ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 17, 2020 , 23:46:19

భయం గుప్పిట్లో మనం

భయం గుప్పిట్లో మనం

“బయటికెళ్తే కరోనా భయం! ఇంట్లో ఉంటే రేపటి బతుకేమిటన్న భయం. పక్కవాడిని పలుకరిద్దామన్నా, ఏ వస్తువు ముట్టుకుందామన్నా, ఏది కొందామన్నా భయం భయం! గడప దాటడమంటే యుద్ధానికి వెళ్తున్నంత ఆందోళన. భవిష్యత్తు బరువైపోతుందన్న ఒత్తిడి. ప్రత్యక్షంగా, పరోక్షంగా మనుషులనూ మనసులనూ కరోనా ఛిన్నాభిన్నం చేసేస్తున్నది. సామాన్యుడి నుంచి ధనవంతుడి దాకా ప్రతిఒక్కరి జీవితాలనూ నరకంగా మార్చేస్తున్నది. ఇంట్లో ఉంటే మనం బతుకలేం.. బయటికెళ్లినా బతుకలేం - అన్న అభద్రతను సృష్టించిందీ మహమ్మారి.”

హైదరాబాద్‌కు చెందిన ఓ బాలుడు కరోనా వైరస్‌ గురించి అతిగా ఆలోచించాడు. బయటికి వెళ్తే కరోనా చంపేస్తుందేమోనన్న అనుమానంతో రెండున్నర నెలలపాటు బెడ్‌రూమ్‌కే పరిమితం అయ్యాడు. ఇంటి హాల్‌లోకి కూడా వెళ్లడంలేదు. కరోనాతో ఏర్పడిన భయానక వాతావరణానికి ఇదో చిన్న ఉదాహరణ. దీంతో మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి.

గడప దాటకుండా రెండున్నర నెలలు ఉండటం, చుట్టాలను ఇంటికి రావొద్దనేంత కఠినంగా మారటం, నెలలకొద్దీ బడులు మూతబడటం, రాయకుండానే పరీక్షలు పాసవటం.. ఇలా ఏదైనా వింత జరిగితే కలికాలం అనేటోళ్లు. దానికి మించినదీ ‘కరోనా కాలం’. కూలి పని కరువై, ఉద్యోగాలు పోయి, వ్యాపారాలు నడువక మనుషుల గుండెల్లో బుగులు పుట్టింది. ‘వైరస్‌వ్యాప్తిని అడ్డుకోవడానికి’ అని చెప్పగానే లాక్‌డౌన్‌కు ఓకే చెప్పాం. కానీ, ఆ మరుక్షణమే మెదడును తొలిచిన ప్రశ్న.. బతుకు బండిని లాగేదెట్లా?. చేతిలో డబ్బు లేక, సంపాదన లేక, నెలవారీ ఖర్చుల భారం మోయలేక, కన్నీళ్ల కష్టం ఆగడం లేదు. రోజెట్ల గడుస్తదో..రేపు ఎట్లుంటదోనన్న రందితో సామాన్యుడు మానసికంగా కుంగిపోతున్నాడు. మావెరిక్స్‌ ఇండియా, జెన్‌-జడ్‌ సంస్థల అధ్యయనం ప్రకారం దేశంలో 61 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 80 కోట్ల మందికిపైగా బిక్కుబిక్కుమంటున్నారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలీక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. 

బడులు ఎప్పుడు తెరుచుకుంటాయో చదువులు ఎలా సాగుతాయో తెలియక పిల్లలూ, నియామకాలు ఎలా అని పట్టభద్రులూ నిరాశలో కూరుకుపోతున్నారు. మనసులోని బాధలను ఎవరికీ చెప్పుకోలేక గృహిణులు, ఉద్యోగులు తమలో తామే మథనపడుతున్నారు. ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు లాక్‌డౌన్‌ మొదట్లో వైద్య చికిత్సలు వాయిదా వేసుకున్నారు. మందులతో సర్దుకున్నారు. కానీ ఆ తర్వాత ఆందోళన మొదలైంది. దవాఖానలు తెరిచినా ధైర్యంగా వెళ్లలేకపోతున్నారు. వైద్యులు సైతం బిక్కుబిక్కుమంటూ చికిత్స చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొందరు వైద్యులైతే ఏకంగా దవాఖానలను బంద్‌ చేసుకున్నారు.

చచ్చిపోతమా?


ప్రపంచమంతా కరోనా జపం చేస్తుండటంతో ప్రజల్లో మరణభయం పెరిగింది. ఇందుకు రెండు కారణాలున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకటి.. తప్పుడు సమాచారం. రెండు.. ఉన్న సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం. చిన్న పిల్లలను కట్టడి చేసేందుకు చాలామంది ‘బయటికి వెళ్తే కరోనా మింగేస్తుంది’ అంటున్నారు. దీంతో, ‘గడపదాటితే చచ్చిపోతాం’ అనే భావన పిల్లల్లో బలంగా నాటుకుపోతున్నది. మరికొందరు కరోనా లక్షణాలు, వ్యాప్తి, నియంత్రణ చర్యలపై పూర్తిగా అవగాహన పెంచుకోకుండా ‘మనందరికీ కరోనా రావడం ఖాయం’ అనే భావనలో బతుకుతున్నారు. ఇదే ‘డిసీజ్‌ఫోబియా’.

