శనివారం 30 మే 2020
Zindagi - May 23, 2020 , 23:32:47

రోజూ 600 మందికి భోజనం

రోజూ 600 మందికి భోజనం

‘ఒకప్పుడు వడోదరలో పోలీస్‌స్టేషన్‌ పేరు చెప్పగానే... పోలీసులు, జైలు గోడలు, నేరస్తుల ఆర్తనాదాలే గుర్తుకొచ్చేవి. కానీ, ఇప్పుడు పోలీసులంటే ఆపదలో ఆదుకునే దేవుళ్లుగా, ఆకలి తీర్చే మాతృమూర్తులుగా కనిపిస్తున్నారు’ అంటూ ఓ సామాన్యుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే..?

ఒకరోజు, వారం రోజులు కాదు... లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి నేటివరకూ ప్రతిరోజూ 600 మందికి భోజనాలు పెడుతున్నారు వడోదర పోలీసులు. ఇందుకోసం ఏకంగా వారి పోలీస్‌స్టేషన్‌నే కిచెన్‌గా మార్చారు. లాక్‌డౌన్‌ ప్రారంభంలో వడోదర పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా, ఎంతోమంది రోడ్లపై అన్నం కోసం ఎదురు చూడటం కనిపించింది. ఎన్జీఓలు, వలంటీర్లు  అందించినా అవి సరిపోయేవి కాదు. పేదల ఆకలి బాధను అర్థం చేసుకున్న డీసీపీ సరోజ్‌కుమారి.. ఎలాగైనా వారి ఆకలి తీర్చాలనుకున్నారు. ఆ మరుసటి రోజే సొంతడబ్బుతో ఎనిమిది మంది మహిళా సిబ్బందిని సిద్ధం చేసి, భోజనం తయారు చేశారు. డ్యూటీ ముగిసిన తర్వాత ఆహారాన్ని సిద్ధం చేయడం, ఆ తర్వాత దాన్ని పేదలకు అందించడం. అలా వారంపాటు కొనసాగించారు. తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతుండటంతో.. ఈ విషయం వడోదర యువకులకు, వ్యాపారులకు తెలిసింది. దీంతో వారు కూడా పోలీసులకు సరుకులు, నగదు విరాళంగా ఇవ్వడం మొదలుపెట్టారు. కొంతమంది పుట్టినరోజులు, శుభకార్యాల ఖర్చులను పోలీసులకు అందించి.. మానవత్వం చాటుకున్నారు. ఇక వ్యాపారులైతే వారికి తోచినంతలో కిరాణా సరుకులు ఇచ్చారు. దీంతో వడోదర పోలీస్‌ ముఖ్య  కార్యాలయం కమ్యూనిటీ కిచెన్‌గా మారింది.


logo