ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 20, 2020 , 00:02:31

కోతి చేష్టలు

కోతి చేష్టలు

పూర్వం ‘అరిదుర్గ’ అనే పట్టణంలో శుభదత్తుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పట్టిందల్లా బంగారం అన్నట్టు వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. కొద్దికాలంలోనే పట్టణంలో కెల్లా ఏకైక ధనవంతుడు అయ్యాడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నా ఒకే ఒక్క లోటు.  అతనికి సంతానం లేదు. ఒక రాత్రి శుభదత్తుడి కలలో రాముడు కనిపించి ఊరి చివర ఉన్న రామాలయాన్ని బాగుచేయిస్తే  సంతానం కలుగుతుంది అని చెప్పాడు. మర్నాడు శుభదత్తుడు ఆ రామాలయం బాగు చేయించటానికి కొంతమంది పనివాళ్లను నియమించి వాళ్లకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చాడు. చెదలు పట్టి విరిగిపోయిన దూలాల స్థ్ధానంలో కొత్తవి అమర్చటానికి పనివాళ్లు సిద్ధమయ్యారు. ఆ దేవాలయ ఆవరణలో ఉన్న టేకు చెట్లను దుంగలకోసం రంపంతో కోయడం మొదలు పెట్టారు. ఆ చెట్ల మీదున్న కోతులు రంపపు శబ్దాన్ని విని ‘ఇదేదో భలే బాగుందే’ అనుకున్నాయి. మధ్యాహ్నం అయింది. పని వాళ్ళందరూ భోజనాలకు బయలుదేరారు. అప్పటివరకూ రంపంతో నిలువుగా కోసిన దుంగ కలిసిపోకుండా మధ్యలో ఓ మేకును అడ్డంగా కొట్టి వెళ్లిపోయారు పనివాళ్లు.  వాళ్లు భోజనానికి వెళ్లగానే చెట్ల మీది నుంచి కోతులు కిందకు దిగాయి. అక్కడే ఉన్న రంపం అందుకుని పనివాళ్లు కోసినట్టుగా దుంగను కొయ్యాలని ప్రయత్నాలు చేశాయి. దుంగ మధ్యలో వారు కొట్టిన మేకు అడ్డంగా ఉంది. కాసేపు కోతులన్నీ ‘ఏం చెయ్యాలా..?’ అని బుర్రలు గోక్కున్నాయి. ఒక కోతి ‘ఆ మేకును అడ్డం తీసేస్తే సరిపోతుంద’ని సలహా ఇచ్చింది. ఆ సలహా మిగతా కోతులన్నిటికీ నచ్చింది. ఆ కోతుల గుంపులో బలమైన కోతి ముందుకు వచ్చి ఆ మేకును తను లాగుతానంది. మిగతా కోతులు దానికి జయ జయ ధ్వానాలు చేశాయి. ఆ కోతి మిగతా కోతుల వంక గర్వంగా చూసి దూలం వైపు అడుగులేసింది. చీలి ఉన్న దూలం మధ్యలో కూర్చొని రెండు చేతులతో మేకుని పట్టుకొని పైకి లాగింది. రెండుగా చీలి ఉన్న దూలం ఒక్కక్షణంలో దగ్గరకు అతుక్కొని పోయింది. మధ్యలో కూర్చున్న కోతి అందులో ఇరుక్కొని విలవిలలాడింది.

నీతి: ప్రయోజనం లేని పనుల వల్ల చివరికి నష్టమే. logo