ఆదివారం 12 జూలై 2020
Zindagi - Jun 02, 2020 , 00:26:18

పేరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా!

పేరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా!

‘తెలంగాణొస్తే ఏమొస్తదో’.. ఈ ఆరేండ్లలో చూసినం.  గోదావరి, కృష్ణమ్మలతో తడిసి తానమాడుతున్నది. సుఖశాంతులతో సుభిక్షమై కళకళలాడుతున్నది.  స్వరాష్ట్రం కోసం స్వప్నించి.. తపించి.. తండ్లాడి.. త్యాగాలు చేసిన మహనీయుల నామాలతో,  అస్తిత్వ ఆకాంక్షకు అద్దంపట్టిన పేర్లతో వేనోళ్ల కీర్తింపబడుతున్నది. ఆ త్యాగధనుల నామస్మరణ.. మన మూలాల మననం.. ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ’ సందర్భంగా..  

జయశంకర్‌ యూనివర్సిటీ

ఉమ్మడి రాష్ట్రంలో రాజేంద్ర నగర్‌ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత దీనికి ప్రముఖ రైతు నాయకుడు ఆచార్య ఎన్జీ రంగా పేరు పెట్టారు. ఈ సాగుబడి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. తెలంగాణ సోయికి.. చైతన్యానికి స్ఫూర్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన జయశంకర్‌ సార్‌, వరంగల్‌ జిల్లా అక్కంపేటలో జన్మించారు. 1969 తెలంగాణ పోరాటంలో; నాన్‌ముల్కీ, ఇడ్లీ-సాంబార్‌ గోబ్యాక్‌ ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు.  టీఆర్‌ఎస్‌ ఏర్పాటులో కేసీఆర్‌కు మార్గదర్శిగా నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతపై జాతిని జాగృతం చేశారు. ఆ మహనీయుడి పేరును వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఏకశిల పార్కుకూ పెట్టారు.  

కాళోజీ యూనివర్సిటీ 

ఉమ్మడి రాష్ట్రంలో వైద్య కళాశాలలన్నీ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలో నడిచేవి. రాష్ట్రం వచ్చాక మనకంటూ ఓ ప్రత్యేక హెల్త్‌ యూనివర్సిటీ ఉండాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు, వరంగల్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, దానికి ‘కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం’ అని నామకరణం చేసింది. కాళన్న తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని. రాజకీయ.. సామాజిక చైతన్యాల సమాహారం. బతుకంతా తెలంగాణకే అంకితం చేసిన త్యాగధనుడు. గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలనే తపనతో సారస్వత పరిషత్తును స్థాపించారు. కాళన్న యాదిగా హన్మకొండలోని కళాక్షేత్రానికి కూడా ఆయన పేరు పెట్టారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని నమ్మిన తెలంగాణ బిడ్డ కాళోజీ.

పీవీ నరసింహారావు యూనివర్సిటీ

1946లో హైదరాబాద్‌ వెటర్నరీ కాలేజీ ఏర్పాటైంది. తర్వాత దీన్ని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీగా మార్చి, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధం చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ‘పీవీ నరసింహారావు స్టేట్‌ యూనివర్సిటీ ఫర్‌ వెటర్నరీ, యానిమల్‌ అండ్‌ ఫిషరీ సైన్సెస్‌'గా మార్చారు. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా.. ప్రధానమంత్రిగా తెలంగాణ ఖ్యాతిని దశ దిశలా చాటారు. భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఒకే ఒక్క తెలుగువాడు. బహుభాషావేత్త. ఆర్థిక సంస్కరణలకు ఆదిపురుషుడు.  వరంగల్‌జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించిన పీవీ, కరీంనగర్‌ జిల్లాలోని వంగరలో పెరిగారు. జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. 1957లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ మేరునగధీరుడి పేరు చిరస్థాయిగా నిలవాలనే ఉద్దేశంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే ఫ్లైఓవర్‌కి  పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేగా నామకరణం చేశారు.

విద్యాసాగర్‌ రావు ఇరిగేషన్‌ స్కీమ్‌ 

తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాణంపోస్తున్నది ప్రభుత్వం. అందులో ఒకటి దిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌. నల్లగొండ.. మహబూబ్‌నగర్‌.. ఖమ్మం జిల్లాలకు దీని ద్వారా నీరు అందుతుంది.  ‘నీళ్లసారు’గా పేరుపొందిన ఆర్‌ విద్యాసాగర్‌రావు పేరును దిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు ఖరారుచేసింది తెలంగాణ ప్రభుత్వం. విద్యాసాగర్‌రావు నీటిపారుదల నిపుణులు. నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందినవారు. ఆ ఊరికి తనే తొలి ఇంజినీర్‌. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌, కేసీఆర్‌లతో కలిసి పనిచేశారు. తెలంగాణ ప్రజలకు వ్యవసాయం.. నీటి వనరులపై అవగాహన కల్పించారు. నీళ్ల దోపిడీ వల్ల  తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సదస్సులు.. వ్యాసాలు.. ప్రజెంటేషన్ల ద్వారా వినిపించి జనాన్ని జాగృతం చేశారు. ‘నీళ్లు-నిజాలు’ సంపుటాలతో విద్యావంతులను మేల్కొలిపారు. ఉద్యమంలో భాగస్వాములు అయ్యేలా చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా వ్యవహరించారు. 

