సోమవారం 25 మే 2020
Zindagi - May 22, 2020 , 23:07:32

మంచి-చెడు

మంచి-చెడు

ఒక చెట్టు మీద రెండు రామచిలుకలు ఉండేవి. గూడు కట్టుకొని పిల్లలతో సంతోషంగా గడిపేవి. ఒకరోజు పొద్దున్నే పిల్లల ఆహారం కోసం ఆ చిలుకలు బయటకు వెళ్లాయి. అది గమనించిన ఓ వేటగాడు గూటిలో ఉన్న చిన్న చిలుకల్ని దొంగిలించాడు.అందులో ఒక చిలుక ఎలాగోలా తప్పించుకొని ఒక ఆశ్రమంలోని చెట్టుపైకి వెళ్లింది. రోజులు గడిచాయి. ఆ ఆశ్రమంలో రుషులు బోధిస్తున్న మంచి మాటలు వింటూ చిలుక పెరిగింది. మరో  చిలుకని బోయవాడు ఒక పంజరంలో బంధించి ఉంచుకున్నాడు. అది వాడి ఇంటి లోగిలిలో పెరిగింది. బూతులు వింటూ పెరిగింది. ఆ మాటలే దానికి అలవాటయ్యాయి. 

ఓరోజు ఒక బాటసారి వేటగాడి ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాడు. అతడికి అప్పుడే అలసట రావడంతో అక్కడున్న చెట్టు కింద పడుకున్నాడు. అది చూసి, రామచిలుక, ‘ఒరేయ్‌ మూర్ఖుడా! ఇక్కడెందుకు ఉన్నావురా? నీ నాలుక కోస్తా!’ అంటూ భయపెట్టింది. వాడు అక్కడి నుంచి పారిపోయాడు.  చాలాదూరం ప్రయాణించి ఆశ్రమం చేరాడు. అక్కడున్న రామచిలుక, ‘స్వాగతం బాటసారీ! నీ అలుపు తీరేవరకు ఇక్కడ విశ్రమించవచ్చు’ అంటూ తియ్యగా పలికింది.ఆశ్చర్యపోతూ, ఆ బాటసారి ‘నీ లాంటి రామచిలుకని నేను దారిలో కలిసాను. కానీ అది మహా కటువుగా మాట్లాడుతున్నది’ అన్నాడు. ‘ఓహ్‌.. బహుశా అది నా అన్న చిలుక అయ్యి ఉంటుంది. నేను సాధువుల సాహచర్యంలో పెరిగాను కాబట్టి, నా భాష ఇలా ఉంది. అదే నా అన్న, వేటగాడి భాష నేర్చుకుని అలా మాట్లాడుతున్నాడు. మనం ఎవరి సాంగత్యంలో ఉంటామో వారిలానే తయారవుతాం’ అని చెప్పింది రామచిలుక.

నీతి: మంచివాడివి కావాలనుకుంటే మంచివారి మధ్యనే ఉండాలి. logo