శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 02, 2020 , 22:53:14

రాక్షసులున్నారు...జాగ్రత్త!

రాక్షసులున్నారు...జాగ్రత్త!

పురాణయుగాలే నయం. రాక్షసుడికి పది తలలు ఉంటాయనీ, భయంకరంగా కనిపిస్తాడనీ ప్రతి ఒక్కరికీ తెలిసేది. ఇప్పుడలా కాదు. రాక్షసులు కూడా హుందాగా  ఉంటారు. నీతులు మాట్లాడతారు. పెద్దరికం ప్రదర్శిస్తారు. ఆ అసుర సంతతి మధ్య పిల్లల్ని పెంచాలంటే తల్లిదండ్రులకు వేయి కండ్ల్లు ఉండాలి. జ్యోతిక ప్రధాన పాత్రలో ఈమధ్యే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘పొన్‌మగల్‌ వందాల్‌' (తమిళ) చిత్రం చేస్తున్న పరోక్ష హెచ్చరిక ఇదే.

తవ్వేకొద్దీ శవాలు.పసిపిల్లల పార్థివదేహాలు.తీసేకొద్దీ అస్తిపంజరాలు.లేలేత కళేబరాలు. ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు.‘బడికి వెళ్తున్నానని చెప్పి పైలోకాలకు వెళ్లావా తల్లీ’,‘నా బంగారాన్ని నాకు తెచ్చివ్వండి ప్లీజ్‌' - అమ్మల ఆక్రందనలు.

చూస్తున్నవారిలో, ఎవరో గుండెల్ని మెలితిప్పుతున్న భావన. పిల్లలంటే అందరికీ చిన్నచూపే. నోరెత్తలేని అమాయకులని తల్లిదండ్రులూ, కళ్లెర్రజేస్తే భయపడే పిరికివారని ఉపాధ్యాయులూ, ఓటు హక్కులేని వర్గాలతో తమకేం పని అన్నట్టు రాజకీయ నాయకులూ... బాలల అభిప్రాయాల్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. వాళ్ల సమస్యల్ని సమస్యలుగానే భావించరు. దీంతో, నేరస్తులకూ సైకోలకూ బాలబాలికలు ఆటవస్తువులంత అలుసైపోతున్నారు. ఆ దేహాల్ని తీవ్రంగా హింసించవచ్చు. ఆ లేలేత శరీరాలతో మృగవాంఛలు తీర్చుకోవచ్చు. అయినా, రక్తదాహం తీరకపోతే గొంతునులిమి చంపేయవచ్చు. ఇవేవీ కాదనుకుంటే, ఆ బతుకులతో వ్యాపారం చేసుకోవచ్చు. ఏ యాచకుల ముఠాలకో అమ్ముకోవచ్చు. ఏ అవయవ వ్యాపారులతోనో ఒప్పందం చేసుకోవచ్చు. సమాజంలో జరుగుతున్నది అదే. నిజానికి, బాల్యం ఓ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ ఆవేదనకు ఈ సినిమా అద్దం పట్టింది. ఇలాంటి ఇతివృత్తం ఎంచుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. కలెక్షన్లు రాకపోయినా తట్టుకోగల గుండె నిబ్బరం కావాలి. 

ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎవరెన్ని మాటలు మాట్లాడినా, సినిమా విషయానికి వచ్చేసరికి ప్రేక్షకులుగా ఎవరికి వారు వినోదాన్నే కోరుకుంటారు. మసాలా కుమ్మరించకపోతే పొరపాటున కూడా చూడరు. కానీ, జ్యోతికకు ఆ భయాలేవీ ఉన్నట్టు లేవు. ‘ఏం ఫర్వాలేదు. నేనున్నాన్లే’ అని సూర్య ఇచ్చిన ధైర్యమూ ఓ కారణమై ఉండవచ్చు. నమ్మిన కథ చుట్టూ తిరుగుతూనే నమ్మలేని నిజాల్ని ఆవిష్కరిస్తూ.. వ్యవస్థను ప్రశ్నించే, మనుషుల్ని నిలదీసే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. ప్రతి ప్రేక్షకుడూ ఎక్కడో ఓచోట తప్పక కనెక్ట్‌ అవుతాడు.