ఆర్థిక సంక్షోభం  ప్రభావం చూపింది


ప్రతి ఒక్కరినీ ఆర్థిక సంక్షోభం పెనుభూతంలా భయపెడుతున్నది. లాక్‌డౌన్‌ మొదట్లో ఉత్సాహంగానే ఉన్నా, క్రమంగా అందరికీ ఆర్థిక అవసరాలు గుర్తొస్తున్నాయి. కరోనాతో అన్ని రంగాలూ కుదేలు కావడంతో సకలవర్గాల ప్రజల్లో భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. చేతినిండా పనిలేకపోవడం, బుర్రపెట్టి ఆలోచించాల్సిన అవసరం లేకపోవడంతో నీరసించిపోయారు. ఇది క్రమంగా మానసిక ఒత్తిడికి దారి తీస్తున్నది. ముఖ్యంగా ‘వాట్‌ నెక్స్‌' అన్న ప్రశ్న వేధిస్తున్నది. స్కూల్‌ ఎప్పుడు తెరుస్తారో, చదువు ఎలా సాగుతుందో అన్న జవాబులేని ప్రశ్నలు పిల్లల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులకు అలవాటుకాలేక మథనపడుతున్నారు.

- మేధా చిరంజీవి, వ్యక్తిత్వ వికాస నిపుణులు

పరిస్థితులనుబట్టి మారాలి

ఇది ఊహించని పరిణామం. ముందు జాగ్రత్తల విషయంలో ఎవరినీ నిందించలేం. రొటీన్‌ జీవితం, భవిష్యత్తు పట్ల భయం, లాక్‌డౌన్‌ కారణంగా అసహనం, కోపం, ఒత్తిడి .. వంటివి పెరిగిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన అలవాట్లు, ఆలోచనా విధానం మార్చుకుంటేనే గండం నుంచి గట్టెక్కుతాం. కరోనా సోకకుండా అనేక మార్గాలున్నాయి. ముందుగా వ్యతిరేక ఆలోచనలను పక్కనబెట్టి, ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు బయటి పరిస్థితులను అర్థమయ్యేలా వివరించాలి. తప్పుడు సమాచారం ఇస్తే, వారిలో దీర్ఘకాలిక మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

 - డాక్టర్‌ జీసీ కవిత, మానసిక వైద్యనిపుణులు, ఐకెన్‌ వెల్‌నెస్‌ నేషనల్‌ కో-ఆర్డినేటర్‌

‘మహానుభావులు’ ఎక్కువయ్యారు!

కరోనా కారణంగా కొందరికి అతిశుభ్రత (అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ - ఓసీడీ) లక్షణాలు కనిపిస్తున్నాయి. బయటి నుంచి ఎవరొచ్చినా విపరీతంగా అనుమానిస్తున్నారు. ఇది ఒకందుకు మంచిదే అయినా, కొందరిలో మోతాదు మించుతున్నది. ఇంటికి ఎవరొచ్చినా ఆందోళన చెందడం, ఎక్కువసార్లు ఇంటిని కడుగటం, ఇంట్లోని వస్తువులను ముట్టుకున్నా శానిటైజర్‌, హ్యాండ్‌వాష్‌తో శుభ్రం చేసుకోవడం.. తదితర లక్షణాలు కనిపిస్తున్నట్టు నిపుణులు తెలిపారు. ఇది మానసికంగా ఆందోళన చెందాల్సిన విషయమేనని హెచ్చరిస్తున్నారు. 

 అధ్యయన వివరాలు

1 లాక్‌డౌన్‌తో 61 శాతం మంది భారతీయులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

2 దేశ జనాభాను బట్టి ఆ లెక్క దాదాపు 83 కోట్లు ఉంటుంది. 

3  కరోనాతో ఓసీడీ రోగుల సంఖ్య రెట్టింపు అవుతున్నది.

4 జీవితం రొటీన్‌గా మారిపోవడంతో అసహనం పెరిగిపోతున్నది.

5 24 గంటలు ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో ప్రతి విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూడటం అలవాటైంది.

6 కుటుంబంలో అనవసర వాదనలు, ఘర్షణలు పెరిగిపోయాయి.

7 వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌  మానసిక సమస్యలకు దారి తీస్తున్నది. పని ఒత్తిడిని పెంచుతున్నది. ...ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సీయీవో సత్యనాదెళ్ల తాజాగా స్పష్టం చేశారు కూడా.


logo