శనివారం 06 జూన్ 2020
Zindagi - May 21, 2020 , 23:06:55

లోకల్‌ ఫుడ్‌.. సూపర్‌ హిట్స్‌!

లోకల్‌ ఫుడ్‌.. సూపర్‌ హిట్స్‌!

అవసరం మనిషితో ప్రయోగాలు చేయిస్తుంది. ఆవిష్కరణలనుప్రోత్సహిస్తుంది. వంటలకైనా ఈమాటే వర్తిస్తుంది. చిటికేస్తే స్విగ్గీ. విజిలేస్తే ఉబెర్‌ ఈట్స్‌. కూతవేటు దూరంలో పిజ్జాహట్‌. పొట్ట డిమాండ్‌ చేస్తే ప్యారడైజ్‌ బిర్యానీ. కరోనా దెబ్బకు అన్నీ బంద్‌. సాంబారు నుంచి సిజ్లర్స్‌  వరకూ ఏదైనా... ఇంట్లో వండు కోవాల్సిందే. ‘డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌'  ఫార్ములా ఫాలో కావాల్సిందే. ఆ సమయంలో ఫుడ్‌ చానల్స్‌ చేసిన సాయం అంతా ఇంతా కాదు.

ఎలా వండాలో తెలియదని చెబితే, నాలుక ఒప్పుకుంటుందా? పొట్ట మాత్రం తట్టుకుంటుందా? ఆ సమయంలోనే ఫుడ్‌ చానల్స్‌  గరిటె పట్టుకున్న అన్నపూర్ణమ్మల్లా యూట్యూబ్‌ స్క్రీన్‌ మీద దర్శనం ఇచ్చాయి. పక్కాలోకల్‌ నుంచి ఫారిన్‌ తిండి వరకూ తంటా లేకుండా వంట ఎలా చేయాలో విడమరచి చెప్పాయి. ఈ మధ్యకాలంలో సెలెబ్రిటీలు సైతం యూట్యూబ్‌ చానెల్స్‌ని మొదలుపెట్టారు. అందులోనూ వంటలకు సంబంధించిన పోస్టులే ఉంటున్నాయి. దీంతో ప్రతి ఇల్లూ పాకశాస్త్ర ప్రయోగశాలగా మారింది. ఇల్లాలు ఓ మోస్తరు శాస్త్రవేత్తగా అవతరించింది. మగవాడే పాపం, కొన్నిసార్లు ల్యాబొరేటరీలో ఎలుక పాత్ర! కొత్తరుచుల తొలి ప్రయోగం అతడి మీదే. బాగా లేకపోయినా నోరెత్తితే ఒట్టు.. అంతేగా, అంతేగా! 

మొత్తానికి ఈ సీజన్‌లో భారీగా లాభపడింది... యూట్యూబ్‌ చానల్స్‌ యజమానులే. శ్రావణీస్‌ కిచెన్‌ నిర్వాహకురాలు శ్రావణినే తీసుకోండి. తన చానల్స్‌ సబ్‌స్ర్కైబర్లు రెట్టింపు అయ్యారని సగర్వంగా చెబుతున్నారు ఆమె. మిగతా చానల్స్‌ గ్రాఫ్‌ కూడా ఇలానే పైపైకి ఎగబాకింది. ‘ఎడిటింగ్‌ చేసేవాళ్లు లేకపోవడం వల్ల నేను లాక్‌డౌన్‌లో ఒక్క వీడియోను కూడా అప్‌లోడ్‌ చేయలేదు. అయినా సబ్‌స్ర్కైబర్లు రెట్టింపు అయ్యారు’ అంటారు శమాకులకర్ణి అనే ‘రవ్వలడ్డు’ అవ్వ. ఒక్క తెలుగు రాష్ర్టాలు అనే కాదు, దేశమంతా ఇదే ట్రెండ్‌. కరోనా సెలవుల్లో ముదురు బ్రహ్మచారులూ, కాబోయే పెండ్లి కూతుర్లు సైతం యూట్యూబ్‌ చానళ్ల ద్వారా వంటావార్పూ నేర్చుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ‘జీవితభాగస్వామి మనసు గెలుచుకోవాలంటే, ముందు వాళ్ల పొట్టని గెలవాలి’ అన్న పెద్దల సలహా నవతరంతోనూ గరిటెలు పట్టించింది. ‘మొదట్లో కొందరికి అయితే, జీలకర్రకూ ఓమకూ తేడా కూడా తెలిసేది కాదు. ప్రశ్నలతో విసిగించేవారు’ అంటూ రెండు నెలల క్రితం నాటి పరిస్థితుల్ని గుర్తుచేసుకుంటారు కవితాసింగ్‌ అనే యూట్యూబ్‌ వంటలక్క. అరవై రోజుల్లో అంతా మారిపోయింది. వాళ్లే ఇప్పుడు స్టార్‌ షెఫ్‌ పోటీలకు సిద్ధం అవుతున్నారు.  వంటగదులకు కొత్తకళ తెచ్చిన యూట్యూబర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఇది. ‘రెసిపీ దాకా సుఖీభవ’  

ఇంట్లో వంటలనే.. 

