ఆదివారం 24 జనవరి 2021
Zindagi - Jun 15, 2020 , 00:08:04

‘స్వకృషి’తో నాస్తి దుర్భిక్షం

‘స్వకృషి’తో నాస్తి దుర్భిక్షం

ఒకరి ఆలోచన.. వేలమంది అవసరాలను తీరుస్తున్నది. ఒక ఆచరణ.. ప్రైవేట్‌ ఫైనాన్షియర్ల కబంధ హస్తాల నుంచి వందల కుటుంబాలను కాపాడుతున్నది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ‘స్వకృషి మహిళా పొదుపు సంఘం’.. అతివల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నది. నాడు పోపుడబ్బాలకే పరిమితమైన పొదుపును.. నేడు మహోద్యమంలా నడిపిస్తున్నది. బ్యాంకుల ద్వారా కోట్లలో లావాదేవీలు జరుపుతూ.. అవసరమున్నవారికి లక్షల్లో రుణాలిచ్చే స్థాయికి చేరింది. నీతి.. నిజాయతీ.. విలువలు.. పారదర్శకతకు నిలువెత్తు నిదర్శంగా మారి, ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. 

కుటుంబ అవసరాల కోసం ప్రైవేట్‌ ఫైనాన్స్‌  కంపెనీల నుంచి తీసుకున్న అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. వడ్డీలు కట్టలేక పేద మహిళలు సతమతమవుతున్నారు. అలాంటి వారికి అండగా ఉండాలనే లక్ష్యంతో 20 ఏండ్ల క్రితం.. హుస్నాబాద్‌కు చెందిన గురాల అరుణ చేతుల మీదుగా ఈ ‘స్వకృషి మహిళా పొదుపు సంఘం’ పురుడు పోసుకున్నది. నాడు 200 మంది సభ్యులతో రూ.2వేల ప్రారంభ నిధితో మొదలైన  వీరి ప్రస్థానం.. నేడు 6,800మంది సభ్యులతో రూ.3.66కోట్ల పొదుపు స్థాయికి చేరింది. 

ఆ సమావేశమే స్ఫూర్తి

1999లో హన్మకొండ నుంచి వస్తుండగా, భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో రోడ్డు పక్కన సమావేశమైన మహిళలను గురాల అరుణ గమనించారు. వారంతా ఒక  సంఘంగా ఏర్పడి, ప్రతినెలా కొంత పొదుపు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు.ఆ క్షణంలో..తమ ప్రాంతంలో ప్రైవేట్‌ ఫైనాన్షియర్ల దోపిడితో నిరుపేద మహిళలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘మన డబ్బును మనమే పొదుపు చేసుకుంటే ఎప్పుడూ మన వద్దే ఉంటుంది. అవసరాల కోసం ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. ఎవరిమీదా ఆధారపడాల్సిన పనిలేదు’ అనే కోణంలో ఆలోచించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే పొదుపు సంఘమే సరైన పరిష్కారమని, ఎప్పటికైనా ఒక  సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే, అరుణను సహవికాస సంస్థకు చెందిన రామిరెడ్డి సంప్రదించారు. అలా 2000 సంవత్సరంలో ‘స్వకృషి మహిళా పొదుపు సంఘం’ ఏర్పడింది. 

మన పొదుపులు.. మన అవసరాలకే.. 

‘స్వకృషి’ సంఘం ఏర్పాటు తర్వాత హుస్నాబాద్‌ ప్రాంతంలోని అనేక మంది మహిళలతో అరుణ సమావేశమయ్యారు. పొదుపు ఆవశ్యకత, ఆర్థిక స్వావలంబన ప్రాధాన్యం మీద  అవగాహన కల్పించారు. కష్టపడి సంపాదించిన సొమ్ములో ఒకింత పొదుపు చేస్తే, అవసరాలకు ఉపయోగపడుతాయని వివరించారు. అనేకమందిని అటువైపుగా మళ్లించారు. తద్వారా ప్రతి ఒక్కరూ నెలకు రూ.20 చొప్పున పొదుపు చేసేలా ఒప్పించారు. హుస్నాబాద్‌లో మొదలైన ‘స్వకృషి మహిళా పొదుపు సంఘం’ కార్యకలాపాలను మెల్లమెల్లగా చుట్టుపక్కల గ్రామాలకూ విస్తరించింది. మహిళలెవరూ ఇంకొకరిపై ఆధారపడకుండా, తమ సంపాదనలో కొంత పొదుపు చేయాలని గ్రామగ్రామానా సదస్సులు నిర్వహించారు. ఇలా హుస్నాబాద్‌ పట్టణంతోపాటు హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల్లోని 14 గ్రామాల్లో పొదుపు సంఘాలను ఏర్పాటు చేయించారు. అవసరాలకు అప్పులు

