శనివారం 06 జూన్ 2020
Zindagi - May 23, 2020 , 00:09:47

కేశాలు పెరిగే కొత్త మార్గం

కేశాలు పెరిగే కొత్త మార్గం

చక్కని తలకట్టు కోసం తాపత్రయపడని వాళ్లు ఉండరు. కానీ ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలినా, ఇక అంతే. ఆ భాగంలో వెంట్రుకలు పెరగవు. కానీ అక్కడ వెంట్రుకలు పెరిగేలా కొత్త మందును కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు 

న్యూయార్క్‌ యూనివర్సిటీ పరిశోధకులు. చర్మం, వెంట్రుకల నిర్మాణానికి  కారణమయ్యే కొల్లాజన్‌ను ఫైబ్రోబ్లాస్ట్‌ కణాలు తయారు చేస్తాయి. ఈ కణాల మీద ఎలుకల్లో ఒక అధ్యయనం జరిగింది. దీనిలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. గాయమైన చోట వెంట్రుకలు మళ్లీ పెరగడానికి ఒక జీవప్రక్రియ కారణమవుతుందని ఈ అధ్యయనంలో తేలింది. వెంట్రుకలు పెరగడానికి అవసరమైన సంకేతాలను పంపించే ఆ జీవక్రియా మార్గమే.. హెడ్జ్‌ హాగ్‌ సిగ్నలింగ్‌ పాత్‌. తలపై గాయం అయినప్పుడు అక్కడ ఈ జీవక్రియ మందగిస్తుంది. అందువల్లనే ఆ భాగంలో వెంట్రుకలు తిరిగి పెరగవు. అయితే ఈ జీవక్రియ చురుగ్గా ఉండేలా చేయగలిగితే ఫైబ్రోబ్లాస్ట్‌ కణాలు మళ్లీ ప్రేరేపితం అవుతాయి. తద్వారా వెంట్రుకల పునర్నిర్మాణం సాధ్యమవుతుందని అంటున్నారు సెల్‌ బయాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ మయూమి ఇటో. ఎలుకలపై చేసిన ఈ ప్రయోగం విజయవంతం అయింది. నాలుగు వారాల్లో ఎలుకల్లో కొత్త వెంట్రుకలు ఏర్పడ్డాయి. మొత్తంగా ఈ పరిశోధన సఫలమైతే బట్టతలకు కూడా చికిత్సలు వచ్చే అవకాశం ఉంది. logo