శనివారం 06 జూన్ 2020
Zindagi - May 23, 2020 , 23:32:40

పారితోషికాలు..తగ్గించుకోవాలి బాబూ!

పారితోషికాలు..తగ్గించుకోవాలి బాబూ!

వేలకొద్దీ శత్రుసైన్యాన్ని ఒంటిచేత్తో మట్టి కరిపించే హీరోలూ, వందమంది వీధిరౌడీల్ని కంటిచూపుతో కట్టడి చేసే మాస్‌ మసాలా స్టార్లూ ... విలన్లకే విలన్‌ అయిన కరోనా దెబ్బకు పారితోషికాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హీరోలు మెట్టు దిగడానికి సిద్ధపడకపోతే, బెట్టు చేయడం ఆపకపోతే పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుపోవడం ఖాయమని పరిశ్రమ పెద్దలు హెచ్చరిస్తున్నారు.  

తెలుగు సినీ పరిశ్రమలో అతనొక బాక్సాఫీస్‌ బొనాంజా. ఆయనతో సినిమా అనగానే, ఓపెనింగ్‌ కొబ్బరికాయ కొట్టిన రోజే బిజినెస్‌ క్లోజవుతుంది. ప్రారంభ వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమా విజయవంతం అయితే, తొలి పది రోజుల్లోనే పెట్టుబడి అంతా వచ్చేస్తుంది. తర్వాత అంతా లాభాల పంటే! కాబట్టే, ఆ హీరోతో ఛాన్స్‌ కోసం నిర్మాతలంతా ఎదురుచూస్తుంటారు. అందుకే, అడిగినంత పారితోషికం చెల్లించుకుంటారు. అయితే, ఇదంతా కరోనాకు ముందు. ‘ఆఫ్టర్‌ కరోనా’ అన్ని రంగాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. సినీ హీరోల పారితోషికం విషయంలో కూడా, కరోనా ఓ మొట్టికాయ వేసిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక, హీరోలు తమ రెమ్యూనరేషన్‌ విషయంలో కాస్త పట్టు వీడాల్సిందే అంటున్నారు. అగ్రదర్శకులు, నాయికల  పారితోషికాల్లో కూడా కరోనా కోత వుంటుందని  బలంగా చెబుతున్నారు. 

ఎన్నో సందేహాలు

 నిత్యం  చిత్రీకరణలు, ప్రచారాలు, ఫంక్షన్లతో సందడిగా ఉండే పరిశ్రమ కరోనా కారణంగా కళ తప్పింది. దాదాపు రెండు నెలలుగా కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. పరిశ్రమ వందల కోట్లలో నష్టాల్ని ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలో, చిత్రసీమ భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 60 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత, త్వరలోనే చిత్రీకరణలు మొదలవుతాయని సంకేతం వచ్చినా.. కరోనా ప్రభావంతో మునుపటి మాదిరిగా ప్రేక్షకులు థియేటర్ల్లకు వస్తారా? వచ్చినా పక్కపక్కన కూర్చుంటారా? అంతమందికి మాస్కులూ శానిటైజర్లూ సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుందా?..  ఇలా ఎన్నో ప్రశ్నలు సినీ వర్గాల్ని వెంటాడుతున్నాయి. కరోనా టైమ్‌లో ఓవర్‌ ద టాప్‌ ప్లాట్‌ఫామ్స్‌ (ఓటీటీ)లకు ఆదరణ పెరగడంతో చిన్న స్క్రీన్‌కు అలవాటు పడిన ప్రేక్షకుడిని మళ్లీ థియేటర్ల బాట పట్టించడం హీరోలకు, దర్శకనిర్మాతలకు సవాలుగా మారింది. 

హీరోలదే పెద్ద వాటా

అగ్ర నటుల సినిమా అంటే పారితోషికాల రూపంలో నిర్మాతలు యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సివస్తుంది. హీరోలకు ఉన్న మార్కెట్‌ను, ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కోట్లలో పారితోషికాన్ని చెల్లించడానికి సిద్ధపడుతున్నారు. తెలుగు చిత్రసీమలో ప్రభాస్‌, చిరంజీవి, మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లాంటి స్టార్‌డమ్‌ వున్న కథానాయకులు ఒక్కో సినిమాకు ముప్పై కోట్లకుపైగా తీసుకుంటున్నారు. యువ హీరోలు విజయ్‌ దేవరకొండ, నాని, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, శర్వానంద్‌, రామ్‌లు కూడా పది కోట్లకుపైనే పొందుతున్నారు. నాగార్జున, వెంకటేష్‌, బాలకృష్ణ లాంటి సీనియర్‌ హీరోలు పదిహేను కోట్ల వరకు అందుకుంటున్నారు. ‘బాహుబలి’ చిత్రంతో పాన్‌ ఇండియా మార్కెట్‌ను సృష్టించుకున్న యువ కథానాయకుడు ప్రభాస్‌తోపాటు చిరంజీవి లాంటి సీనియర్‌  హీరోలు పారితోషికం కాకుండా సినిమా హక్కుల్లో వాటాలు తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణలు నిలిచిపోవడం, విడుదలలు వాయిదా పడటంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్రసీమలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాలా సమయమే పడుతుంది. సినిమాలు విడుదల చేసినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకం లేదు. ఈ నష్టాల్ని నివారించడానికి ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ‘లగ్జరీస్‌ తగ్గించుకుంటే పారితోషికాలు తగ్గుతాయి. తద్వారా సినిమా బడ్జెట్‌ తగ్గుతుంది’ అని వెబినార్‌ ముఖాముఖిలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. సీనియర్‌ నిర్మాత సురేష్‌బాబు సైతం ‘నటీనటులు సినిమా బడ్జెట్‌, ఖర్చు గురించి ఆలోచించాలి. అప్పుడు నిర్మాణ వ్యయాలు తగ్గుతాయి. ఇండస్ట్రీ నిలదొక్కుకోవాలంటే హీరోలు పారితోషికం తగ్గించుకోక తప్పదు’ అని చెబుతున్నారు.  


