శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 27, 2020 , 23:44:56

నిరాడంబర జీవి

నిరాడంబర జీవి

(నిన్నటి సంపాదకీయ పేజీలో ప్రచురించిన ‘ఆరితేరిన రాజనీతిజ్ఞత’ వ్యాసం ముగింపు భాగం ఇది.)

తనను తాను తగ్గించు కొని మహనీయులను సంస్మరించడం పీవీ నైజం. అందుకే వల్లభ్‌భాయ్‌పటేల్‌, నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌, సత్యజిత్‌రాయ్‌, రాజీవ్‌గాంధీలకు ‘భారతరత్న’తో గౌరవించి తన పూజ్యభావాన్ని ప్రకటించుకున్నారు. 

పీవీ ప్రతిభ రాజకీయాలలోనే కాదు, ఇతర రంగాలలో సైతం బహుముఖంగా విస్తరించింది. పద్దెనిమిది భాషలలో ప్రావీణ్యం కలిగిన పీవీ విశేషించి తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో ప్రామాణిక రచనలు చేసి సాహితీ లోకాన్ని మెప్పించారు. 1948 ప్రాంతంలో ‘కాకతీయ’ వారపత్రికను, సన్నిహిత మిత్రులు పాములపర్తి సదాశివరావుతో కలిసి నిర్వహించారు. ఆ కాలంలో ‘గొల్ల రామవ్వ’ కథ, ‘నీలిరంగు పట్టుచీర’, ‘మానావమానాలు’, ‘ఎదవ నాగన్న’ కథలు, తదుపరి కాలంలో రాసిన ‘మంగయ్య అదృష్టం’ నవలిక, వారి సామాజిక దృక్పథాన్ని చాటి చెప్పే రచనలు. ముఖ్యమంత్రి అయ్యాక ‘నేనొక చైతన్యోర్మిని’ అనే సుదీర్ఘ గీతాన్ని రాశారు. ‘భర్త్సృన’ కవిత వ్యాజస్తుతికి చెందింది. మరాఠీలో హరినారాయణ ఆప్టే రచించిన ‘పన్‌లక్షత్‌ కోన్‌ ఘొటా’ నవలను పీవీ తెలుగులో ‘అబల జీవితం’ పేరుతో అనువదించారు. కాళోజీ ‘ఎందుకో నా హృదిని యిన్ని వేదనలు’ కవితను ఆగ్లంలోకి అనువదించారు. డాక్టర్‌ జయప్రభ ‘అనుకోలేని అనురాగం’ కవిత్వాన్ని ‘అన్‌ఫోర్‌ సీన్‌ అఫెక్షన్‌' శీర్షికతో ఆంగ్లంలోకి అనువదించారు. ప్రసిద్ధ గుజరాతీ రచయిత, భారతీయ విద్యాభవన్‌ వ్యవస్థాపకులు శ్రీ కెఎం మున్షీ ఆంగ్లంలో రాసిన ‘ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ కల్చర్‌'ను ‘భారతీయ సంస్కృతి పునాదులు’గా అనుదించారు. 

పీవీ రచనల్లో ‘ఇన్‌సైడర్‌' (మొదటి భాగం) ఒక మాగ్నమ్‌ ఓపస్‌. ఇందులో తను స్వావలంబనతో, స్వయంకృషితో ఉన్నత ఆశయాలతో ఏ విధంగా రాజకీయ వ్యక్తిత్వాన్ని సమకూర్చుకున్నదీ.. పదవి నుంచి పదవికి, బాధ్యత నుంచి బాధ్యతకు ఎలా పయనించిందీ దాపరికం లేకుండా వర్ణించారు. ‘ఇన్‌సైడర్‌' రెండవ భాగం, ‘అయోధ్య 6, 1992’ రచనల్లో పీవీ తాను ప్రధాని అయ్యాక జరిగిన సంఘటనల గురించి తెలియజేశారు. ఒక విధంగా ‘ఇన్‌సైడర్‌' పీవీ ‘లోపలి మనిషి’ని సమగ్రంగా ఆవిష్కరించిందని చెప్పవచ్చు. 

పీవీకి సంగీతం, నాటకం, యక్షగానం, బుర్రకథ వంటి కళల పట్ల ఎంతో ఇష్టం. ఆయనకు జ్యోతిష్యాది శాస్ర్తాలలో అభినివేశం ఉన్నట్లు చాలా మందికి తెలియదు. ప్రముఖ తాంత్రికుడు చంద్రస్వామితో పలు పర్యాయాలు ఏకాంతంగా చర్చించేవారు. సైగల్‌ గాత్రం, గులాం అలీ గజల్స్‌, ద్వారం వేంకటస్వామి వయొలిన్‌, రవిశంకర్‌ సితార్‌, ఈమని శంకరశాస్త్రి వీణ, ఎంఎస్‌ సుబ్బలక్ష్మి, బేగం అఖ్తర్‌ మొదలైన సంగీత విద్వాంసుల రికార్డులు వినేవారు. 

