ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 27, 2020 , 23:44:59

తెలుగు రాజనీతి వెలుగు

తెలుగు రాజనీతి వెలుగు

 • పీవీపై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రత్యేక వ్యాసం

5 ఏండ్లు పరిపాలించిన మొదటి హిందీయేతర, నెహ్రూ కుటుంబేతర ప్రధాన మంత్రి. కీలకమైన సమయంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన క్రాంతదర్శి. స్థానిక సంస్థలకు ప్రాణం పోసి, పంచాయతీరాజ్‌ వ్యవస్థకు జవసత్వాలు కల్పించి, సంస్కరణలు తీసుకొచ్చిన రాజకీయ నాయకుడు. భూ సంస్కరణలకు వ్యతిరేకత ఎదురైనా పట్టుబట్టి, చేపట్టి అమలుచేసిన పేదల పక్షపాతి. స్వాతంత్య్రానంతరం భారత రాజకీయ చరిత్రలో ప్రధానిగా వారి పదవీకాలం కూడా మరో మైలురాయి. 

పీవీ నరసింహారావు రాజకీయ జీవితం మొదటి దశలో హైదరాబాద్‌లో నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతర ఉద్యమంలో (1938) పాల్గొన్నారు. 

స్వాతంత్య్ర అభిలాష ఆయన్ను స్వరాజ్య ఉద్యమం దిశగా నడిపించింది. ఆ తర్వాత ఆయన వేసిన ప్రతి అడుగులోనూ అనేక సంస్కరణలకు బాటలువేసి, సంస్కరణవాదిగా పేరు తెచ్చుకున్నారు. మొదట్లో సామ్యవాది (సోషలిస్ట్‌) అయిన ఆయన.. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వచ్చిన విమర్శలు ఎదుర్కొంటూ సామ్యవాదానికి కొత్త నిర్వచనాన్ని చెప్పారు. సమాజానికి అనుగుణమైన సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వర్తమానంలో కావలసిన మార్పులు చేసుకోవడం కూడా సామ్యవాదమే అంటూ 1992లో తిరుపతిలో జరిగిన కాంగ్రెస్‌ సభలో కొత్త భాష్యం చెప్పి, అందరినీ ఒప్పించి, మెప్పించారు. .


నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచి, స్థానిక వ్యాపారాన్ని సరళీకృతంచేసిన ఖ్యాతి వారికే దక్కుతుంది. దేశంలో ప్రైవేటీకరణకు కూడా ఆయన హయాంలో గట్టి ప్రోత్సాహం లభించింది. ఆర్థిక సంక్లిష్ట పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కిచ్చేందుకు సరళీకృత విధానమే తప్పనిసరి మార్గమని చెప్పి, విమర్శలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి ప్రతి రాష్ట్రంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటుచేసేలా బాటలు వేశారు. అట్టడుగున (ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న) పంచాయత్‌, మున్సిపల్‌ వ్యవస్థలను బలోపేతంచేసేందుకు రాజ్యాంగ సవరణల ద్వారా వికేంద్రీకరణ, స్థానిక సంస్థలకు ఆర్థిక పరిపుష్టి అవసరమని నొక్కి వక్కాణించారు. 

తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు మేలుచేసేందుకు భూ సంస్కరణలు చేపట్టారు. రైతులకు కేవలం పంట మీద హక్కు ఉంటే సరిపోదు, భూమిమీద కూడా హక్కు ఉండాలనే ఆశయంతో గరిష్ఠ భూ పరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయగలిగారు. ఈ క్రమంలో తన భూమిని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారంటే ఆయన సంస్కరణాభిలాష ఎలాంటిదో తెలుస్తుంది. మాతృభాష మీద అభిమానంతో, స్వరాష్ట్రంలో మాతృభాషను ప్రోత్సహించటమే కాకుండా, ప్రాథమికదశ నుంచి మాతృభాషలో విద్యాభ్యాసం జరగాలని నొక్కి చెప్పి విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా అమలుచేశారు. ఆ ప్రక్రియలో భాగంగానే తెలుగు అకాడమీని స్థాపించారు. 

