాడు, కనుక ఆయనను   ముఖ్యమంత్రిగా  తెలంగాణ ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. ఈ దశలో తెలంగాణా నాయకునికే ముఖ్యమంత్రిగా పగ్గాలు అప్పగించాలనే ఉద్దేశంతో  కేంద్రం పీవీని ముఖ్యమంత్రిని చేసింది. ఆంధ్రా నాయకులు ఆయనను ముఖ్యమంత్రిగా నిలువనివ్వలేదు. తెలంగాణ ఉద్యమానికి ప్రాణప్రదమైన ముల్కీ నిబంధనలను పీవీ సమర్థించినందుకు, అందరూ ఒక్కటై,  జై ఆంధ్రా ఉద్యమాన్ని లేవదీసి ఆయనను గద్దెదించారు. ఆంధ్రా నాయకుల కపటనీతికి బలైన పీవీ ఎక్కడ కోల్పోయారో అక్కడనే కేసీఆర్‌ తన యుద్ధయాత్ర మొదలుపెట్టాడు.  పీవీకి జరిగిన అవమానానికి తెలంగాణ ప్రజల పక్షాన  ప్రతీకారాన్ని తీర్చుకున్నారు.  

పీవీ, కేసీఆర్‌ ఇద్దరూ తెలుగు భాషాభిమానులు. ఇద్దరి ఉపన్యాసాలలోనూ సాహిత్య పరిమళాలు గుబాళిస్తుంటాయి. పద్యాలు, కవితలు జాలువారుతాయి. పీవీ విదేశాంగ మంత్రిగా రియోడిజెనీరోలో ధరిత్రీ సదస్సులో పాల్గొన్నప్పుడు సముద్ర వసనే దేవి, పర్వత స్తనమండలే, విష్ణుపత్నీ నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అనే భూమాత స్తుతిని ఉటంకిస్తే చప్పట్లు మిన్నుముట్టాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో కేసీఆర్‌ సర్వే సంతు సుఖినః సర్వేసంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిత్‌ దుఃఖ భాగ్భవేత్‌ అనే ఉపనిషత్‌ శ్లోకాన్ని ఉటంకించి అందరి హృదయాల్లో ఉదాత్త భావనను రేకెత్తించారు. భర్తృహరి సుభాషితాలు భారత భాగవతాలలోని అనేక పద్యాలు సందర్భానుసారంగా సద్యోస్ఫూర్తితో కేసీఆర్‌ ఉదహరించటం ఎరిగిందే.  

పీవీ వలెనె కేసీఆర్‌కు దైవభక్తి, జ్యోతిషం మీద విశ్వాసం ఎక్కువ.  పీవీకి జ్యోతిర్విద్యలో ప్రవేశం కూడా ఉంది. మౌలికమైన సాంప్రదాయికతను కాపాడుకుంటూనే ఆధునికమైన మార్పులను ఆహ్వానించాలన్నది ఇద్దరి అభిమతం.  

విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలకు హిందీ  అనుసృజన సహస్రఫణ్‌. పీవీ సాహిత్య వైదుష్యానికి నిదర్శనంగా నిలిచిన రచన.  ఉద్యమ సందర్భంలో మంచి పాటలు రాసిన కేసీఆర్‌ భవిష్యత్తులో మరింతగా  సాహితీ సృజన వైపు దృష్టి సారిస్తారని ఆశించవచ్చు. పీవీ వలెనె కేసీఆర్‌ సంగీతప్రియులు. పీవీకి పాట వినగానే ఆ పాట రాగతాళాల పేర్లు  చెప్పగల సంగీతాభినివేశం ఉంది. కేసీఆర్‌ శృతిబద్ధంగా పాడగలరనే విషయం కేవలం ఆయనను సన్నిహితంగా ఎరిగిన వారికి మాత్రమే తెలుసు. పద్యాలు ఆలపించటంలో ఘంటసాలకున్న ప్రత్యేకతలను కేసీఆర్‌ సోదాహరణంగా వివరించగలరు.  భక్త కన్నప్ప సినిమాలోని పాటలలో రామకృష్ణ గొంతులో పొంగే భక్తిపారవశ్యం కేసీఆర్‌కు ఎంతో ఇష్టం. లతామంగేష్కర్‌ ఆయన అభిమాన గాయని.