తెలుగువారికి చెందిన ప్రసిద్ధమైన అవధాన విద్యను ఇష్టపడేవారు. తిరుపతి వేంకట కవుల అవధానాల వల్ల విద్యార్థి దశలోనే అవధానాల పట్ల ఇష్టమేర్పడింది. 1970లో వరంగల్‌లో సాహితీవేత్త ఆచార్య కోవెల సుప్రసన్న గారి తొలి అవధానానికి ముఖ్య అతిథిగా హాజరై అవధాన విద్యను కళాశాల స్థాయిలో ప్రవేశపెట్టాలని, విద్యార్థుల ధారణకిది ఉపకరిస్తుందని ప్రసంగించారు. తర్వాత 1996లో మాడుగుల నాగఫణి శర్మ  సహస్రావధానానికి హాజరై పృచ్ఛకునిగా పాల్గొన్నారు. ‘బహుభాషా కోవిదులైన మీకు ఇష్టమైన భాష ఏది’ అని ప్రశ్నించినప్పుడు ‘మౌన భాష’ అని ఠపీమని చెప్పగా.. సభ అంతా ఘొల్లుమని నవ్వింది. 

పీవీకి క్రీడలపైన ప్రత్యేక అభిమానం ఉండేది. 70వ ఏట కూడా బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ ఆడేవారు. క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేవారు. ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు వెళ్ళి భారతీయ క్రీడాకారులను ప్రోత్సహించేవారు. వెయిట్‌లిఫ్టర్స్‌తో ‘మీరు ఎత్తేది బరువే కాదు మన దేశపు పరువు కూడా’ అని హెచ్చరిక మాటతో భుజం తట్టారు. 

పీవీ కుటుంబం గురించి ఏనాడూ పట్టించుకోలేదు. తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారు. ఏ వ్యక్తినీ తన దరిదాపుల్లోకి రానివ్వలేదు. అందుకే ‘పీవీకి నేను సన్నిహితుడను’ అని ఎవరూ చెప్పుకోలేకపోయారు. ఆయనకు స్వపక్ష విపక్ష భేదాలుండేవి కావు. అటల్‌ బిహారీ వాజపేయి ‘ఏ క్యావన్‌ ఔర్‌ కవితాయే’ పుస్తకాన్ని పీవీయే ఆవిష్కరించడం ఇందుకు నిదర్శనం.

పీవీ జీవితం ముగింపులేని కావ్యం. ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆయన గురించి ఎంఎల్‌ నరసింహారావు, జీ వెంకటరామారావు, తుర్లపాటి కుటుంబరావు, సంజయ్‌బారు ప్రభృతులు ఉత్తమ గ్రంథాలు వెలువరించారు. వినయ్‌ సీతాపతి రాసిన Half Lion ఎంతో ప్రామాణికమైన రచన. పీవీపై ఫ్రంట్‌లైన్‌, ఇండియా టుడే, జయంతి, తెలుగువిద్యార్థి, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక సంచికలు వెలువరించాయి. సురభి ఎడ్యుకేషన్‌ సొసైటీ ‘మన భారత ప్రధాని’ శీర్షికన, ‘అజో విభొ’ (అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్‌) సంస్థ ‘ప్రతిభా జయంతి’ శీర్షికన పెద్ద గ్రంథాన్ని ప్రచురించింది. ఇంకా చాలామంది పీవీ అభిమానులు, సాహితీ కళాపీఠాల తరపున చిన్న చిన్న పుస్తకాలు, సావనీర్లు వెలువడుతున్నాయి. పీవీ అనువాదాల గురించి ఇటీవల కరీంనగర్‌లో కే సంతోష్‌బాబు ఓ గ్రంథం ప్రచురించారు.

పీవీ భాషణం ప్రత్యేక శైలిలో, దేశకాల పరిస్థితులను బట్టి సాగేది. అన్ని భాషలలోనూ ధారాళంగా మాట్లాడి మెప్పించే ప్రజ్ఞ. 1983లో అలీనదేశాల శిఖరాగ్ర సభలో పాల్గొని స్పానిష్‌లో ప్రసంగించి ఆసియా, ఐరోపా ప్రతినిధులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎన్ని భాషల్లో ప్రసంగించగలిగినప్పటికీ ఆయన నోటి నుంచి సహజంగా తెలంగాణ తెలుగే జాలువారేది. తెలంగాణలోని తెలుగే అచ్చమైన తెలుగని ప్రకటించారు కూడా. 

