ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 17, 2020 , 23:46:18

మామిడి రోటి పచ్చడి

మామిడి రోటి పచ్చడి

భారతీయ సంస్కృతిలో ఆహారానికి చాలా ప్రాధాన్యం ఉంది. భోజనానికి ముందు.. ప్రతి ముద్దా ఓ అమృతపు చుక్కగా మారి ఆయువును పెంచేలా చేయమని పరమాత్మను ప్రార్థిస్తాం. ఆ మాట నిజం కావాలంటే, మనం వండుకునే పదార్థాలకు ఔషధీయ విలువలు ఉండాలి. అప్పుడే రోగనిరోధక శక్తి వస్తుంది. శరీరం వజ్రసమానం అవుతుంది.   

కావలసిన పదార్థాలు : 

మామిడి కాయ : ఒకటి, వెల్లుల్లి : 3, అల్లం : 2, ఉల్లిగడ్డ : సగం, టమాట : ఒకటి, దానిమ్మ గింజలు : 1 టేబుల్‌ స్పూన్‌, కరివేపాకు : 10-12 రెబ్బలు, వాము ఆకులు : 4-5, తులసి ఆకులు : 5-6, పుదీనా  : 1 కప్పు, కొత్తిమీర : 1 కప్పు, పచ్చిమిర్చి : 2 లేదా 3ఉప్పు : తగినంత, బెల్లం-చింతపండు : అవసరమైతేనే.

ఇలా చేయాలి..

అన్ని పదార్థాల్నీ నేరుగా.. రోట్లో వేసి మెత్తగా దంచాలి.  తిరగమోత కూడా అవసరం లేదు. ఒకటి లేదా రెండు చెంచాల చట్నీని.. వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి.  రోట్లో దంచే సమయంలో వెలువడే వాసనలకు ఔషధీయ విలువలు ఉంటాయి. ఇవి నాసిక ద్వారా శ్వాస వ్యవస్థను చేరతాయి. చట్నీని ఎటూ వేడి చేయం కాబట్టి, అందులోని పోషకాలు బయటికి పోవు. 

లాభాలు :

మామిడి, టమాట, దానిమ్మ గింజలు విటమిన్‌-సిని అందిస్తాయి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, టమాటాలతో శరీరానికి అవసరమయ్యే ఇతర విటమిన్స్‌, మినరల్స్‌ అందుతాయి. తాజా ఆకులతో ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. తులసి ఆకులు వికారం నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇరిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ ఉన్నవారు, గర్భిణులు ఈ చట్నీని తినకపోవడమే మంచిది. 


logo