బహు భాషాకోవిదులైన పీవీ నరసింహారావు భారతీయ భాషలనే గాక, విదేశీ భాషలను కూడా అభ్యసించి తమ ఆసక్తిని చాటిచెప్పారు. మాతృభాష తెలుగుతో పాటు మరాఠీ, ఉర్దూ, సంస్కృతం, బెంగాలీ, హిందీ, గుజరాతీ, ఒరియా, తమిళ, కన్నడ భాషల్లో ప్రావీణ్యం సంపాదించడమే గాక, చక్కగా మాట్లాడి మెప్పించేవారు. ఇవే కాకుండా విదేశీ భాషలైన పర్షియన్‌, స్పానిష్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇంగ్లీష్‌, అరబిక్‌ భాషల్లో కూడా చక్కగా మాట్లాడే నరసింహారావుగారు అందరికీ దగ్గరయ్యారు. వివిధ భాషల్లో ప్రావీణ్యం ఉండటం, మాట్లాడగలగడం, అర్థం చేసుకోగలగడం ఆయన విద్వత్తుకు కొలమానంగా చెప్పుకోవచ్చు.  సాహిత్యం, సౌమ్య మనస్తత్వం, భాషా పరిజ్ఞానం భారతీయ సనాతన సంస్కృతి పరిరక్షణలాంటి భావాలు శ్రీ అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి గారికి, శ్రీ పీవీ నరసింహారావుగారికి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి కారణమయ్యాయి. అధికార, ప్రతిపక్షాల్లో ఉన్నప్పటికీ ఈ విషయంలో వారి మధ్య ఇబ్బందులు ఎదురుకాలేదు. అందుకే జెనీవా సదస్సులో కాశ్మీర్‌ విషయంలో మాట్లాడేందుకు శ్రీ వాజ్‌పేయి గారిని పంపించి, రాజకీయాల్లో సానుకూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అది రాజనీతి చతురత కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిని కూడగట్టే ప్రయత్నం కావచ్చు, తనకు వాజ్‌పేయి మీద ఉన్న సహజమైన అభిమానం కావచ్చు, వారిని జెనీవాకు పంపించడం ద్వారా మన దౌత్యనీతిని విజయవంతమైన మార్గంలో ముందుకు నడిపి, ప్రజలను ఆకట్టుకోగలిగారు.

విదేశాల్లో కూడా అనేక రాజకీయ అంశాల మీద ఆయన చేసిన ప్రసంగాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశంలో తెలుగు వారందరూ కలిసి ఉండేందుకు గట్టిగా కృషిచేశారు. విదేశాంగమంత్రిగా, గృహమంత్రిగా, మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా, ప్రణాళిక మంత్రిగా కేంద్రంలో పనిచేసి, ఆ తర్వాత ప్రధానమంత్రిగా అలీనోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో, భారత్‌ తరుఫున నాయకత్వం వహించి భారతీయ ఆలోచనావిధానాన్ని అలీనదేశాలకు తెలియజెప్పారు.

తన పార్టీని మెజార్టీ లేకపోయినా, తన చాకచక్యంతో ఐదేండ్లపాటు మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ, నూతన ఆర్థిక సంస్కరణలకు బాటలు వేయడం ఆయన శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియకు శ్రీ నరసింహారావుగారు ఆద్యులు. ఆ తర్వాత ఆయన ప్రతిపాదించిన సంస్కరణల పర్వాన్ని శ్రీ వాజ్‌పేయిగారు చక్కగా అమలుచేసి చూపించారు. నేటి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వాటినే మరింత వేగంగా ముందుకు తీసుకువెళుతున్నారు. ఆర్థిక సంస్కరణలపై వచ్చే విమర్శలకు తనదైన శైలిలో విషయ పరిజ్ఞానం, భాష పరిజ్ఞానంతో చక్కగా సమాధానం ఇచ్చి, విమర్శకులను సైతం శ్రీ పీవీ మెప్పించగలిగారు.