తమిళుల ముందడుగు

తెలుగులోనే కాదు తమిళ, మలయాళ భాషల్లోనూ పారితోషికాల్ని తగ్గించుకోవాలనే వాదన బలంగా వినిపిస్తున్నది. సినీ పెద్దల అభిప్రాయాల్ని అర్థం చేసుకున్న కొందరు హీరోలు వారి నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చారు. తమిళంలో హీరో విజయ్‌ ఆంటోనీ ఇరవై అయిదు శాతం పారితోషికాన్ని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. తాను నటించనున్న మూడు చిత్రాలకు ఈ నిర్ణయాన్ని అమలు పరచనున్నట్లు తెలిపారు. విజయ్‌ ఆంటోనీ దారిలోనే సీనియర్‌ దర్శకుడు హరి, యువ హీరో హరీష్‌కల్యాణ్‌, పలువురు నటీనటులు అడుగులు వేశారు. రెమ్యునరేషన్‌ తగ్గించి తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. వీరి బాటలతోనే మరికొందరు తమిళ నటులు, దర్శకులు అడుగులు వేయబోతున్నారు. అలాగే, మలయాళ చిత్రసీమలో కరోనా నష్టాల్ని నివారించేందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ పారితోషికాన్ని యాభై శాతం తగ్గించుకోవాలని నిర్మాతల అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలుపరచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తెలుగులో మాత్రం ఇప్పటివరకు హీరోలెవరూ పారితోషికాన్ని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించలేదు. నిర్మాతల అభిప్రాయాల్ని వారు ఏ మేరకు అంగీకరిస్తారనేది రానున్న కొద్ది రోజుల్లోనే తేలనుంది. 

కోత పడితే ‘శుభం’

ప్రస్తుతం చిత్రీకరణలో వున్న సినిమాలకు, గతంలో ఒప్పందం చేసుకున్న సినిమాలకు సంబంధించి కూడా దర్శకులు, కథానాయికల పారితోషికాల్లో  కోతలు వుంటాయని చెబుతున్నారు సినీ పెద్దలు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో తెలుగుసినీ పరిశ్రమ మళ్లీ గాడిలో పడేంత వరకు రెమ్యూనరేషన్ల విషయంలో హీరోలు, దర్శకులు, కథానాయికలు సహకరిస్తే కాస్త ఊరటగా వుంటుందని నిర్మాతలు అంటున్నారు. అయితే ఈ విషయంలో  పరస్పర అంగీకారంతో, స్నేహపూర్వకంగా ముందుకెళ్లడం వల్ల ఇరువురికి లాభదాయకంగా వుంటుందనీ, నిర్మాతలంతా ఒక్క తాటిపై వుంటేనే ఆచరణ సాధ్యమనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏ పరిశ్రమను బతికించుకోవడానికైనా కొన్ని త్యాగాలు తప్పవు.

చిత్రీకరణలు, థియేటర్స్‌ ప్రారంభమైన తరువాత, ప్రేక్షకుల స్పందనను బట్టి పరిశ్రమలో మార్పులు వుంటాయి. ఇప్పటికే సగం చిత్రీకరణ ముగిసిన సినిమాల విషయంలో పారితోషికాలు తగ్గించి ఇవ్వడం కుదరదు.. భవిష్యత్‌లో సదరు హీరో మార్కెట్‌ను బట్టి.. సినిమాల వసూళ్లను బట్టి.. రెమ్యూన రేషన్‌ల నిర్ణయం వుంటుంది.   

  • డి.సురేష్‌బాబు, ప్రముఖ నిర్మాత 

కరోనా ప్రభావంతో తెలుగు సినీ పరిశ్రమలో చాలా మార్పులు వుంటాయి. తప్పకుండా సినీ పరిశ్రమ పెద్దలంతా కలిసి మాట్లాడుకోవాలని అనుకుంటున్నాం. నటీనటుల, సాంకేతిక నిపుణుల  పారితోషికాలతో పాటు షూటింగ్‌ వర్కింగ్‌డేస్‌, ఇతర ఖర్చుల తగ్గింపు పై కూడా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 

 -సి.కల్యాణ్‌, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు 


- సినిమా డెస్క్‌


logo