శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 20, 2020 , 01:15:54

సగం జీవితం.. నిండు ప్రేమ!

సగం జీవితం.. నిండు ప్రేమ!

కర్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి

అతడు యోధుడు. సైన్యంలో చేరాడు. సరిహద్దుల్లో పోరాడాడు. ఆమాటకొస్తే ఆమె కూడా యోధురాలే. ఒక సైనికుడిని పెండ్లాడింది. అతడి వెన్నంటి నిలిచింది. సెలవులకు వచ్చిన ప్రతిసారీ వీరతిలకం దిద్ది సాగనంపింది. ఈ పదేండ్ల్ల కాలంలో సగం సమయం అతడితో, సగం సమయం అతడి జ్ఞాపకాలతో బతికింది. ఇకపైనా ఆ జ్ఞాపకాలే ఊపిరి. వెళ్తూవెళ్తూ వందేండ్ల్ల జీవితానికి సరిపడా ధైర్యాన్ని ఇచ్చి వెళ్లాడు సంతోష్‌. కాబట్టి.. ఆమె అడుగుల్లో తడబాటు ఉండదు. ఆ ఆత్మవిశ్వాసం ఆమె ప్రతిమాటలోనూ  ప్రతిధ్వనిస్తున్నది..   సైన్యంలో పనిచేయడం అంటే ప్రతిక్షణం, ప్రతిరోజూ మృత్యువుతో పోరాటమని నాకు తెలుసు. అలా నన్ను మానసికంగా సిద్ధం చేశాడు సంతోష్‌. అవకాశం వచ్చిన ప్రతిసారీ, సరిహద్దు పరిస్థితుల గురించి నాకు తెలియజెప్పాడు. ఏదైనా సమస్య వస్తే ఎదురొడ్డి నిలబడటం ఎలాగో నేర్పించాడు.  

మాకు 2009లో వివాహమైంది. తను సాధారణ ఉద్యోగి కాదు. పదింటికి వెళ్లి ఆరింటికి రావడమూ కుదరదు. వారాంతాల్లో భార్యాపిల్లలతో గడిపే అవకాశమూ ఉండదు. మొత్తంగా తన జీవనశైలే వేరు. దీంతో, తెలిసిన వాళ్లు అయితే బాగుంటుందని సంతోష్‌ తరచూ వాళ్ల అమ్మతో చెప్పేవాడట. మా అత్తయ్య నన్ను ఓ వివాహంలో చూశారు. తనకు నచ్చడంతో సంతోష్‌కు చెప్పారట. దీంతో నన్ను చూడటానికి వచ్చాడు. ఆతర్వాత కూడా, రెండు మూడు సంబంధాలు వచ్చాయట. అయినా, నన్నే ఏరికోరి చేసుకున్నాడని ఎప్పుడూ  అత్తయ్య చెబుతుంటారు. ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడో, అంతే ప్రేమగా చూసుకున్నాడు. తను మంచి భర్త. మంచి కొడుకు. మంచి తండ్రి. మంచి పౌరుడు కూడా. బాధ్యతల్ని ఎంత గౌరవించేవాడో కుటుంబాన్నీ అంత ప్రేమించేవాడు.  ఈ పదేండ్లలో ఐదేండ్లు కలిసి ఉన్నాం. మాకు ఇద్దరు పిల్లలు. పాప వయసు తొమ్మిదేండ్లు, బాబుకు మూడున్నరేండ్లు. ఎన్ని పనులున్నా.. రెండు డెలివరీల సమయంలోనూ నా సమక్షంలోనే ఉన్నాడు. తను ఉంటే నాకు కొండంత ధైర్యం. ఇప్పుడూ అంతే ధైర్యంతో బతుకుతాం. తన ఆశీస్సులూ ప్రేమా మాతోనే ఉంటాయి. 

పిల్లల భవిష్యత్‌పై ...