పీవీ నరసింహారావు రాష్ట్ర ఆర్థిక, సామాజిక వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొచ్చిన సంస్కరణవాదిగా అనేక మైలురాళ్ళు అధిగమించారు. ఏ విషయమైనా చక్కగా ఆలోచించి, మంచి ప్రణాళిక రూ పొందించుకుని అందరినీ కూడగట్టే ప్రయత్నంచేసి, తద్వారా తాను సరైందని అనుకున్న మార్గంలో అనేక అడ్డంకులు అధిగమించి ప్రయాణం చేసేవారు. ము ఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే అనేక భూ సంస్కరణలు, విద్యా సంస్కరణలతో సంస్కరణవాదిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఆయన, ప్రధాని అయిన తర్వాత జాతీయస్థాయిలోనూ అదే సంస్కరణల పర్వాన్ని కొనసాగించారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు చక్కని భవిష్యత్తు చూపించి, గాడిలో పెట్టేందుకు తీసుకొచ్చిన సంస్కరణలు దేశం మరచిపోదు. సంస్కరణలను శ్రీ వాజ్‌పేయి ఎక్కువగా ఆచరించినా, ఆద్యుడు శ్రీ పీవీ గారేనని, మరికొందరు ఆర్థిక సంస్కరణలు అద్భుతమని అంటారు. జాతీయ స్థాయిలో ఈ సంస్కరణలకు నూతన భాష్యం చెప్పి, ఆర్థిక సంస్కర్తగా, రాజనీతిజ్ఞుడిగా ఐదేండ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని పరిపాలించి తన శక్తి సామర్థ్యాల్ని రుజువు చేసుకున్నారు. ఆ సమయంలో కొన్ని విమర్శలు కూడా రాకపోలేదు. కొన్ని లోపాలు లేకపోలేదు. కానీ ఆయన చేపట్టిన మార్పులు, తీసుకొచ్చిన సంస్కరణలు పేదల పక్షపాతిగా ఆయన చేపట్టిన అనేక నిర్ణయాలు పీవీ నరసింహారావుగారిని ప్రజలకు మరింత చేరువచేశాయి.

సాహిత్యంతోపాటు సంగీతం, సినిమా, నాటక ం, భారతీయ తాత్విక చింతన, సంస్కృతి సంప్రదాయాలు, వీటన్నింటి పట్ల శ్రీపీవీ గారికి విశేషమైన ఆసక్తి ఉన్నది. ఆ ఆసక్తితో ఆయన సాహిత్యంలో కూడా మంచి నేర్పు సాధించారు. సాహిత్యంలో ఎంతో కృషిచేసిన ఆయన.. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు కావ్యాన్ని ‘సహస్రఫణ్‌' పేరుతో హిందీలోకి అనువదించటం ప్రశంసించదగిన అంశం. శ్రీ భర్తృహరి సంస్కృతంలో చెప్పినట్లు

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః

ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాః 

విఘ్నైః పునః పునరపి ప్రతి హన్యమానాః

ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి  

ఆటంకాలు ఎదురవుతాయేమో అన్న భయంతో అధములు అసలు పనినే మొదలు పెట్టరట. ఇక మధ్యములు పనిని మొదలుపెట్టినా... మధ్యలో ఏవన్నా అడ్డంకులు ఎదురైన వెంటనే పనిని వదిలేస్తారు. ఇక ధీరులు మాత్రం ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే.. మొదలుపెట్టిన కార్యాన్ని అంతకంతకూ రెట్టింపు ఉత్సాహంతో పూర్తిచేసి తీరతారు. అలా చేపట్టిన ప్రతి పనిని తమదైన శైలిలో పూర్తి చేసి శ్రీ పీవీ వినుతికెక్కారు.రాజనీతిజ్ఞత, సౌమ్య మనస్తత్వం, స్థితప్రజ్ఞత, సాహితీ ప్రతిభ ఇలా అనేక ఉన్నత లక్షణాల అరుదైన ముద్ర శ్రీ పీవీ నరసింహారావు సొంతం. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా,  స్థిమితంగా, ప్రశాంతంగా ఎదుర్కొనే ఆయన పనితీరు నుంచి నేటి యువత నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