 సినిమాకూ కథే ప్రాణం. ఎన్ని హంగులైనా ఆతర్వాతే. ‘పొన్‌మగల్‌ వందాల్‌' సినిమాను కూడా కథే నిలబెట్టింది. ‘చిన్నారులపై లైంగిక దాడులు’  ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నది. పదిహేనేండ్ల నాటి సంఘటనతో కథ మొదలు అవుతుంది.  ఊటీ దగ్గర చిన్న పిల్లల హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతాయి. జనంలో భయం పెరుగుతుంది. పోలీసుల మీద ఒత్తిడి అధికం అవుతుంది. జ్యోతి అనే ఉత్తర భారత మహిళ ఈ హత్యలు చేస్తున్నదనీ ఆమె సైకో కిల్లర్‌ అనీ పోలీసులు ఓ ప్రకటన ఇస్తారు. ‘ఓ పదేండ్ల బాలికని ఎత్తుకెళ్తుంటే మేమే ఎన్‌కౌంటర్‌ చేశాం’ అని పోలీసులు ప్రకటిస్తారు. ఆమె నివాసంలో ఆయుధాలనూ, రక్తపు మరకలు ఉన్న బట్టలనూ స్వాధీనం చేసుకుంటారు. 

పదిహేనేండ్ల్ల తర్వాత..

పేతురాజ్‌ (భాగ్యరాజ్‌) అనే సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తి కేసును తిరగతోడతాడు. వెంబా (జ్యోతిక) అనే యువ న్యాయవాది కోర్టులో వాదిస్తుంది. అదే ఆమెకు మొదటి కేసు. ఆ నిర్ణయాన్ని సమాజం వ్యతిరేకిస్తుంది. ప్రచారం కోసం ఓ పిశాచం తరఫున వకాల్తా తీసుకోవడం దుర్మార్గమని మహిళా సంఘాలు ధర్నాలు చేస్తాయి. వెంబా మాత్రం, జ్యోతి సైకో కిల్లర్‌ కాదని కోర్టు ముందు గట్టిగా వాదిస్తుంది. కానీ, బలమైన సాక్ష్యాలేవీ చూపలేకపోతుంది. చివరికి, తాను జ్యోతి కూతురునేనని కోర్టులో చెబుతుంది. ఏ పరిస్థితుల్లో తన తల్లిమీద సైకో అనే ముద్ర వేశారో వివరిస్తుంది.

వెంబా పాత్రను చాలా బలంగా తీర్చిదిద్దారు దర్శకుడు. ఆ అమ్మాయి ... ప్రకృతిని ప్రేమిస్తుంది. పిల్లల్ని ఇష్టపడుతుంది. అభంశుభం తెలియని బాల్యానికి ‘గుడ్‌ టచ్‌', ‘బ్యాడ్‌ టచ్‌' గురించి హెచ్చరికలు చెబుతూ ఉంటుంది. ఆత్మరక్షణ పద్ధతుల్ని నేర్పుతూ ఉంటుంది. నిజానికి, పిల్లల పెంపకంలో ప్రతి తల్లిదండ్రులూ భాగం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎవరు మనిషో, ఎవరు రాక్షసుడో ఆ పసివాళ్లు గుర్తించలేరు. ఏ స్పర్శలో ప్రేమ ఉంటుందో, ఏ స్పర్శలో దుర్మార్గపు ఆలోచన ఉంటుందో ఆ అమాయకులు తెలుసుకోలేరు. ఏ ముద్దులో మమకారం ఉంటుందో, ఏ ముద్దులో పశుకాంక్ష ఉంటుందో అర్థం చేసుకోలేరు. అమ్మానాన్నలే చెప్పాలి. పిల్లల మాటల్ని చాలా సందర్భాల్లో కన్నవాళ్లే నమ్మరు. ‘తప్పు నాన్నా! అలా మాట్లాడకూడదు’ అనో, ‘అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా?’ అనో దబాయించడం మొదలుపెడతారు. కొన్నిసార్లు నిజాల్ని పూడ్చేయడానికి మహామహా శక్తులన్నీ ఏకం అవుతాయి. ఈ చిత్రంలోనూ అంతే, ఓ పెద్ద మనిషిని కేసులోంచి సురక్షితంగా బయటికి పడేయడానికి వ్యవస్థ వ్యవస్థంతా చేతులు కలిపేస్తుంది. ఒక్కో చిక్కుముడీ విప్పుతూ.. నగ్నసత్యాన్ని న్యాయదేవత ముందు ఉంచుతుంది వెంబా.

