ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 27, 2020 , 00:17:33

మోసానికి మోసం

మోసానికి మోసం

ఆహారం దొరక్క ఓ నక్క నకనకలాడుతూ ఉంది.  కడుపు నింపుకోవడానికి  ఒక పథకాన్ని ఆలోచించింది. ఒక కొలను ఒడ్డున తిరగసాగింది.  సూర్యకిరణాలు నడినెత్తికి రావడంతో చిన్నచిన్న జంతువులన్నీ ఆహార సంపాదనకు బయటకు వచ్చాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న కుందేళ్లను చూసిన నక్క.. ‘మిత్రులారా! బద్ధకం భవిష్యత్తును నాశనం చేస్తుంది. వేకువనే మేల్కొని పనులు చేసుకోవడం మంచి పని’ అంటూ హితవాక్యాలు చెప్పింది. ‘నిజమే కానీ, చలి మమ్మల్ని బయటకు రానివ్వడం లేదు!’ అని కుందేళ్లు సమాధానం ఇచ్చాయి. ‘చలిని చూసి మీరు భయపడటమా? ఆ చలే మిమ్మల్ని చూసి భయపడి పారిపోయే మంత్రం నా దగ్గర ఉంది. నిండా మునిగిన వాడికి చలే ఉండదంటారు. వేకువనే ఈ నీటిలో మునగండి, హాయిగా ఉండండి’ అని చెప్పింది నక్క. ఇవి కుతంత్రపు మాటల్లా ఉన్నాయని గ్రహించిన కుందేళ్లు ‘రేపటి నుండి అలానే చేస్తాం’అని తప్పించుకుని పోయాయి. ‘ఈ కుందేళ్లు నా మాటలు నమ్మినట్లున్నాయి. నిండా మునిగితే  చస్తాయి. ఇక ఒడ్డున కాచుకుని ఉంటే చాలు. నా తిండి సమస్య తీరిపోయినట్లే’ అనుకుంది. కానీ నక్క కుతంత్రాన్ని ఆ కొలనులోని మొసలి గ్రహించింది. అప్పుడు నక్కతో ఇలా అన్నది. ‘నక్క బావా, ఈ కొలనులో చేపలు చలిని భరించలేక పోతున్నాయట. బయటకు తోడేయమని నన్ను కోరుతున్నాయి. అది నా ఒక్కడి వల్లా సాధ్యం కావడం లేదు. నువ్వు తోడుంటే వాటిని తోడి బయటపడేద్దాం’ అని బతిమాలింది మొసలి. దాని మాటలు నిజమని నమ్మిన నక్క ‘ఓస్‌, అంతేనా, అయితే పద పోదాం’అంటూ చెంగున ఎగిరి మొసలి వీపుపై కూర్చుంది. కొద్దిదూరం పోయాక మొసలి నీటిలో బుడుంగున మునిగింది. ఈత రాని నక్క ఊపిరాడక చచ్చి చివరకు మొసలికి ఆహారమై పోయింది.


logo