ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Zindagi - Jun 06, 2020 , 23:24:53

ట్రోలింగ్‌తో కంగారుపడ్డాను

ట్రోలింగ్‌తో కంగారుపడ్డాను

2012.. ఉపాసన అన్న పేరును తెలుగు జనం వినడం మొదలుపెట్టారు. రామ్‌చరణ్‌ భార్యగా, ప్రతాప్‌రెడ్డి వారసురాలిగా, అపోలో బాధ్యురాలిగా! ఎనిమిదేండ్లు గడిచాయి. ఇప్పుడూ ఉపాసన పేరు వినిపిస్తున్నది. పారిశ్రామికవేత్తగా, స్త్రీవాదిగా,  వెల్‌నెస్‌ కౌన్సెలర్‌గా... తనదైన గుర్తింపు సాధించిన వ్యక్తిగా! ఇదేమీ గాలివాటంగా వచ్చిన మార్పు కాదు.  కాసేపు తనతో మాట్లాడితే చాలు, ఆ పరిణతికి  ఆశ్చర్యపోవాల్సిందే. కొత్త విషయమేదో నేర్చుకోవాల్సిందే.  హైదరాబాద్‌ ‘FICCI FLO’ సంస్థతో ఉపాసన జరిపిన మాటామంతీ అందుకు నిదర్శనం...

మా తల్లిదండ్రులు నన్ను చాలా స్వతంత్రంగా పెంచారు. ఈ లోకంలో ఒంటరిగా నిలదొక్కు కొనేలా ప్రోత్సహించారు. ముఖ్యంగా మా నాన్నగారి ప్రభావం నా మీద చెప్పలేనంతగా ఉంది. ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగలగడం, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడటం, ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవడం, అందరితో దయతో మెలగడం... లాంటి లక్షణాలన్నీ అలవర్చే ప్రయత్నం చేశారు. అలా నాకంటూ కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇక పెండ్లి తర్వాత అంటారా, ఎవరి జీవితంలో అయినా కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అలా నేనూ సర్దుకుపోవడం నేర్చుకున్నాను. 

రామ్‌చరణ్‌ది సెలబ్రెటీ కుటుంబం అనే కాదు... మరో వ్యాపార కుటుంబంలోకి కోడలిగా వెళ్లినా ఏవో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు తప్పదు కదా! కాకపోతే రామ్‌చరణ్‌తో పెండ్లయిన వెంటనే ఒక్కసారిగా మీడియా దృష్టిలో పడటం కాస్త ఇబ్బంది కలిగించిన మాట వాస్తవమే. రకరకాల వార్తలు, ట్రోలింగ్స్‌తో కంగారుపడిపోయాను. నిదానంగా అన్నింటినీ తేలికగా తీసుకోవడం మొదలుపెట్టాను. ఇలాంటివన్నీ సహజమే అనీ, వాటిని పట్టించుకోవద్దనీ సానియా మీర్జా ఇచ్చిన సలహా బాగా పనిచేసింది.


ఫిట్‌నెస్‌

ఆఫీసులో మధ్యాహ్నం రెండుగంటలప్పుడు చూడండి. అది ఆవులించే సమయంలాగా అనిపిస్తుంది. ఆహారం మనకి శక్తిని అందించాలి కానీ, బద్దకస్తులుగా మార్చేయకూడదు. పొద్దున టిఫిన్‌... ఓ మూడు గంటలు గడిచేసరికి మళ్లీ కడుపులో ఆహారం.. మళ్లీ సాయంత్రం స్నాక్స్‌... రాత్రికి భోజనం... ఇలా ఎడతెరిపి లేకుండా లాగించేస్తుంటాం. ఈ పద్ధతిని మార్చేందుకు మా ‘అపోలో లైఫ్‌' సాయపడుతుంది. ఈ డైట్లు, వర్కౌట్లు మేలు చేస్తాయి. కానీ, వాటిని ఎక్కువ రోజులు పాటించలేకపోతున్నామని చాలామంది బాధపడిపోతుంటారు. రోజూ బ్రష్‌ చేసుకోవడం, స్నానం చేయడం, మూడు పూటలా తినడం.... ఇవన్నీ బలవంతంగా చేయడంలేదు కదా. ఆరోగ్యం విషయంలోనూ ఇలాంటి శ్రద్ధే అవసరం. మీ శరీరతత్వం, ఆర్థిక పరిస్థితి, శ్రమ, పరిసరాలు... వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మంచి జీవనశైలిని అలవర్చుకోండి. అలాగని ఫలానా పని చేస్తేనో, ఫలానా తిండి తింటేనో అద్భుతాలు జరిగిపోతాయనే మార్కెటింగ్‌ కుట్రలు నమ్మకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం చేయండి.

సంతోషంగా!

వ్యాపారమైనా, కెరీర్‌ అయినా... నిలకడగా లేకపోతే అసంతృప్తి తప్పదు. దానివల్ల మీ చుట్టూ ఉండేవారు కూడా బాధ పడతారు. జీవితంలో తొలి ప్రాధాన్యం సంతోషం... డబ్బు ఓ 

బై ప్రాడక్ట్‌ మాత్రమే. జీవితం అస్థిరంగా ఉంటే... ఆ సంతోషం మాయమైపోతుంది. కాబట్టి నిలకడగా రాణించండి, సానుకూల దృక్పథంతో జీవించండి. మీలోని అహంకారాన్ని తగులబెట్టేయండి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ మంచి జీవితాన్ని గడిపానన్న తృప్తి కలిగేలా బతకండి.


నా మగధీరుడు

అందరూ సెలబ్రెటీలను ఇష్టపడతారు. అలా ఇష్టపడిన సెలబ్రిటీనే పెండ్లి చేసుకోవడం నా అదృష్టం. తను తెరమీద చూసినదానికంటే ఇంట్లో చాలా భిన్నంగా ఉంటాడు. అదేమిటన్నది సీక్రెట్‌. ఇద్దరమూ ఎదుటివారి వృత్తినీ, వ్యక్తిత్వాన్నీ, స్వేచ్ఛనీ గౌరవిస్తాం. నిజానికి మేమిద్దరం మంచి స్నేహితుల్లా ఉంటాం. ప్రేమలో ఒడిదొడుకులు ఉండవచ్చు... కానీ భార్యాభర్తలు స్నేహితులుగా జీవితం సాగిస్తే ఆ బంధానికి ఢోకా ఉండదు. ఈ లాక్‌డౌన్‌ కారణంగా మేమిద్దరం ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాం. మరి కాస్త సమయాన్ని కలిపి ఆస్వాదించగలుగుతున్నాం.

కొవిడ్‌ పాఠం

కొవిడ్‌తో మన జీవితం మీద అదుపు లేకుండా పోయిందని అంటున్నారు. నిజానికి... కరోనా ముందు కూడా జీవితం మన చేతుల్లో లేదు కదా! రకరకాల వ్యాధుల వల్ల ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాం. అందుకే ఎలాంటి కాలంలో అయినా.. జీవితంలోని ప్రతీక్షణాన్నీ ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. ఈ లాక్‌డౌన్‌ మనకు చాలా పాఠాలు నేర్పింది. ప్రయాణం చేయడం, ఇతరులను కలవడం లాంటి చిన్న విషయాలు కూడా ఎంత విలువైనవో నేర్పింది.  మనం వృథా చేసే ఆహారం వేరొకరి కడుపు నింపగలదనీ గుర్తు చేసింది.


logo