పీవీది సమగ్ర వ్యక్తిత్వం. సంక్లిష్టతత్వం కూడాను. ఆగ్రహం, అనుగ్రహం; అనురాగం, వైరాగ్యం; మాటకారితనం, మౌనవ్రతం.. ఇలా ఎన్నో ద్వంద్వ ప్రవృత్తులు పొరలు పొరలుగా కనిపిస్తాయి. ఎలాంటి క్లిష్టమైన అంశాన్నైనా అరటిపండు ఒలిచినట్లు చెప్పే చాతుర్యం ఉంది. ఎంత తేలిక సమస్యనైనా వితండతర్కంతో పక్కబాట పట్టించే సామర్థ్యమూ ఉంది. అందుకే ఆయనను ‘మేధావి’ అంటారు. మేధావి అంటే, ఆశ్చర్యపోయేవాడు కాడు.. ఆశ్చర్యపరిచేవాడు.

ఒక విధంగా పీవీ సర్వేపల్లి వలె తాత్వికుడు. రవీంద్రుని వలె భావుకుడు. బంగారు భారతదేశాన్ని కోరుకున్న దార్శనికుడు. అంతటి మహనీయుడు, ‘భారతరత్న’గా భాసించలేకపోయాడు. కాంగ్రెస్‌ పార్టీలో కొందరు పెద్దల పుణ్యమా అని విజ్ఞానభాస్కరుడైన పీవీ మబ్బుతెరల మాటున ఉండిపోయాడు.

పీవీ జన్మించి నూరేండ్లయింది. మరణించి పదహారేండ్లయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో విజ్ఞతతో పీవీ శతజయంతి ఉత్సవాలను, అంతర్జాతీయ స్థాయిలో ఏడాది పొడుగునా నిర్వహించాలని సంకల్పించడం అభినందనీయం. విశ్వవిద్యాలయాల్లో సాహిత్య కళాపీఠాలు సెమినార్లు నిర్వహించి పీవీ జీవితచరిత్ర, రచనలు అన్నీ డాక్యుమెంటేషన్‌ చేయాలి. అదే పీవీకి అందించే ఘనమైన నివాళి. ఆయన ఆశించిన సంస్కరణలూ సమాజానికి చేరినపుడే ఆయన ఆత్మకు శాంతి!

చివరిగా, పీవీ గురించి విశ్వనాథ మొదలు దాశరథి వరకు ఎందరో పద్యాలు రాశారు. ఉత్పలగారు ఉత్పలమాలలో అల్లిన పద్యం పీవీ వ్యక్తిత్వానికి నిలువెత్తు నీరాజనం..


‘తావక నిష్కళంక చరితంబు, మత్సరులెంత నీచ దు ర్భావము లంట గట్టుటకు పాల్పడినన్‌ సయిరించినావు, నీ వే విజయుండవైతివి సు విస్తృత కాంగ్రెసు పక్ష నిస్తులో జ్జీవన రక్షకున్‌, విజయ చిహ్నము నీవె నృసింహధీమణీ..’

పీవీ గురించి కర్మయోగి అని, స్థితప్రజ్ఞుడు, అపర చాణక్యుడు, తెలుగువారి ఠీవి అని ఎన్ని విశేషణాలు చెప్పినప్పటికీ ఆయన మాత్రం ‘నిరాడంబర జీవి పీవీ’ అనే విధంగానే జీవితాంతం ఒదిగి ఉండిపోయారు. ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే’ అని చెప్పటం ఆయన సంస్కారానికి నిదర్శనం. 

పీవీ తెలంగాణ జాతీయాలు, లోకోక్తులు వాడేవారు. ‘దుఃఖం లేనోడు బర్రెను కొన్నట్లు’, ‘ఎన్నడెరుగనోడు ఎవుసం పెట్టినట్లు’, ‘మూడు కొత్తల మాలుకు ముబ్బేడ మసాల’, ‘మంది మాటలు పట్టుకొని మార్వానం పోవుడు’.. ఇలాంటివి కోకొల్లలు.

దేశం గురించి, దేశ రాజకీయాల గురించి పీవీ అనేక సందర్భాలలో ఛలోక్తులు, విసుర్లు విసిరారు. ‘ఈ దేశంలో కొందరు తమ చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నార’ని పార్టీ ఫిరాయింపుదార్ల గురించి చెణుకులు విసిరారు. ‘ఈ దేశం ఏనుగు వంటిది. ఈ ఏనుగును లాగడానికి మరికొన్ని ఏనుగులు అవసరం’ అని పరిపాలనా తీరు తెన్నుల గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘కొన్ని విషయాలపై నిర్ణయం తీసుకోకపోవడమే నిర్ణయం’ అని చమత్కరించేవారు. 

1980 ఎన్నికల్లో హన్మకొండ నుంచి గెలిచిన పీవీ ఇందిరా గాంధీ మంత్రివర్గంలో చేరి, తన అసమాన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. ఇందిరా హత్య అనంతరం, పీవీ రాజీవ్‌గాంధీకి కుడిభుజంగా ఉన్నారు.  1991లో రాజీవ్‌ గాంధి హత్య తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో పీవీ దేశ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు. 


logo