 పిల్లల భవిష్యత్‌ గురించి తనకు చాలా ఆలోచనలు ఉండేవి.  ఒకరిని ఫ్లై ఫోర్స్‌ (ఎయిర్‌ ఫోర్స్‌)కి పంపితే బాగుంటుందని అనేవాడు. అలా అని, తన భావాల్ని పిల్లల మీద రుద్దడం తనకు ఇష్టం ఉండదు. ‘ఎవరి జీవితాలు వారివి. దారిచూపించడం వరకే మన బాధ్యత. పిల్లల జీవితానికి విలువలతో కూడిన పునాదిని నిర్మిద్దాం. భవిష్యత్తులో నచ్చిన వృత్తినో ఉద్యోగాన్నో ఎంచుకోనిద్దాం’ అని చెప్పేవాడు. ‘అమ్మా! మేమూ నాన్నలా సైన్యంలోకి వెళ్తాం’ అని అడిగితే సంతోషంగా పంపిస్తాను. నా భర్త దేశం కోసం పనిచేశాడు. నా బిడ్డలూ ఆ దారిలోనే నడిస్తే అంతకు మించిన ఆనందం ఏం ఉంటుంది? సంతోష్‌.. తను పేరుకు తగినట్టే, నిత్యం సంతోషంగా ఉండేవాడు. అందరికీ సంతోషాన్ని పంచేవాడు. మా  జీవితాలూ, కలలూ ఆయన చుట్టూనే అల్లుకున్నాయి. తను స్వతహాగా చాలా తెలివైనవాడు. ఏ సాఫ్ట్‌వేర్‌ రంగానికో వెళ్లి ఉంటే కోట్లు సంపాదించేవాడు. వ్యాపారంలోకి అడుగుపెట్టి ఉంటే గొప్ప స్థాయికి ఎదిగేవాడు. కానీ, తన లక్ష్యం సంపాదన కాదు, ఆస్తిపాస్తులూ కాదు.. దేశం! మాతృభూమి కోసం పనిచేస్తున్నాననే తృప్తి అణువణువునా కనిపించేది. 

జ్ఙాపకాలే ఊపిరి..

మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 15 వరకు.. మొత్తంగా మాతోనే ఉన్నాడు. మా సమక్షంలోనే, మేమే ప్రపంచంగా గడిపాడు. పిల్లలతో కలిసి ఎక్కడికైనా  వెళ్లాలనుకున్నా, కరోనా కారణంగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. చివరి రోజు ‘టాటా..బైబై’ అని చెప్పి బయల్దేరాడు. వెళ్తూవెళ్తూ వెళ్లొస్తానని చెప్పాడు. వెళ్లాడు కానీ, ఇలా తిరిగొచ్చాడు. నాతో చివరి సారిగా ఫోన్‌లో మాట్లాడింది.. ఈ నెల 14న రాత్రి. ‘మీరు ఎలా ఉన్నారు... నేను బాగున్నాను’ అంటూ పిల్లల్ని పలకరించి, మళ్లీ నాతో మాట్లాడాడు. ‘అక్కడ ఎలా ఉంది?’ అని అడిగితే,  ‘తరువాత మాట్లాడతాను లే..’ అంటూ రెండు నిమిషాల్లో ఫోన్‌ పెట్టేశాడు. సంతోష్‌తో నా జీవన ప్రయాణం సగంలోనే ఆగిపోయింది. అయినా నాకు బాధ లేదు. వందేండ్ల జీవితానికి సరిపడేంత ప్రేమను పంచాడు.  సరిహద్దుల్లో ఎన్నో ప్రాణత్యాగాలు జరుగుతున్నాయి.   ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రజలు దేశం కోసం ఒకే మాట మీద నిలబడాలి.  యువత మరింతగా సైన్యంలోకి వెళ్లాలి. భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇదే నా భర్త ఆశయం. 

నా ఆకాంక్ష కూడా! 

‘అమ్మా! మేమూ నాన్నలా సైన్యంలోకి వెళ్తాం’ అని అడిగితే సంతోషంగా పంపిస్తాను. నా భర్త దేశం కోసం పనిచేశాడు. నా బిడ్డలూ ఆ దారిలోనే నడిస్తే అంతకు మించిన ఆనందం ఏం ఉంటుంది?


logo