పత్రికలకు జవాబివ్వవలసి వచ్చినప్పుడు చట్టం తన పని తాను  చేసుకుపోతుంది అని నొప్పింపక తానొవ్వక పీవీ ఇచ్చిన సమాధానం చాలా ప్రాచుర్యం పొందింది. పీవీ ఇచ్చిన ఆ జవాబులో వ్యక్తిగత ఆవేశకావేశాలకు అతీతంగా చట్టాన్ని గౌరవిద్దాం అనే సారాంశం ఇమిడిఉంది. కేసీఆర్‌ తన వాదనా పటిమతో ప్రతిద్వందిని నిరుత్తరునిగా చేయగల ప్రజ్ఞావంతుడు. రాజకీయ వాస్తవికతను పసిగట్టడంలో, తగిన ఎత్తుగడలు వేయడంలో ఇద్దరూ దిట్టలు.  వ్యకీకరణ విధానంలో భిన్నత్వం కలిగినా ఇద్దరూ స్థితప్రజ్ఞులు. జయాపజయాలను సమానంగా స్వీకరించగల నిశ్చలతత్వం ఇద్దరిలోనూ ఉంది.

పీవీ మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీ ఆయన పట్ల అన్యాయంగా ప్రవర్తించింది. ఆయన భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులో పెట్టలేదు. ఆయనకు  ప్రధానులకు జరిపే విధంగా అంత్యక్రియలు జరిపించలేదు. ఢిల్లీలో ఆయన సమాధి నిర్మాణం కోసం స్థలం కేటాయించలేదు. కాంగ్రెస్‌ పీవీ స్మృతికి చేసిన గాయాన్ని మాన్పి ఇప్పటికైనా ఆయన స్థాయికి తగిన గౌరవం లభింపజేయాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారు. శతజయంతి వేదికగా కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

- బాలార్క

నూతన ఆర్థిక విధానాలను అమలుచేసే సందర్భంలో అభివృద్ధికి మానవముఖం ఉండాలని పీవీ ఆకాంక్షించారు. పేదరికం ఉన్నంతకాలం పరిపాలకులకు సంక్షేమ భావన ఉండాలని కేసీఆర్‌ భావిస్తారు. పేదప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పీవీ వృద్ధాప్య పింఛన్‌, నిరుపేద గర్భిణులకు ఆర్థికసాయం, పక్కా ఇండ్లు, నీటి సరఫరా తదితర పథకాలను ప్రవేశపెట్టారు. ఆనాటి పీవీ పథకాల లక్ష్యం నేడు కేసీఆర్‌ పరిపూర్తి చేస్తున్నారు. ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌, మిషన్‌ భగీరథ తదితర పథకాలు పీవీ ఆకాంక్షలకు ఆచరణ రూపాలు.

సోషలిస్టు భావాలతో ప్రభావితుడైన పీవీ భూసంస్కరణలకు పూనుకున్నాడు.  వ్యక్తిగత ఆచరణలోను అదే  ఆదర్శాన్ని పాటించాడు. తమకున్న 800 ఎకరాల భూమిని  పేదలకు ధారాదత్తం చేశారు. పీవీ మార్గాన్ని కొనసాగిస్తూ కేసీఆర్‌ భూరికార్డుల ప్రక్షాళనను, రెవెన్యూ సంస్కరణలను ప్రారంభించారు. వ్యక్తిగతంగా కేసీఆర్‌ తమ సొంత ఊరు చింతమడక లోని ఇంటిని జిల్లా పరిషత్‌ పాఠశాల కోసం స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చేశారు. 

కేసీఆర్‌ వ్యక్తిత్వం పాతకొత్తల మేలుకలయిక. నాటితరం నాయకులలోని రాజనీతిజ్ఞత, నేటి తరానికి అనుగుణమైన వాస్తవిక దృక్పథం కలిగిన నాయకుడు. పీవీ నరసింహారావు సమాఖ్యస్ఫూర్తిని విశ్వసించిన, గౌరవించిన ప్రధాని. వర్తమానంలో ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నది. రాష్ర్టాల హక్కులు కుంచించుకుపోతున్నాయని కేసీఆర్‌ గళమెత్తుతున్నారు. రాబోయే రోజుల్లో పీవీ నడిచినదారిలోనే  కేసీఆర్‌ కూడా జాతీయ రాజకీయాలలో ప్రభావపూరితమైన పాత్ర నిర్వహించే అవకాశం లేకపోలేదు. వెలుగుట నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ అని పీవీ ప్రకటించుకున్నారు. ఆయన ఆశయాల దారిలోనే కేసీఆర్‌ కూడా తను వెలుగుతూ కలకాలం ప్రజలకు వెలుగులు పంచాలని కోరుకుందాం.   

పీవీ స్వభావరీత్యా మితభాషి. మౌనమే ఆయుధంగా మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నిర్వహించిన వ్యూహ చతురుడు. తన పదునైన ఉపన్యాస శక్తిని శస్త్రంగా ధరించి, తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరం చేర్చిన యోధుడు కేసీఆర్‌. ఈ విషయంలో ఇద్దరిదీ భిన్నమైన శైలి. నాటితరం నాయకులు పీవీ, చెన్నారెడ్డి తర్వాత ఉర్దూలో రాజకీయ ప్రసంగాలు చేసి మహమ్మదీయులను  మెప్పించిన నాయకుడు కేసీఆర్‌. 


logo