ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 21, 2020 , 00:23:00

ఫేస్‌బుక్‌ చేపల మార్కెట్‌

ఫేస్‌బుక్‌ చేపల మార్కెట్‌

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ఎన్నో వ్యాపారాలను దెబ్బతీసింది. అదే సయమంలో అనేక కొత్త అవకాశాలను కూడా సృష్టించింది. ఆలోచన ఉండాలేగాని ఎంతటి క్లిష్టపరిస్థితిని అయినా అవకాశంగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు కొందరు ఔత్సాహికులు. అదే కోవకు చెందుతారు కేరళలోని తిరువనంతపురం జిల్లా కోస్తా తీరానికి చెందిన ఈ యువకులు. 

లాక్‌డౌన్‌ కారణంగా చేపల మార్కెట్లన్నీ మూతపడటంతో కొనేవారున్నా అమ్మేవారు కరువయ్యారు. దాతో విజింజమ్‌ గ్రామానికి చెందిన జోబిన్‌ ఓసెఫ్‌ అనే ఎంబీఏ గ్రాడ్యుయేట్‌ వినూత్నంగా ఆలోచించాడు. పచమీన్‌ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటుచేసి అందులో చేపల విక్రయం మొదలుపెట్టాడు. గ్రూప్‌ సభ్యుల నుంచి ఆర్డర్లు తీసుకొని చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుచేసి నేరుగా వండుకొనేలా హోం డెలివరీ చేస్తున్నాడు. దాంతో అతడికి ఆర్డర్లు వెల్లువెత్తాయి. తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ పేజీ ఓపెన్‌ చేసి తన వ్యాపారాన్ని తిరువనంతపురం కూడా విస్తరించాడు. అదే గ్రామానికి చెందిన మొహమ్మద్‌ రఫి, మొహమ్మద్‌ అల్తాఫ్‌ అనే సోదరులు కూడా కొద్ది వారాల క్రితం ఫేస్‌బుక్‌లో చేపల మార్కెట్‌ ఓపెన్‌ చేశారు. ‘మా ఫేస్‌బుక్‌ పేజీకి ఇంకా పేరు కూడా పెట్టలేదు. ఆర్డర్లు మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి’ అని వారు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆలోచన ఉండాలేగానీ ఎడారిలో కూడా నీరు పుట్టించొచ్చు అని నిరూపిస్తున్నారు ఈ యువకులు..


logo