దక్షిణాదికి చెందిన వారై ఉండి, తెలంగాణ బిడ్డగా, నెహ్రూ కుటుంబానికి చెందినవారు కాకపోయినా, ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఐదేండ్ల పదవీ కాలం పూర్తిచేసుకున్న తెలుగు వెలుగు ఆయన. ఇంతటి ఘనత ఉన్నా, ప్రధాని పీఠం 

అధిరోహించినా నిండుకుండ తొణకదు అన్నట్లుగా సాదాసీదాగా, వినయ విజ్ఞానములు మేళవించిన మేధావి.

దౌత్యనీతిలోనూ పీవీ నరసింహారావు ముద్ర ప్రత్యేకమైనది. ఏ విషయంలోనైనా సరే ముందుగా కష్టపడి, ప్రావీణ్యత సంపాదించి భాష పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం రెండింటితో ఒప్పించి, మెప్పించగలిగే ప్రతిభ వారి సొంతం. 1983 లో జరిగిన అలీనదేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్‌ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్‌ క్యాస్ట్రోను అబ్బురపరిచిన విషయం అందరికీ తెలిసిందే. ఏషియాన్‌ (ఏఎస్‌ఈఏఎన్‌) సమావేశాల సందర్భంగా జాతీయ భద్రత గురించి తదనుగుణంగా మాట్లాడి, తమ ప్రతిభతో అందరినీ ఒప్పించి, మెప్పించారు. తద్వారా అనేక దేశాలతో భారత్‌ దౌత్య సంబంధాలను బలోపేతంచేయటంలో కూడా కీలకపాత్ర పోషించారు. ప్రధాని కాక ముందు నుంచి కేంద్ర మంత్రిగానూ ఇదే ఒరవడి కొనసాగించారు.

సాహిత్యం, సౌమ్య మనస్తత్వం, భాషా పరిజ్ఞానం భారతీయ సనాతన సంస్కృతి పరిరక్షణలాంటి భావాలు శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి గారికి, శ్రీ పీవీ నరసింహారావుగారికి మధ్య సాన్నిహిత్యంపెరగడానికి కారణమయ్యాయి. 

వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొచ్చిన సంస్కరణవాదిగా అనేక మైలురాళ్ళు అధిగమించారు. ఏ విషయమైనా  చక్కగా ఆలోచించి, మంచి ప్రణాళిక రూపొందించుకుని అందరినీ కూడగట్టే ప్రయత్నంచేసి, తద్వారా తాను సరైందని అనుకున్న మార్గంలో అనేక అడ్డంకులు అధిగమించి ప్రయాణం చేసేవారు.

సమాజానికి అనుగుణమైన సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వర్తమానంలో కావలసిన మార్పులు చేసుకోవడం కూడా సామ్యవాదమే అంటూ 1992లో తిరుపతిలో జరిగిన కాంగ్రెస్‌ సభలో కొత్త భాష్యం చెప్పి, అందరినీ ఒప్పించి, మెప్పించారు. 

ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడే అనేక భూ సంస్కరణలు, విద్యా సంస్కరణలతో సంస్కరణవాదిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఆయన, ప్రధాని అయిన తర్వాత జాతీయస్థాయిలోనూ అదే సంస్కరణల పర్వాన్ని కొనసాగించారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు చక్కని భవిష్యత్తు చూపించి, గాడిలో పెట్టేందుకు తీసుకొచ్చిన సంస్కరణలు దేశం మరచిపోదు. 

ఆట ఆడిస్తా..


రాజకీయాల్లో ఆరితేరిన ఘనుడు, సాహిత్యంలో సంపన్నుడే కాదు.. ఆటల్లోనూ పీవీ చురుగ్గా ఉండేవారు. టెన్నిస్‌ ఆటను ఎక్కువగా ఇష్టపడేవారు... ఆడేవారు కూడా. ఓ సందర్భంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ క్రికెట్‌ టోర్నీ సందర్భంగా ఇలా బ్యాటు చేతబట్టారు. 

