శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 26, 2020 , 00:28:05

చాయ్‌ దుకాణం నుంచి గగనతలంలోకి..

చాయ్‌ దుకాణం నుంచి గగనతలంలోకి..

అది.. 2013. కేదార్‌నాథ్‌లో ప్రకృతి విలయతాండవం చేస్తున్న రోజులు. ఎటుచూసినా వరద బీభత్సమే. ఆ విపత్కర పరిస్థితుల్లో శివభక్తులతోపాటు స్థానికులను కాపాడింది భారత వైమానిక దళమే. హెలికాఫ్టర్ల ద్వారా వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, అధికప్రాణనష్టం కలుగకుండా జాగ్రత్తపడింది మన వాయుసైన్యం. అదే సమయంలో.. తమ టీకొట్టులో టీవీ చూస్తున్నది 16 ఏండ్ల అంచల్‌ గంగ్వాల్‌. వాయుసేన ధైర్య సాహసాలను కండ్లారా చూసిన ఆ బాలిక.. ఆనాడే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నది. ‘ఎప్పటికైనా నేను వైమానిక దళంలో చేరుతా..’ అని తల్లిదండ్రులతో చెప్పింది. కాలచక్రం గిర్రున తిరిగింది. 

ఇప్పుడు అంచల్‌ గంగ్వాల్‌కు 24 యేండ్లు. ఇంత చిన్నవయసులోనే తాను చేరాలనుకున్న లక్ష్యాన్ని చేరింది. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కఠోర శిక్షణ ముగించుకొని, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా నియమితురాలైంది. మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌కు చెందిన సురేశ్‌ గంగ్వాల్‌ పదో తరగతి దాకా చదివాడు. పోషణ కోసం టీ దుకాణం పెట్టుకున్నాడు. తెల్లవారుజామునే ఇల్లువదిలి ఎప్పుడో అర్ధరాత్రికి ఇల్లు చేరేవాడు. అతని ముగ్గురి సంతానంలో అంచల్‌ ఒకరు. తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచీ చూస్తూ ఎదిగిన ఆమె.. ఒకవైపు బడికి వెళ్తూనే, సెలవు దినాల్లో టీ కొట్టులో తండ్రికి తోడుగా ఉండేది. చదువులోనూ ముందుండేది.

 2013 కేదార్‌నాథ్‌ వరదల సమయంలో భారత వైమానిక దళం ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ఫిదా అయింది. ఎప్పటికైనా ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ అవ్వాలని అప్పుడే కల గన్నది.   ఆరుసార్లు ప్రయత్నించి.. చివరికి సాధించింది. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పొందింది. గ్రౌండ్‌ డ్యూటీ బ్రాంచ్‌లో టాపర్‌గా నిలిచింది అంచల్‌. తాజాగా ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా నియమితురాలైంది. ‘నా చిన్ననాటి కల సాకారమైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటున్నది అంచల్‌. 


logo