మంగళవారం 26 మే 2020
Zindagi - May 23, 2020 , 23:32:48

ఈ గది మహిళలకు మాత్రమే!

ఈ గది మహిళలకు మాత్రమే!

పబ్లిక్‌ టాయిలెట్స్‌ అనగానే  ఓ రకమైన భావన కలుగుతుంది.  దుర్వాసన మదిలో మెదలుతుంది.  ఈ  అపరిశుభ్రత కారణంగా అత్యవసరమైనా  అటువైపు వెళ్లరు. ఇక శిశువులకు పాలు పట్టాలన్నా, చిన్నారులకు డైపర్స్‌ మార్చాలన్నా ప్రయాణ సమయంలో  సమస్యతో కూడుకున్న పనే. ఇలా ఎంతోమంది మహిళలు తరచూ ప్రయాణాల్లో చేదు అనుభవాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అందరిలాగే ఆమె కూడా ఇబ్బందుల పాలైంది. కానీ అందరిలా తేలిగ్గా తీసుకోలేదు. ఓ పరిష్కారాన్ని చూపింది. తద్వారా ఆదాయాన్ని కూడా పొందుతున్నది.

బస్సులు, రైళ్లలో రోజూ చాలామంది మహిళలు ప్రయాణం చేస్తుంటారు. శుభ్రత లేని పబ్లిక్‌ టాయిలెట్స్‌తో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఆమె కూడా అలాగే ప్రయాణం చేశారు. బయట నీళ్లు అస్సలు తాగకూడదని నిర్ణయించుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచాయి. కానీ నీళ్లు తాగకుండా ప్రయాణం ఎన్ని రోజులు? ఈ సమస్యకు తానే ఓ పరిష్కారాన్ని చూపాలనుకున్నారు. అక్కడే ఆమెకో అదిరిపోయే ఐడియా వచ్చింది... పౌడర్‌ రూమ్‌. అంటే ఒకే గదిలో అన్ని సదుపాయాలూ అందించడం. అదీ పూర్తి శుభ్రతతో.

పౌడర్‌ రూమ్‌..

శివకళది ముంబై. ఆమె సాధారణ గృహిణి. తరచూ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేవారు. అలా ప్రయాణం చేస్తున్న ప్రతి సారీ ఆమె ఓ ఇబ్బందిని ఎదుర్కొనేవారు. అదే టాయిలెట్‌ సమస్య. ట్రెయిన్లలో, స్టేషన్లలో టాయిలెట్స్‌ ఉన్నప్పటికీ అపరిశుభ్రంగా ఉండటంతో వాటిని వాడేందుకు ఇబ్బంది పడేవారు. అలా తాను ఎదుర్కొన్న సమస్య, మరెంతమందో ఎదుర్కొని ఉంటారని గ్రహించారు. దాంతోపాటు ప్రయాణాలలో మహిళలు ఎదుర్కొంటున్న మరికొన్ని ఇక్కట్లనూ  ప్రత్యక్షంగా గమనించారు. పిల్లలకు పాలుపట్టడం, డైపర్లు మార్చడం, ప్యాడ్స్‌ మార్చడం వంటి సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నారు. వీటన్నింటికీ ఒకే చోట పరిష్కారం అందించేలా స్నేహితుడు మనీష్‌తో కలిసి వూలూ అనే సంస్థను ప్రారంభించారు. ముంబయిలోని థానే రైల్వేస్టేషన్‌ సమీపంలో గతేడాది నవంబరులో ‘పౌడర్‌ రూమ్‌'ను ఏర్పాటు చేశారు. 


వింత అనుభూతి!

పౌడర్‌ రూమ్‌లోకి ప్రవేశించగానే వినసొంపైన సంగీతం స్వాగతం పలుకుతుంది. చుట్టూ ఏసీలు ఉండటంతో చల్లని గాలి చుట్టుముడుతుంది. ఆ గదిలో నీటి తడి అస్సలు  కనిపించదు. పిల్లలకు పాలు పట్టేందుకు వీలుగా ఫీడింగ్‌ చైర్‌ ఉంటుంది. ఇంట్లో మాదిరి వాష్‌బేసిన్లు, అద్దాలు ఉంటాయి. ఆ పక్కనే షెల్ఫ్‌లో అందాన్ని రెట్టింపు చేసే బ్యూటీ ప్రొడక్ట్స్‌ (పౌడర్స్‌, క్రీమ్స్‌, లోషన్స్‌, జెల్స్‌...) ఉంటాయి. వీటిని అవసరం మేరకు వాడుకోవచ్చు. మరో షెల్ఫ్‌లో ప్యాంటీలు, శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులో ఉంటాయి. కాలకృత్యాలు తీర్చుకునేందుకు పరిశుభ్రమైన  టాయిలెట్స్‌ ఉంటాయి. విశ్రాంతి తీసుకునేందుకు కుర్చీలతో పాటు అందుబాటులో కాఫీ కూడా ఉంటుంది.  ఇన్ని సదుపాయాలకు గాను రూ.20 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ కోసం అయితే రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. పౌడర్‌ రూమ్‌ బయట సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి ప్రవేశించాక అరగంట వరకు గడిపేందుకు అవకాశం ఉంటుంది. ప్యాంటీస్‌, ప్యాడ్స్‌ వంటివి వాడితే అందుకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.  థానే రైల్వేస్టేషన్‌ సమీపంలో 20 పౌడర్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. రోజూ దాదాపు 3 వందల మంది మహిళలు వీటిని ఉపయోగిస్తున్నారు. వచ్చే ఏడాదికల్లా మహారాష్ట్రలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు సహ వ్యవస్థాపకురాలు శివకళ. 


logo