సమ్మక్క బ్యారేజీ 

గోదావరిపై నిర్మితమైన తుపాకులగూడెం బ్యారేజీకి ఆదివాసీ వీరవనిత సమ్మక్క పేరును పెట్టింది ప్రభుత్వం. ముక్కోటి దేవతల కరుణాకటాక్షాలతో తెలంగాణ బీళ్లలోకి కాళేశ్వరం సాగునీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో.. సమ్మక్క లాంటి దేవతామూర్తుల పేర్లు బ్యారేజీలకు పెట్టుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. వెయ్యేళ్ల నాటి ముచ్చట ఇది. సమ్మక్క వన దేవత. కాకతీయుల సామంతరాజు అయిన పగిడిద్దరాజు సమ్మక్క భర్త. ప్రజలు పన్నులు చెల్లించే స్థితిలో లేకపోవడంతో, సామంతులు కాకతీయులకు కప్పం కట్టలేదు. దీంతో పాలకులు యుద్ధం ప్రకటించారు. పరాశక్తిలా  సమ్మక్క శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడింది. దీంతో, కాకతీయులు సమ్మక్కను వెన్నుపోటు పొడిచారు. యుద్ధభూమి నుంచి వైదొలగి చిలుకల గుట్టలోకి వెళ్లి అదృశ్యమైంది. ఆమె వీరత్వానికి.. త్యాగానికి ప్రతీకగా రెండేండ్లకు ఓసారి సమ్మక్క జాతరను నిర్వహిస్తుంది ప్రభుత్వం. 

కాళేశ్వర.. ముక్తేశ్వరం 

కాళేశ్వరం పరిధిలోని వివిధ బ్యారేజ్‌లకు.. పంప్‌హౌజ్‌లకు సీఎం కేసీఆర్‌ దేవతల పేర్లు పెట్టారు. ప్రధానంగా, కాళేశ్వర - ముక్తేశ్వరుల  పేరు మీద.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను వ్యవహరించాలని నిర్ణయించారు. కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు లక్ష్మీ పంప్‌హౌజ్‌  అనీ.. అన్నారం బ్యారేజ్‌కు సరస్వతి బ్యారేజ్‌ అనీ.. సిరిపురం పంప్‌హౌజ్‌కు సరస్వతి పంప్‌హౌజ్‌ అనీ.. సుందిళ్ల బ్యారేజ్‌కు పార్వతీ బ్యారేజ్‌ అనీ.. లక్ష్మీపురం పంప్‌హౌజ్‌కు గాయత్రి పంప్‌హౌజ్‌ అనీ.. నామకరణం చేశారు. సీతారామ ప్రాజెక్ట్‌.. భక్త రామదాసు ప్రాజెక్ట్‌ల పేర్లు కూడా  రామ చంద్రుడితో, రామభక్తుడితో ముడిపడినవే.  

ఆరు జిల్లాల వైభవం 

సంస్థలు.. ప్రాజెక్టులు.. రహదారులు. ఫ్లైఓవర్లకు మహనీయుల స్మృతి చిహ్నంగా నామకరణం చేసినట్టుగానే, కొత్త జిల్లాలకూ మన అస్తిత్వం.. మన ఉనికి.. మన మూలాలు గుర్తుకొచ్చేలా స్ఫూర్తిమంతులు.. ఆరాధ్యుల పేర్లు పెట్టారు.  

కుమ్రం భీం ఆసిఫాబాద్‌

మునుపటి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడింది. ఈ జిల్లాకు కుమ్రం భీమ్‌ పేరు పెట్టారు. కుమ్రం భీం నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిపుత్రుడు. ఆదిలాబాద్‌ అడవుల్లో.. గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించాడు. అడవే ఆత్మగా జీవించాడు. ఆదివాసీల కోసం తపించాడు. నిజాం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధం పట్టాడు. పశువుల కాపర్లపై సుంకానికి నిరసనగా ఉద్యమించాడు. పోరాటంలో వీరమరణం పొందాడు. ఈ మహనీయుని పేరు చరిత్రలో నిలిచిపోవాలని ఆసిఫాబాద్‌ కుమ్రం భీం జిల్లాగా నామకరణం చేశారు. 