వెంబా.. ఆధునిక మహిళకు ప్రతీక. ఆత్మవిశ్వాసానికి రూపమిచ్చినట్టు ఉంటుంది. అవరోధాల్నీ, అవమానాల్నీ తట్టుకుని నమ్మిన విలువల కోసం గట్టిగా నిలబడుతుంది. బాల్యంలోనే లైంగిక దాడులకు బలైన అనుభవాలు ఆతర్వాత కూడా తనని పీడకలలా వెంటాడుతుంటాయి. నిండు వెలుతురులో ఉన్నా, చిమ్మచీకటిలో మగ్గిపోతున్న భావన. ఆత్మీయులు పలకరిస్తున్నా పిశాచాలు వెక్కివెక్కి నవ్వుతున్న భ్రమ. పీడ కలలు. అంతులేని భయాలు. సమూహంలోనూ ఒంటరితనమే. 

తల్లి సింగిల్‌ మదర్‌. టీ ఎస్టేట్‌లో పనిచేస్తూ కూతుర్ని పెంచుతుంది. ఆ సమయంలోనే పట్టుమని పదేళ్లు కూడా లేని వెంబా మీద ఓ మృగాడి కండ్లు పడ్డాయి. ఎత్తుకెళ్తాడు. పాశవికంగా అనుభవిస్తాడు. ఆ సమయంలోనే ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకుంటుంది తల్లి. అందులో ఆ రాక్షసుడి తండ్రి పలుకుబడి కలిగిన వ్యక్తి. దీంతో, ఆమె మీద సైకో అన్న ముద్రవేసి ఎన్‌కౌంటర్‌ చేయిస్తారు. వెంబా లా చదువుకుని, తన తల్లిమీద పడిన మచ్చని తొలగిస్తుంది. సత్యాన్ని గెలిపిస్తుంది. 

నిజమే, వ్యవస్థలో చెడు ఉంది. కానీ అక్కడక్కడా మంచి కూడా ఉంది. మానవత్వం బతికే ఉంది. అందుకు సర్వైవల్‌ సర్టిఫికెట్‌ లాంటి పాత్ర పేతురాజ్‌. భాగ్యరాజ్‌ ఆ క్యారెక్టర్‌కు సంపూర్ణ న్యాయం చేశారు. ‘ఉత్తరాది నుంచి వచ్చినా, దక్షిణాది పరిశ్రమలో అంకిత భావంతో పనిచేస్తున్న నటి జ్యోతిక. ఆమెకు అభినందనలు’ అని రాధిక శరత్‌కుమార్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.


హీరోలా ఫీలవుతున్నా..

‘సినిమా రిలీజ్‌ అనంతరం నేను ఓ హీరోలా ఫీలవుతున్నా..’ అని జ్యోతిక మురిసిపోయింది. కాకపోతే, సినిమాలో నాటకీయత తగ్గిందన్న విమర్శలు ఉన్నాయి. జీవితం నాటకమేం  కాదు. జీవితాన్ని ప్రతిబింబించే చిత్రాల్లో నాటకీయత ఉండాల్సిన అవసరమూ లేదు. మొత్తానికి, సినిమా  ైక్లెమాక్స్‌లో సమాజమంతా వెంబా వెనుక నిలబడటం... ఓ పాజిటివ్‌ సంకేతం!‘ఎప్పుడూ దేనికీ భయపడకూడదు’ అన్న తల్లి చివరి మాటలే వెంబాను ముందుకు నడిపిస్తాయి. ప్రతి తల్లీ బిడ్డకు చెప్పాల్సిన మాట ఇది. ఆ మాటే ఆయుధమంత బలాన్ని ఇస్తుంది. పశువుల్ని గెలిచేంత శక్తినిస్తుంది. 


logo