మంగళవారం 26 మే 2020
Zindagi - May 23, 2020 , 23:32:54

కారు మోటర్‌తో వెంటిలేటర్‌!

కారు మోటర్‌తో వెంటిలేటర్‌!

 ఇప్పుడిప్పుడే అభివృద్ధికి అలవాటు పడుతున్న దేశం అఫ్గానిస్థాన్‌. అక్కడా కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. కానీ, మూడున్నర కోట్ల జనాభాకు 400 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో తమ దేశ పౌరుల ప్రాణాలు కాపాడుకోవటం కోసం ‘అఫ్గాన్‌ డ్రీమర్స్‌' రంగంలోకి దిగింది.

‘అఫ్గాన్‌ డ్రీమర్స్‌'..ఓ యువతుల బృందం. సరికొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్న ఈ యువకెరటాలు   రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల విలువైన వెంటిలేటర్లను రూ.45 వేలలోపు  ధరకే అందిస్తామని ప్రకటించారు. కారు మోటర్‌, బైక్‌ చైన్‌ డ్రైవ్‌తో వీటిని తయారు చేస్తున్నారు. ఈ బృందంలోని అమ్మాయిలంతా 14 నుంచి 17 ఏళ్ల లోపువారే.  టయోటా  కారులోని మోటార్‌ను, హోండా మోటార్‌ సైకిల్‌లోని చైన్‌ డ్రైవ్‌ను ఉపయోగించి ఓ వెంటిలేటర్‌ నమూనాను తయారు చేశారు. ఇది శ్వాసకోశ రోగులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. అఫ్గాన్‌లో కూడా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. దీంతో నగరంలోని అన్ని దుకాణాలూ మూసి వేయడంతో,  ఈ వెంటిలేటర్‌కు కావల్సిన విడిభాగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. అయినా దాదాపు 70శాతం పనిని పూర్తి చేశారు. త్వరలో ఆ వెంటిలేటర్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు అఫ్గాన్‌ డ్రీమర్స్‌. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖకూడా వీరికి చేయూతను అందిస్తున్నది. ఈ నెలాఖరుకు వెంటిలేటర్లను విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు.


logo