ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 20, 2020 , 01:15:53

ఖాకీ కవయిత్రి!

ఖాకీ కవయిత్రి!

సమాజంలోని లోపాలను సరిచేయడం పోలీసుల ప్రథమ కర్తవ్యం. ఆ బాధ్యతను నెరవేర్చేందుకు లాఠీని కాకుండా.. అంతకంటే వేయిరెట్లు బలమైన కలాన్ని ఉపయోగిస్తున్నారు మెదక్‌ పోలీస్‌ బాస్‌ చందనాదీప్తి. సమాజంలోని సమస్యలూ, యువతను బలితీసుకుంటున్న పెడధోరణులూ, కన్నవారి ప్రేమలూ, కమ్మని స్నేహాలూ  ఆమె కవిత్వానికి ముడిసరుకు. చందనాదీప్తి.. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ 2012 బ్యాచ్‌ అధికారి. ఐఐటీ ఢిల్లీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో పట్టభద్రురాలైన చందనకు ముందు నుంచీ సామాజిక బాధ్యత కలిగిన కెరీర్‌ పట్ల మక్కువ. కాబట్టే, కార్పొరేట్‌ ప్రపంచం వైపు అడుగులు వేయకుండా ఖాకీ డ్రెస్‌ను ఎంచుకున్నారు. తనకు సాహిత్యం అంటే ప్రాణం. అక్షరాలంటే అభిమానం. పుస్తక ప్రేమి. మనుషుల్నీ, సమాజాన్నీ అతి దగ్గర నుంచీ గమనించడం అలవాటు. వ్యవస్థలోని ప్రతిలోపం ఆమెను బాధపెట్టేది. వాటికి తనవంతు పరిష్కారం అందించాలన్న తపన స్థిమితంగా ఉండనిచ్చేది కాదు. ఆ స్పందించే గుణమే చందనను.. కవయిత్రిని చేసింది, ఖాకీ యూనిఫామ్‌ వేసుకునేలానూ చేసింది. జిల్లా పోలీసు అధికారి హోదాలో ఆమె వృత్తికి, ప్రవృత్తికి సమన్యాయం చేస్తున్నారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా... తన కలాన్ని కదిలిస్తున్నారు. యువతకు మార్గదర్శనం చేసే కవితలు రాస్తున్నారు. చందన కవిత్వంలో భావ గాఢత ఎక్కువ. అల్పమైన పదాలు అనల్పార్థాన్ని మోసుకొస్తాయి. ‘నేను గెలవటంలో ఓడిపోవచ్చు...! కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను! గెలిచి తీరతాను’ అంటూ ఓ కవితలో ప్రతి ఓటమీ ఓ పాఠమే అని గుర్తుచేస్తారు. చిన్నచిన్న వైఫల్యాలకే కుంగిపోయే యువతకు ఈ మాటలే స్ఫూర్తి మంత్రాలు. 

‘అమ్మ’అంటే ఆనందం

‘అమ్మ’ ఇవ్వటానికి అందరి కన్నా ముందుండే అవని

‘అమ్మ’ అంటే ఆప్యాయతకు మొదటి రూపం

‘అమ్మ’ అంటే బిడ్డలను ఉన్నతశిఖరాలకు చేర్చే వాహకం

-అంటూ అమ్మదనంలోని కమ్మదనాన్ని కొనియాడతారు. 

ప్రేమ ముసుగులోని ఆకర్షణలు యువతని ఎలా పక్కదారి పట్టిస్తున్నాయో ఓ కవిత ద్వారా వివరించారు, కాదుకాదు హెచ్చరించారు. ‘ప్రేమంటే వాట్సప్‌ తెరపై నిత్యం కదలాడే సందేశం కాదు.ప్రేమంటే కారులో షికారుకెళ్లి ఒక నాలుగు పుకార్లు సృష్టించుకోవటం కానేకాదు.ప్రేమంటే నడిరోడ్డులో నాలుగు పెదాలు కలిసి చేసే పని అంతకన్నా కాదు..’ ఏది ప్రేమకాదో చెబుతూనే, ఏది ప్రేమో స్పష్టతనిస్తున్నారు.‘మనం తల్లి గర్భం నుంచి బయటపడ్డాక ఏ కల్మషం లేకుండా మనల్ని తొలిసారి చూస్తుంది చూడు... అదే ప్రేమంటే!’  అంటూ!

‘వర్ష్షాకాలం ప్రారంభమై ప్రకృతి పులకరిస్తున్నది...మనల్ని పరవశించేలా చేస్తున్నది. అలా ఎప్పుడూ తన ఒడిలో సేద తీరుస్తున్న ప్రకృతికి మనవంతుగా ఒక మొక్కను నాటి బహుమతిగా ఇద్దాం. ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటితే ప్రకృతికి అంతకన్నా ఇచ్చే బహుమతి ఇంకేముంటుంది’ 

అని పిలుపునిస్తూ యువతలో పర్యావరణ స్పృహనూ పెంచుతున్నారామె.  వేలాది లైక్స్‌..

చందన ఫేస్‌బుక్‌ పోస్టులకు.. వేలాది లైక్‌లు వస్తుంటాయి. ఆ ప్రోత్సాహమే తనతో మరిన్ని రచనలు చేయిస్తుందంటారు. తనకు నాట్యం అన్నా ప్రాణమే. మూడేండ్ల ప్రాయంలోనే భరతనాట్యంలో అరగేంట్రం చేశారు. ఆ నాట్య ప్రస్థానం..పాఠశాల, కళాశాల స్థాయిలోనూ ప్రైజులు తెచ్చిపెట్టింది. పోలీస్‌ అకాడమీలో నూ అనేక ప్రశంసలు పొందారు చందనా దీప్తి. 

‘అతని చేతులు నేలను నిమిరి 

రక్తమోడుతున్నాయి..

అయినా అతడు రాజే.

అతని అరికాళ్లు పుండ్లవుతున్నాయి..

అయినా అతడు రాజే.

అతని శరీరంపై చీడపురుగులు 

నాట్యం చేస్తున్నాయి...

అయినా అతడు రాజే. 

అతనికి కాలం కలిసిరాక 

కరువే విషమై కాటేస్తుంది. 

అయినా అతడు రాజే.

అవును అయినా అతను రాజే. 

ఎందుకంటే...

అతని నెత్తిన చెమటనే కిరీటం ఉంది’

-చందనాదీప్తి, ఐపీఎస్‌

-నాగోజు సత్యనారాయణ


logo