గురువారం 02 జూలై 2020
Zindagi - May 30, 2020 , 22:26:21

కిక్‌ ఇచ్చే పాత్ర కోసం..

కిక్‌ ఇచ్చే పాత్ర కోసం..

కరోనా భయపెడుతున్న వేళ ఆ పేరుతోనే సినిమా తీసి షాకిచ్చాడు వర్మ. జనాలకు ఇలాంటి షాక్‌లు  కొత్తేమీ కాకపోయినా.. అందులోని నటుడిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. హ్యాపీడేస్‌లో అమాయకుడిగా.. వంగవీటిలో ఆవేశపరుడిగా.. మహానటిలో అతిథి పాత్రలో కనిపించినా.. గద్దలకొండ గణేష్‌లో దిశానిర్దేశం చేసేవాడిగా గుర్తుండిపోయిన వంశీ చాగంటి.. ‘కరోనా వైరస్‌' సినిమాలో ప్రధాన పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నాడు. రిలీజ్‌కి సిద్ధమైన ఈ సినిమా గురించి.. అసలు హ్యాపీడేస్‌ నుంచి ఇప్పటివరకు తన ప్రయాణం గురించి.. వంశీతో ఇంటర్వ్యూ

కరోనా మీద సినిమా అనగానే మీకేమనిపించింది?

వర్మ గారి దగ్గర నుంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్టులు రావడం కొత్తేమీ కాదు. నా వరకు నాకు పని కావాలి. ఫలానా సినిమా అని చెప్పగానే, నేనెందుకు చేయకూడదు? అనుకున్నా. సినిమా మీద విపరీతమైన ప్రేమ ఉంటే తప్ప, బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టం. నటన అంటే నాకంత పిచ్చి ఉంది. అందుకే ఈ సినిమా చేశాను. 

కరోనా గురించి తెలిసినప్పుడు ఎలా ఫీలయ్యారు?

ఎబోలా లాంటి ఎన్నో వైరస్‌లు వచ్చాయి.. వాటిలాగే ఇది కూడా ఒక దగ్గర వచ్చి అలా ఆగిపోతాందని అనుకున్నా. కానీ ఇంతలా చుట్టుముట్టేస్తుందని ఊహించలేదు. మార్చిలో ఒక పని మీద జర్మనీ వెళ్లాల్సి వచ్చింది. వెళుతున్నప్పుడే ఎందుకు అన్నారు కానీ, నేను పని చూసుకొని వెంటనే వచ్చేద్దామనుకున్నా. ఇక ఇంటర్నేషనల్‌ బోర్డర్‌లు క్లోజ్‌ అన్నప్పుడు నా ట్రిప్‌ క్యాన్సిల్‌ చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యా. తర్వాత రోజు ఇంటికి వచ్చి సెల్ఫ్‌ క్వారంటైన్‌ ఉన్నా.  

లాక్‌డౌన్‌ మీకు నేర్పించిన పాఠం ఏంటి?

(నవ్వుతూ..) పది సంవత్సరాల్లో నేను చేసిన సినిమాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అవకాశాలు వచ్చినా... నాకు తగినట్టు లేకపోవడం లాంటి కారణాల వల్ల పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. అలాగని నాకు ఖాళీగా ఉండటం కొత్తేమీ కాదు. ఇన్ని సంవత్సరాలు.. పుస్తకాలు చదివా, కంటెంట్‌ చూశా, బాడీ వర్కవుట్స్‌ చేశా. ఇప్పుడూ అదే చేశా. గతేడాది నుంచే సినిమాల స్పీడ్‌ పెంచాను. అలాంటి సమయంలోనే లాక్‌డౌన్‌ రావడం కొంచెం ఇబ్బంది పెట్టింది. రాబోయేది మంచి రోజు అని నమ్ముతాను. అలా అనుకుంటూనే ఇన్ని రోజులు గడిపేశా. 

వర్మ దర్శకత్వంలో చేయడం ఎలా ఉంది?

ఆయన సినిమాటిక్‌ జీనియస్‌. షాట్‌ చెబుతున్నప్పుడే ఆయన బుర్రలో సినిమా నడుస్తుంది. సౌండ్‌ మీద ఉన్న గ్రిప్‌ చూస్తే మతిపోతుంది. అలా అని ఆయన ట్వీట్స్‌ను వెనుకేసుకురాను.. కానీ ఆయన సినిమా విషయంలో ఎంత పిచ్చిగా ఉంటారో నాకు బాగా అర్థమైంది. 