జయశంకర్‌ భూపాలపల్లి 

వరంగల్‌ జిల్లా నుంచి భూపాలపల్లి జిల్లా ఏర్పడింది. ఈ కొత్త జిల్లాకు  ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరును జోడించింది. ప్రొఫెసర్‌ సార్‌ను తెలంగాణ పితామహుడు అంటారు. ఆయన 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1952లో నాన్‌ ముల్కీ ఉద్యమంలో కూడా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా 1954లో ఫజల్‌ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. 

ఆ మహనీయుడి స్మృతిచిహ్నంగా భూపాలపల్లి జిల్లాకు జయశంకర్‌ సార్‌ పేరును జోడించారు. 

భద్రాద్రి కొత్తగూడెం 

ఖమ్మం జిల్లాను విభజించి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశారు. దానికి భద్రాద్రి పేరును కలిపారు. భద్రాచలంగా వ్యవహరించే భద్రాద్రి... పవిత్ర యాత్రాస్థలి. గోదావరి ఒడ్డున ఉన్నది. రామాయణ  మహాకావ్యంతో ముడిపడిన భద్రాచలాన్ని భద్రగిరి అనీ పిలుస్తారు. ఈ దక్షిణ అయోధ్య పేరు నలుదిక్కులా మార్మోగాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం చేశారు. 

యాదాద్రి భువనగిరి 

నల్లగొండ జిల్లాను విభజించి భువనగిరి జిల్లా ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాగా రికార్డులకెక్కించారు. తెలంగాణలో ప్రధాన పుణ్యక్షేత్రం.. యాదాద్రి. సీఎం కేసీఆర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఈ టెంపుల్‌ సిటీ. ఆధ్యాత్మిక.. పౌరాణిక.. చారిత్రక నేపథ్యం ఉన్న క్షేత్రం ఇది. 

రాజన్న సిరిసిల్ల 

కరీంనగర్‌ జిల్లా నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడింది. ఉత్తర తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఇది ఒకటి. సిరిసిల్ల జిల్లాలో సుప్రసిద్ధ రాజరాజేశ్వర క్షేత్రం ఉన్నది. ఇదే వేములవాడ. వేములవాడ పురాతన గ్రామం. పశ్చిమ చాళుక్యుల కాలం నుంచీ ఉన్నదని అంటారు. పుణ్యక్షేత్రంగానూ.. వ్యాపార కేంద్రంగానూ వేములవాడ 11వ శతాబ్ది నాటికే పేరుపొందింది. ఇక్కడి రాజరాజేశ్వర స్వామిని.. భక్తులు రాజన్నగా పిలుస్తుంటారు. ఇంతటి విశిష్టత ఉన్న పేరును, చేనేత సిరికి నియమైన సిరిసిల్లతో చేర్చి జిల్లాను చేశారు. 

జోగులాంబ గద్వాల 

మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి గద్వాల జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లాకు తుంగభద్ర.. కృష్ణా సరిహద్దులు. చేనేతకు ప్రసిద్ధిగాంచిన గద్వాల జిల్లాలో కాకతీయ సామంతుల రాజధానిగా విలసిల్లిన వల్లూరు ఉంది. జోగులాంబ క్షేత్రాన్ని జోడిస్తూ.. గద్వాల జోగులాంబ జిల్లాగా ఏర్పాటు చేశారు. దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి జోగులాంబ. 

అంతేనా, కేంద్రంతో కొట్లాడి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ పేరును తెలంగాణ ఎక్స్‌పెస్‌గా మార్పించారు కేసీఆర్‌. రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్‌కు పైడి జయరాజ్‌ పేరు పెట్టారు. బాలీవుడ్‌ నటుడు జయరాజ్‌ తెలంగాణ బిడ్డ. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత. అధికారిక వ్యవహారంలోనూ తెలంగాణ పదజాలానికే పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో.. ఖరీఫ్‌.. రబీ అన్న మాటల్ని మూటకట్టి మూలన పారేసి, వానాకాలం.. యాసంగి పంటలు అని పిలుచుకుంటున్నాం. ఆంధ్రసారస్వత పరిషత్తును తెలంగాణ సారస్వత పరిషత్తు అని సగర్వంగా వ్యవహరిస్తున్నాం. కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు మీద ఉద్యాన విశ్వవిద్యాలయాన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి పేరు వెనుకా ఓ స్ఫూర్తి.పలికిన ప్రతిసారీ.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక అధ్యాయాన్ని నెమరేసుకున్నట్టే.

ఓ మహానుభావుడిని తలుచుకున్నట్టే. 

తెలంగాణ తల్లిని కొలుచుకున్నట్టే. జై.. తెలంగాణ!


logo