పొదుపు సంఘంలో 18  నుంచి 55 ఏండ్ల  మహిళలను సభ్యులుగా చేర్చుకుంటారు. ప్రతి సంఘానికీ 12 మందితో కార్యవర్గం ఉంటుంది.  అరుణ వారితో నెలనెలా సమావేశాలు నిర్వహిస్తూ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ప్రతి మహిళా ఆ సమావేశాన్ని చాలా కీలకమైందిగా భావిస్తుంది. తప్పకుండా హాజరు అవుతుంది. ఆదాయ, వ్యయాల నివేదికల్లోనూ ఎలాంటి పొరపాట్లూ లేకుండా చూసుకుంటారు. ఏటా పొదుపు సంఘాల వార్షిక మహాసభలు, నూతన కార్యవర్గ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తారు. ప్రస్తుతం ఒక్కొక్కరూ నెలకు రూ.50 పొదుపు చేస్తుండగా, ఈ డబ్బులను ఆర్థిక అవసరాలున్న మహిళలకు తక్కువ వడ్డీకే అప్పుగా ఇస్తున్నారు. కనీసం మూడేండ్లు సక్రమంగా పొదుపు చేసిన గ్రూపు సభ్యులకు రూ.50వేల దాకా అప్పులిస్తున్నారు. కుటుంబ అవసరాలతోపాటు ఉన్నత విద్య, వ్యవసాయం, వివాహాల కోసం అనేకమంది సభ్యులు రుణాలు తీసుకుని.. ప్రతినెలా కిస్తీలు చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా అనేక మంది మహిళల అవసరాల కోసం దాదాపు రూ.60 లక్షలకు పైగా అప్పులు ఇచ్చారు. సభ్యులతోపాటు వారి కుటుంబానికి కూడా అండగా ఉండేలా జీవిత బీమా సౌకర్యం కల్పించారు. పొదుపు సంఘంలో చేరిన ఒక్కో సభ్యురాలు రూ.100 ప్రీమియం చెల్లిస్తే, రూ.35వేల బీమాతోపాటు అభయనిధికింద మరో రూ.10వేల సహాయాన్ని అందిస్తున్నారు. 

ప్రారంభం రోజున రూ.2వేల మూలధనంతో మొదలైన ‘స్వకృషి మహిళా పొదుపు సంఘం’, నేడు దాదాపు రూ.6కోట్ల విలువైన ఆస్తులను సంపాదించుకున్నది. రూ.3.66కోట్ల పొదుపుతోపాటు రూ.22లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. సొంతభవనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేసింది. హుస్నాబాద్‌టౌన్‌, అక్కన్నపేట, జనగామ, మీర్జాపూర్‌, గౌరవెళ్లి, పందిల్ల, పోతారం(ఎస్‌), గాంధీనగర్‌ గ్రామాల్లో మహిళా పొదుపు సంఘాలకు సొంత భవనాలు ఉన్నాయి. హుస్నాబాద్‌ పట్టణంతోపాటు హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లి, అక్కన్నపేట మండలం మల్లంపల్లి, చౌటపల్లి, కేశ్వాపూర్‌, మోత్కులపల్లి గ్రామాల్లో సొంత స్థలాలను సమకూర్చుకున్నది. పేదల బాధలు తొలగించాలనే..

గతంలో హుస్నాబాద్‌లో ప్రైవేట్‌ టీచర్‌గా పని చేశాను. ప్రైవేట్‌ ఫైనాన్షియర్ల వల్ల ఇబ్బంది పడుతున్న మహిళల కోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది. అదే నన్ను పొదుపు సంఘం ఏర్పాటు వైపు నడిపించింది. పొదుపు గురించి అవగాహన కల్పించేందుకు మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాం. నా భర్త హన్మిరెడ్డి సహకారం, పిల్లల తోడ్పాటుతో ముందుకు సాగిన. బస్సు సౌకర్యంలేని పొట్లపల్లికి నడిచి వెళ్లి సంఘం ఏర్పాటు చేశాను. పొదుపు చేసేందుకు ఆఫీసుకు వచ్చే మహిళలను చూస్తే మనసులో ఏదో తెలియని సంతోషం.. తృప్తి కలుగుతుంది. గణకురాలు, అధ్యక్షురాలు, సమితి డైరెక్టర్‌గా మూడు విధులు నిర్వహిస్తున్నా. చుట్టుపక్కల మహిళలు ఆప్యాయంగా పలుకరించడం ఆనందంగా ఉంటుంది.                 

 - గురాల అరుణ, స్వకృషి మహిళా పొదుపు సంఘం అధ్యక్షురాలు

ఎవుసానికి పెట్టుబడి..

సంఘంల 18 ఏండ్ల కింద చేరిన. అప్పటి సందే పైసలు పొదుపు జేత్తన్నం. మాకు అప్పులు గూడా ఇత్తండ్రు. రెండేండ్ల కిందట యాభైవేలు అప్పు తీసుకుని ఎవుసానికి పెట్టుబడి వెట్టిన. పంటపైసలు రాంగనే మల్ల కట్టుకున్న. ఎవ్వలకు గావాలన్నా పైసలు ఇత్తండ్రు. మేము కట్టుకుంటు పోతన్నం. 

- తొట్ల రాజవ్వ, పొదుపు సంఘం సభ్యురాలు, హుస్నాబాద్‌ 

దుకాణం కోసం .. 

సంఘం పెట్టినప్పుడే శేరిన. ఎప్పుడు కావాలంటె అప్పుడు పైసలు తీసుకొని, మా దగ్గర ఉన్నప్పుడు కడుతున్నం. మా కొడుకు కండ్లద్దాల దుకాణం పెట్టుకున్నడు. అందుకోసం యాభైవేల దాక అప్పు తీసుకున్న. నెలనెలా కిస్తీ పైసలు కడుతున్న.

- తాటిపెల్లి నిర్మల, పొదుపు సంఘం సభ్యురాలు, హుస్నాబాద్‌ 

-కొత్తపల్లి రామకృష్ణ


logo