రాజకీయరంగంలో చాణక్యుడు, వ్యక్తిత్వంలో అత్యంత సౌమ్యుడు, బహు భాషాకోవిదుడు, అపరమేధావి.. ఈ మాటలన్నీ చెప్పగానే తెలుగువారి మనోఫలకం మీద సాక్షాత్కరించే బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వేంకటనరసింహారావు. వారి జీవితంలో ప్రతి అడుగుకూ ఓ ప్రత్యేకత ఉన్నది. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వారై ఉండి, తెలంగాణ బిడ్డగా, నెహ్రూ కుటుంబానికి చెందినవారు కాకపోయినా, ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఐదేండ్ల పదవీ కాలం పూర్తిచేసుకున్న తెలుగు వెలుగు ఆయన. ఇంతటి ఘనత ఉన్నా, ప్రధాని పీఠం అధిరోహించినా నిండుకుండ తొణకదు అన్నట్లుగా సాదాసీదాగా, వినయ విజ్ఞానములు మేళవించిన మేధావిగా, పరిణతి చెందిన రాజకీయవేత్తగా కీర్తి గడించిన పీవీ జీవితంలో ఎన్నో మైలురాళ్ళు.. 

పాములపర్తి వేంకట నరసింహారావు (1921-2004)

 • 1921, జూన్‌ 28  
 • హైదరాబాద్‌ సంస్థానంలోని 
 • కరీంనగర్‌ జిల్లా వంగరలో జన్మించారు.
 • 1938
 • కాలేజీ రోజుల్లో నిజాం నిషేధించిన 
 • వందేమాతర గీతాన్ని ఆలపించారు.
 • 1971-1973 
 • ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
 • 1972 
 • కాంగ్రెస్‌ టికెట్‌తో పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
 • 1977 
 • అత్యవసర పరిస్థితి వల్ల కాంగ్రెస్‌ వ్యతిరేక 
 • గాలులు వీచినా హన్మకొండ నుంచి 
 • లోక్‌సభకు ఎన్నికయ్యారు.
 • 1980 జనవరి 
 • ఇందిరాగాంధీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
 • 1982 రక్షణ శాఖ మంత్రిగా, అనంతరం కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
 • 1984 పీవీ హోంమంత్రిగా ఉన్నపుడే ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు.
 • 1985  రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంలో విద్య,
 • మానవ వనరుల శాఖలు చేపట్టారు.
 • 1986  కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా నవోదయ విద్యాలయాలను ప్రవేశ పెట్టారు.
 • 1987 మళ్లీ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు
 • 1991 జూన్‌ : రాజీవ్‌ గాంధీ హత్య ఘటనానంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా ఐదేండ్లు పాలించిన 
 • తొలి కాంగ్రెస్‌ ప్రధాని ఆయనే. తొలి దక్షిణ భారత ప్రధాని కూడా ఆయనే. ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ను నియమించి ఆర్థిక సంస్కరణలు చేపట్టి, 
 • దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. పీవీ చేపట్టిన సంస్కరణలే ఇప్పటి భారతావని అభివృద్ధికి మూలం.
 • 1992 డిసెంబర్‌ : పీవీ ప్రధానిగా ఉండగానే బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది.
 • 1996 జూన్‌ : ప్రధానిగా ఐదేండ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడంతో ప్రధాని పదవి నుంచి వైదొలిగారు.
 • 1996 సెప్టెంబర్‌ : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
 • 1998 : ‘ద ఇన్‌సైడర్‌' పేరుతో అత్మకథాత్మక నవల రాశారు. నవలలోని కథానాయక పాత్ర ఆనంద్‌.. పీవీయేనని విమర్శకులు భావిస్తారు. 
 • 2004, డిసెంబరు 23 : గుండెపోటుతో తనువు చాలించారు.


logo