ఆదివారం 12 జూలై 2020
Zindagi - May 29, 2020 , 23:00:37

ఆశ

ఆశ

ఒక ఊరిలో ఓ అమ్మాయి ఉండేది. రోజూ ఆవు పాలు పితికి  వాటిని అమ్మడానికి వెళ్ళేది. ఒక రోజు ఆవు ఎక్కువ పాలు ఇచ్చింది. అది చూసి ఆమె చాలా సంతోషించింది. రోజూ తీసుకువెళ్ళే బిందె కన్నా పెద్ద బిందెలో పోసుకొని అమ్మడానికి బయల్దేరింది. ఉత్సాహంగా నడుస్తూ ఎన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది. ‘ఈ రోజు ఇచ్చినట్టు ఆవు రోజూ ఎక్కువ పాలు ఇస్తే, నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అలా వచ్చిన డబ్బును ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను. ఆ డబ్బుతో ఇంకో ఆవుని కొంటాను. ఆ ఆవు పాలతో మరో అవుని కొంటాను. అప్పుడు నా దగ్గర బోలెడన్ని ఆవులు అవుతాయి.  వాటిని చూసుకోవటానికి పాలేర్లను పెట్టుకుంటాను.  ఇక రోజూ ఇలా ఎండలో వెళ్ళే అవసరం ఉండదు. అప్పుడు నేను తెల్లగా అవుతాను. వెంటనే ఒక  పట్టు చీర కొనుక్కుంటాను.  చీరకు తగ్గట్టు గాజులు, గొలుసు చేయించుకుంటాను.  నా చెవుల్లో జూకాలు అందంగా ఊగుతూ ఉంటాయి...’ అనుకూంటూ  తల అడ్డంగా ఊపింది.  రోజూ మోసేదానికన్నా ఎక్కువ బరువు నెత్తి మీద ఉందన్న విషయం మరచిపోయింది. బిందె జారి పడిపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి. ఆ పాలూ అమ్మలేదు, ఎక్కువ డబ్బులూ సంపాదించలేదు. ఆవులూ కొనలేదు.

నీతి : పగటి కలలు కనే బదులు, ఉన్న పనిని  శ్రద్ధగా చేయాలి. అదే మంచి ఫలితాలను ఇస్తుంది.  


logo