ప్రపంచం అంతా లాక్‌డౌన్‌లో ఉంటే, కరోనా వైరస్‌ చిత్రీకరణ ఎలా జరిగింది? దానికి సంబంధించిన జాగ్రత్తల గురించి?

ఇది టెక్నికల్‌ పాయింట్‌. సరిగా చూస్తే ఎలా తీశామో కొంతవరకు అర్థమయి ఉంటుంది. ఇంతకు మించి నేను ఏమీ మాట్లాడలేను. జాగ్రత్తలు తీసుకోకుండా మాత్రం ఈ సినిమా తీయలేదు. ఎందుకంటే ఎవరికైనా పని కంటే కూడా ప్రాణాలు ముఖ్యం. మొత్తానికి సినిమా పూర్తయింది. 20 రోజుల్లో ఓటీటీలోనే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. 

హ్యాపీడేస్‌(శంకర్‌) తర్వాత చాలా కాలం గ్యాప్‌ ఎందుకొచ్చింది?

సినిమా సక్సెస్‌ని బట్టి ఆర్టిస్ట్‌ గుర్తుంటాడు. ఒక్క సినిమాలో ఇచ్చిన లుక్‌ మరొక దాంట్లో ఉండదు. మధ్యలో కొన్ని సినిమాలు చేశా. పెద్దగా గుర్తింపు రాలేదు. మహానటిలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చా. ఆ తర్వాత గద్దలకొండ గణేష్‌తో మళ్లీ నాకు గుర్తింపు వచ్చింది. కానీ నటుడిగా శంకర్‌ని ఎలా గుర్తుపెట్టుకున్నానో, వంగవీటిలో పాత్రనూ అంతలా గుర్తు పెట్టుకోవాలి. నేను నటుడిగా సంతృప్తి చెందిన క్యారెక్టరే, నాకు నేను ఇచ్చుకునే గొప్ప కాంప్లిమెంట్‌. మరో రెండు సినిమాలు కూడా రాబోతున్నాయి. అందులో నన్ను మళ్లీ గుర్తుపెట్టుకుంటారు. 

ఎమ్‌ఎన్‌సీలో ఉద్యోగం చేసినట్లున్నారు. సినిమాల్లోకి ఎలా?

కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేశాను. సినిమా మీద విపరీతమైన కోరిక ఉండేది కానీ, ఎటు వెళ్లాలో తెలియదు. అప్పుడు మాటీవీలో ఆంధ్రా ఐడల్‌ అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్నా. అందులో నేను యాక్టింగ్‌లో టైటిల్‌ గెలుచుకున్నా. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్‌ ఇచ్చింది. నటుడిగా నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్నా. ప్రయత్నాల కోసం ఉద్యోగం వదులుకొని హ్యాపీడేస్‌ ఆడిషన్‌లో పాల్గొన్నా. సెలెక్ట్‌ కావడంతో ఈ రంగంలో స్థిరపడ్డాను. అప్పటినుంచి ఇలా  కొనసాగుతున్నా. 

చిన్నచిన్న క్యారెక్టర్‌లు కాకుండా హీరోగా ఎప్పుడు కనిపిస్తారు?

హీరోగా అవకాశం గురించి పెద్దగా ఆలోచించను. మంచి క్యారెక్టర్‌ ఏది వచ్చినా చేస్తా. కిక్‌ ఇచ్చే ఫ్యాక్టర్‌ ఉంటేనే సినిమా ఒప్పుకొంటా. కాకపోతే మరో రెండు సినిమాల తర్వాత హీరోగా కనిపిస్తానులే అనుకుంటా. నన్ను హీరోగానే కాదు.. విలన్‌గా, రకరకాల పాత్రలలో చూస్తారు. ప్రొడ్యూసర్‌గా పేరెంట్స్‌ అనే సినిమా కూడా తీశా. కానీ కొన్ని కారణాల వల్ల అది విడుదలకు నోచుకోలేదు. త్వరలో ఆ సినిమా కూడా రిలీజ్‌ చేస్తా. 


logo