శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 23, 2020 , 09:35:19

ఉండమ్మా..బొట్టు పెడతా!

ఉండమ్మా..బొట్టు పెడతా!

  • నేడు అంతర్జాతీయ వితంతువుల దినం

సహగమనం సాకుతో ప్రాణాలు తీశారు. వైధవ్యం పేరుతో బొట్టు చెరిపేశారు.  అరిష్టమంటూ అత్తిల్లు తరిమేసింది. దరిద్రమంటూ పుట్టిల్లు వదిలించుకుంది. ఒంటరివంటూ సమాజం  వేధించింది. ఇన్ని సవాళ్లను  తట్టుకొని,  అవరోధాలను నెట్టుకొని ముందుకు నడిచిందామె. ఆధునిక మహిళ వైధవ్యాన్ని ఓ యాక్సిడెంట్‌గా మాత్రమే భావిస్తున్నది. ఆ గాయాల నుంచి వీలైనంత త్వరగా కోలుకుంటున్నది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నది.

కరీంనగర్‌ ప్రాంతానికి చెందిన సువర్ణ (పేరు మార్చాం)కు డిగ్రీ చదువుతుండగానే వివాహమైంది. సంవత్సరం గడిచిందో లేదో విద్యుత్‌ ప్రమాదం ఆమె భర్తను కబళించింది. అప్పటికే తను ఎనిమిది నెలల గర్భిణి. కనీస మానవత్వమైనా చూపకుండా,  మెట్టింటివారూ గెంటేశారు. గుండెనిండా దుఃఖంతో పుట్టింటికి చేరింది. అక్కడా నిరాశే. అల్లారుముద్దుగా పెంచిన వాళ్లే పరాయి మనిషిలా  చూశారు. సూటిపోటి మాటలతో హింసించారు. శుభకార్యాలకు దూరం పెట్టారు. ఆ బాధనంతా బలవంతంగా దిగమింగింది. బాబుకు జన్మనిచ్చింది. అగమ్యగోచరంగా మారిన జీవితం. ఇంటా బయటా వివక్ష. ఎంతగానో తల్లడిల్లిపోయింది. 

ఎనిమిదేళ్లు వారి పంచనే గడిపింది. ఆ సమయంలోనే.. మధ్యలో ఆగిపోయిన డిగ్రీ పూర్తి చేసింది. కంప్యూటర్‌ కోర్సులో చేరింది. ఆ అర్హతతో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఓ సహోద్యోగి పెండ్లాడేందుకు ముందుకు వచ్చాడు. కానీ ఒక షరతు పెట్టాడు. మొదటి భర్త వల్ల కలిగిన బాబు మాత్రం తనకు వద్దన్నాడు. కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఏ తల్లి అయినా బిడ్డను దూరం చేసుకుంటుందా? ఆ ప్రతిపాదనకు నిరాకరించింది. చివరికి ఆ యువకుడు ఆమెలోని తల్లి మనసును అర్థం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నాడు. మోడువారిన జీవితం చిగురించింది. నుదుట సిందూరం ఉదయించింది.  

ఇది ఒక్క సువర్ణ కథే కాదు. మన చుట్టూ వేలమంది సువర్ణలు ఉన్నారు. మూఢనమ్మకాలు, అర్థంలేని ఆచారాల వల్ల వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. బాధల్ని అనుభవిస్తూ, వివక్షను తట్టుకుంటూ, మూఢవిశ్వాసాల్ని మౌనంగా భరిస్తూ.. ఆత్మాభిమానాన్ని వీడకుండానే, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండానే జీవితాల్ని పచ్చగా తీర్చిదిద్దుకుంటున్నారు భారతీయ వితంతువులు. తరతరాలుగా ఎన్ని అవమానాలు తనకూ?

ఎదురొస్తే అమంగళం, హాజరైతే అశుభం, ఇంట్లో ఉంటే దరిద్రం. 

జీవితభాగస్వామిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళ మీద ఇన్నిరకాల దాడులా? పోయిన కొడుకు ఆస్తిలో భాగం అడుగుతుందేమో అని అత్తింటివారు తరిమేస్తారు, ఉన్న కొడుకులకు సమానంగా ఇవ్వాల్సి వస్తుందేమోనని కన్నవారూ దూరం ఉంచుతారు. ఇక మిగిలింది సమాజం. ఆ ఒంటరి మహిళ మీద వేయి డేగ కండ్లు. బురదజల్లడానికి కొందరు, మాయమాటలతో ముగ్గులోకి లాగడానికి ఇంకా కొందరు, భద్రంగా దాచుకున్న పదోపరకో దోచుకోవడానికి మరికొందరు.  అయినా, ఆమె చేసిన నేరం ఏమిటి? జీవితం ఓ ప్రయాణం అనుకుంటే.. ఆ ప్రయాణంలో ఓ సహయాత్రికుడిని కోల్పోయింది. అదో యాక్సిడెంట్‌! ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోయిన ఓ దుర్ఘటన అది. తాజా జనాభా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 5.3 కోట్ల మంది వితంతువులు ఉన్నారు. 

