మంగళవారం 07 జూలై 2020
Zindagi - Jun 01, 2020 , 23:56:39

పిచ్చుక- స్నేహం

పిచ్చుక- స్నేహం

ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. అది ఏ కల్మషమూ లేనిది. దానికి ఒక రోజు ఓ కాకుల గుంపు పరిచయం అయ్యింది. వాటితో స్నేహం ఏర్పడింది. ‘కాకులతో స్నేహం చేయొద్దు’ అని ఆ పిచ్చుకకు  అందరూ చెప్పారు. కాని ఆ  పిచ్చుక ఎవరి మాటలూ వినలేదు. ఒక రోజు కాకులు ఏదో పొలానికి వెళ్తూ పిచ్చుకను కూడా రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికీ, ఎందుకూ అని అడగకుండా, ఆ కాకులతో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్లి, అక్కడి పంటను ధ్వంసం చేయసాగాయి. పిచ్చుకకు ఏం చేయాలో తెలియక అటూ ఇటూ గెంతసాగింది. ఇంతలో పొలం యజమాని పరిగెత్తుకుంటూ వచ్చాడు. పెద్ద కర్రతో కాకులను కొట్టడం మొదలెట్టాడు. కాకుల గుంపునకు  ఇది అలవాటే కాబట్టి, అవి తుర్రున ఎగిరిపోయాయి. కానీ పిచ్చుక మాత్రం రైతుకు దొరికిపోయింది. ‘నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, వదిలేయండి!’ అని ప్రాధేయపడింది. కానీ పంట సర్వనాశనం అవడంతో,  రైతు కోపంతో ఉన్నాడు. పిచ్చుక  మాటలను నమ్మలేదు. దబాదబా రెండు దెబ్బలు వేశాడు.   

నీతి : చెడ్డవారితో స్నేహం నష్టం. 


logo