శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 21, 2020 , 00:22:50

మరణంతోనూ మహా సేవ

మరణంతోనూ మహా  సేవ

లడఖ్‌లోని గల్వాన్‌లో చైనా సైన్యం దొంగదెబ్బ తీయటంలో మరణించిన 20 మంది వీర సైనికుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. మాతృభూమి సేవ తప్ప కల్మశం ఎరుగని ఈ అమరులు చనిపోయిన తర్వాత కూడా తాము పుట్టిపెరిగిన గ్రామాలకు గొప్ప సేవ చేశారు. 

20 మంది అమరుల్లో ఆరుగురు సైనికులు కనీసం రోడ్డుకూడా లేని గిరిజన గ్రామాల నుంచి కష్టపడి సైన్యంలో చేరారు. పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలకు చెందిన ఈ వీరుల పార్థివదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు కూడా సరైన రోడ్డులేదు. దాంతో స్థానిక అధికారులు ఆగమేఘాలమీద ఆయా గ్రామాలకు రాత్రికి రాత్రే రోడ్లు వేశారు. గ్రామాల్లో వీధి లైట్లు ఏర్పాటుచేశారు. అమరుల్లో ఒకరైన సిపాయ్‌ గణేశ్‌ హండ్సాది జార్ఖండ్‌లోని పశ్చిమసింగ్భం జిల్లాలో ఉన్న బందీ తల్లామ్‌ అనే మారుమూల గ్రామం. గణేశ్‌ మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు ఒక్కరోజు ముందు రోడ్లు వేసి వీధిలైట్లు ఏర్పాటుచేశారని అతడి సోదరుడు దినేశ్‌ హండ్సా తెలిపారు. గ్రామంలో రోడ్డు వేయటానికి దినేశ్‌ కూడా కూలీగా వెళ్లాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బిపుల్‌ రాయ్‌, మధ్యప్రదేశ్‌లోని దీపక్‌కుమార్‌ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గణేశ్‌రామ్‌ కుంజమ్‌ గ్రామాల కథ కూడా ఇలాంటిదే. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ఈ వీరులు, తమ గ్రామాలకు కూడా వెలుగులు ఇచ్చి వెళ్లారు.  


logo