శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 26, 2020 , 00:28:03

ఉపాధినిచ్చే‘యుడో’..

ఉపాధినిచ్చే‘యుడో’..

కొవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఆన్‌లైన్‌ సేవలను పొందుతున్నాయి. కొన్ని కంపెనీలు నష్టాలతో ఉద్యోగులను తొలగిస్తే, మరికొన్ని వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను ఆచరణలోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో మీటింగ్‌లు, ఇంటర్వ్యూలు, తరగతుల నిర్వహణ వీడియో కాల్‌ యాప్స్‌ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తకొత్త వీడియో కాలింగ్‌ యాప్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కానీ, అన్నింటికంటే భిన్నంగా హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌ ‘యుడో యాప్‌'ను అప్‌డేట్‌ చేసింది. 

ఈ యాప్‌ ఫౌండర్‌ పేరు.. తేజ గుడ్లూరు. లాక్‌డౌన్‌ దృష్ట్యా యుడో యాప్‌లో అప్‌డేట్‌ వర్షన్‌ తీసుకువచ్చి కంపెనీలు, ఉద్యోగులు, నిరుద్యోగులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. ఈ యాప్‌తో  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపాధ్యాయులు పాఠాలు బోధించవచ్చు. కంపెనీలు బోర్డు మీటింగ్‌లు, కెరీర్‌ కన్సల్టెంట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చు. యోగా ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్‌ కూడా ఉన్నది. 

నిరుద్యోగులు దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని తమ స్కిల్స్‌ను నమోదు చేసుకోవచ్చు. తద్వారా ట్యూటర్‌ లేదా ఫ్రీలాన్సర్‌గా ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇందుకోసం రూ.300 ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆయా సేవలు అవసరమైన వారిని ఈ యాప్‌ కనెక్ట్‌ చేస్తుంది. తద్వారా నిరుద్యోగులు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. వినియోగదారులు చెల్లించే డబ్బు నేరుగా శిక్షకుల అకౌంట్‌కు పడేలా ఇంటిగ్రేటెడ్‌ పేమెంట్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. logo