విద్యతో చైతన్యం

ఒకానొక దశలో.. భర్త శవంతోపాటు నిప్పుల్లోకి తోసి తగులబెట్టారు.దానికి,సతీసహగమనమని పేరు పెట్టారు. మరొక దశలో..  కేశాలు ఖండించి, అలంకరణలు తొలగించి, బొట్టు తీసేసి.. ముతక చీరలిచ్చి జీవచ్ఛవంలా మార్చారు. చస్తూబతకమని శాపం పెట్టారు. దానికి, ఆచారమన్న ముసుగు తొడిగారు. ఆమె.. ఆ అవరోధాలన్నీ దాటుకు వచ్చి ఇరవై ఒకటో శతాబ్దం నాటికి - నిలబడుతున్నది. చదువుకుంటున్నది. ఉద్యోగం చేస్తున్నది. పిల్లల్ని పోషించుకుంటున్నది. తోడు కావాలనుకుంటే మళ్లీ పెండ్లి చేసుకుంటున్నది. గళమెత్తుతున్నది. ప్రశ్నిస్తున్నది. పోరాడుతున్నది. 

 ఆ ధైర్యానికి  కారణం పెరిగిన విద్యా, ఉపాధి అవకాశాలే!  కాబట్టే, గతంతో పోల్చితే చాలామంది వితంతువులు పునర్వివాహానికి ముందుకొస్తున్నారు. ఇంతకుముందు పిల్లలు లేనివారు మాత్రమే, మారుపెళ్లికి ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం పిల్లలున్నా సరే , కొత్త సహచరుల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సాహసోపేతమైన అడుగు.. గ్రామీణ స్థాయిలోనూ విస్తరిస్తున్నది. ఇందుకు ప్రధాన కారణం.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం. దీనివల్ల  ఉన్న కొద్దిపాటి పుట్టింటి ఆసరా కూడా దూరం అవుతున్నది. దీంతో, ఎక్కువకాలం ఒంటరిగా జీవించలేక ... మానసిక, ఉద్వేగపరమైన తోడు కోసం పెండ్లి చేసుకుంటున్నారని సామాజికవేత్తల అభిప్రాయం. రోజురోజుకూ స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో అంతరాలు పెరిగిపోవడం వల్ల కొన్ని సమూహాల్లో అమ్మాయిలు దొరకని పరిస్థితి.  దీంతో, చాలామంది యువకులు వితంతువుల్ని  జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఇలా, గతంలో తాను చేసిన పొరపాటును సృష్టికర్త సరిదిద్దు కుంటున్నాడేమో!  

పునర్వివాహాలను ప్రోత్సహించాలి..

సమాజంలో వితంతువులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వివక్షకు గురవుతున్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఉన్నట్టు గానే ... వితంతువులకూ  ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి ఇస్తున్నట్టుగానే, వితంతు పునర్వివాహాలు చేసుకున్న వారికి కూడా నగదు ప్రోత్సాహకాలు అందించాలి. 

- బాల శౌరిరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, బాలవికాస స్వచ్ఛంద సంస్థ

మార్పును ఆహ్వానించాలి..

మహిళల ఆలోచనా విధానం మారుతున్నది. ఎంతో చైతన్యవంతులు అవుతున్నారు. సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అనుకోని కారణం వల్ల భర్త చనిపోయినా, కుంగిపోకుండా దృఢంగా నిలబడుతున్నారు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. అలాంటి సంబంధాల కోసం మమ్మల్ని సంప్రదించేవారి సంఖ్య బాగా  పెరిగిపోతున్నది. 

- రాదండి వెంకటేశ్‌, స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ, తెలంగాణ ఆల్‌ మ్యారేజ్‌ బ్యూరోస్‌ అసోసియేషన్‌

వయసు..

37% 
  20 నుంచి 30 ఏండ్ల మధ్య 
35% 
 30-40 ఏండ్ల మధ్య
8%  
40-50 ఏండ్ల మధ్య
2%  
50 ఏండ్ల పైబడినవారు..
18%
 తమ వయసు  తెలియనివాళ్లు..


ఒంటరి యాత్రికులు

ఓ స్వచ్ఛంద సంస్థ దాదాపు మూడున్నరవేల మంది వితంతువులతో ఓ సర్వే చేసింది. ఆ గణాంకాలు సమాజంలో ఆమె పరిస్థితినీ, కుటుంబంలో ఆమె స్థితిగతుల్నీ వెల్లడిస్తున్నాయి.   

నివాసం..

40%
 ఒంటరిగా  
36% 
మెట్టినింట్లో
24% 
పుట్టింట్లో

సమస్యలు..

సామాజిక వివక్షను భరించలేక ఆత్మహత్యకు యత్నించినవారు 
29%
కుటుంబ సభ్యుల నుంచే నిందలు ఎదుర్కొంటున్నవారు
 43%
అపనమ్మకాల వల్ల దూషణలు ఎదుర్కొంటున్నవారు
 48%
మెట్టినింటి నుంచి తరిమేయడంలో ఆదరణ కోల్పోయినవారు 
54%
శుభకార్యాలకు ఆహ్వానం అందనివారు 
59%
 బొట్టు, పూలు తీసేయడంతో మానసిక వేదనకు గురవుతున్నవారు  
80%


తాజా పరిస్థితి 

70%  
బొట్ట్టూపూలూ పెట్టుకుంటున్నారు. 
30%
పండుగలు, సంప్రదాయ వేడుకల్లో పాల్గొంటున్నారు.
20% 
తాము మారడమేకాదు, తమ ఇండ్లలో శుభకార్యాలకు ఇతర వితంతువులనూ ఆహ్వానిస్తున్నారు. 


logo