మంగళవారం 26 మే 2020
Zindagi - May 23, 2020 , 00:10:27

దక్షిణాఫ్రికాలో సేవా హస్తాలు!

దక్షిణాఫ్రికాలో సేవా హస్తాలు!

కరోనా.. మనిషి సమస్య. వైరస్‌కు పేద.. ధనిక భేదం లేదు. కానీ.. పేదోడు తట్టుకోగలడా? పుట్టుక దుఃఖమే.. బతుకూ దుఃఖమే.. చావూ దుఃఖమేనా? అభయం ఇవ్వాలి. ఆదుకోవాలి. సేవా హస్తాలు అందించాలి. పుట్టిన గడ్డకే కాదు.. బతుకునిచ్చిన గడ్డకూ సేవ చేస్తూ.. కొందరి బతుకులనైనా బాగుచేద్దామని కదిలింది దక్షిణాఫ్రికా ఎన్నారై సేన. 

పుట్టెడు కష్టాల్లో ఉన్నా కూడా, పక్కోడి మేలుకోరే గుణం తెలంగాణ బిడ్డల సొంతం. కరోనాతో ఒకవైపు భయంభయంగా బతుకుతూనే సాటి మనిషికి సాయం చేస్తూ సేవానిరతిని చాటుకుంటున్నారు దక్షిణాఫ్రికాలోని తెలంగాణ బిడ్డలు. విద్య.. ఉద్యోగం.. ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు వాళ్లంతా. మనం ఒకరికి సాయం చేస్తే.. మనవాళ్లకు ఇంకొకరు సాయం చేస్తారనే సేవా సూత్రాన్ని ఎంచుకున్నారు. ఫలాలు ఎక్కువమందికి చేరాలనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ యూనియన్‌, టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌గా రూపాంతరం చెందింది. దీని ప్రెసిడెంట్‌ నాగరాజు గుర్రాల. ఆయన ఆధ్వర్యంలో అనేక  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సౌతాఫ్రికా ఎన్నారై సెల్‌ గత ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసింది. పనిచేసే నాయకులనే ఎన్నుకోవాలనే  నినాదంతో టెలిఫోనిక్‌.. సోషల్‌మీడియా క్యాంపెయిన్లు నిర్వహించింది. 

కేరళ విపత్తు..

ఆ మధ్య భారీ వర్షాలకు కేరళలో వరదలు పోటెత్తాయి. నూటయాభైమందికి పైగా మరణించారు. ఎనభైవేలమంది వరదల్లో చిక్కుకున్నారు. వీరందరినీ రెస్క్యూ టీమ్స్‌ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ప్రభుత్వ సహాయక చర్యలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలూ తమవంతు సహాయం చేశాయి. టీఆర్‌ఎస్‌ సౌతాఫ్రికా సెల్‌ కూడా విరాళాలు  సేకరించి కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందజేసింది.

కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ 

కరోనా వల్ల ఒకవైపు ఇబ్బంది పడుతూనే మరోవైపు పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు దక్షిణాఫ్రికా ప్రవాసులు. హెల్ప్‌లైన్‌ ద్వారా స్థానిక పేదలకు.. అనాథలకు ఆహారం.. దుస్తులు అందజేశారు. ఔషధాలు సమకూర్చారు. స్థానిక పోలీసు స్టేషన్లలో దుప్పట్లు పంచారు. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెంటర్లలో మహిళలకు ఉపయోగపడే వస్తువులు ఇచ్చారు. అక్కడ చిక్కుకుపోయిన మల్కాజ్‌గిరి వాసులకు  నిత్యావసర వస్తువులు అందజేయడమే కాకుండా.. వరంగల్‌, ఖమ్మం వాసుల్ని కాన్సులేట్‌కి అటాచ్‌ చేశారు. ‘కరోనా వంటి విపత్తులు వచ్చినప్పుడు ఒకరికొకరం తోడుగా నిలిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం సేఫ్‌గా ఉన్నాం.. వేరేవాళ్లతో మనకేంటి అనుకోకూడదు. ఆ సామాజిక బాధ్యతతోనే మేం పనిచేస్తున్నాం’ అంటారు నాగరాజు గుర్రాల. logo