పేరు : శ్రావణి 

చానెల్‌ : శ్రావణీస్‌ కిచెన్‌ 

సబ్‌స్ర్కైబర్లు : పన్నెండు లక్షలు

డిగ్రీ చదివింది. ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంది. ఈలోపు మంచి సంబంధం అని పెద్దవాళ్లు పెండ్లి చేసేశారు. ఆ తర్వాత పిల్లలు.. గృహిణిగా స్థిరపడిపోయింది. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఉద్యోగం చేయలేని పరిస్థితి. అయినా, మనసులో ఏదైనా సాధించాలన్న తపన. యూట్యూబ్‌లో సెర్చ్‌ చేయడం మొదలుపెట్టింది. ఇంట్లో ఉంటూనే ఏదో ఒకటి చేసి, తనేమిటో నిరూపించుకోవాలని అనుకుంది. ‘ఏదో ఎందుకు? వంటలకు సంబంధించే  చేయవచ్చు కదా’ అని సలహా ఇచ్చారు ఆయన. అలా 2016లో శ్రావణీస్‌ కిచెన్‌ పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ని మొదలుపెట్టింది. స్కూల్‌ నుంచి రాగానే పిల్లలు ఏదో ఒకటి కావాలని అడుగుతుండేవారు. అలా పిల్లల కోసం తాను చేసే వంటలనే షూట్‌ చేసి పోస్ట్‌ చేస్తుంది శ్రావణి. లాక్‌డౌన్‌లో తన కూతురి బర్త్‌ డే కోసం చేసిన కేక్‌, పిజ్జా చాలా హిట్‌ అయ్యాయి. శ్రావణి కాస్త సిగ్గరి. పైగా తను ఒక్కతే ఉన్నప్పుడే ఇంట్లో షూట్‌ పెట్టుకుంటుంది. యూట్యూబ్‌ గోల్డ్‌ అవార్డును కూడా అందుకున్నది. 

రుచుల సంగమం.. 

పేరు : ఇందిరా ఐరేని 

చానెల్‌ : హైదరాబాదీ రుచులు 

సబ్‌స్ర్కైబర్లు : ఐదున్నర లక్షలు 

కేవలం వంట మీద మమకారంతోనే ఇందిర యూట్యూబర్‌గా మారింది. ఈఎస్‌ఐలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తూనే యూట్యూబ్‌ చానెల్‌ని మొదలుపెట్టింది. ముందు హైదరాబాదీ స్పెషల్‌ రుచులను పరిచయం చేసింది. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్ర వంటల మీద ఫోకస్‌ చేసింది. ఇప్పుడు దేశవ్యాప్త రుచులనూ తన చానెల్‌ ద్వారా అందిస్తున్నది. ఇప్పటివరకు 750 రెసిపీలను పరిచయం చేసింది. తను ఫార్మాలో ఉండటం వల్ల, న్యూట్రిషన్‌ మీద అవగాహన ఎక్కువ. కాబట్టే, ఏం వండినా, తగినన్ని పోషక విలువలు ఉండేలా చూసుకుంటున్నది. అంతరించిపోతున్న వంటకాలను  తన చానెల్‌ ద్వారా పరిచయం చేసే పనిలో ఉంది. లాక్‌డౌన్‌కి ముందు నుంచి లైవ్‌లో కూడా కనిపిస్తున్నది ఇందిర. అంతకు ముందు గొంతు మాత్రమే వినపడేది. లాక్‌డౌన్‌లో అన్నం వడియాలకు ఎక్కువ వ్యూస్‌ దక్కాయి. అంతేకాదు.. హలీమ్‌ ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా నేర్పింది. తెలుగు రాష్ర్టాల నుంచి 2019లో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అవార్డును అందుకుంది.

ఈజీ ఈజీగా.. 

పేరు : సురేఖ 

చానెల్‌: గోదావరి రుచులు 

సబ్‌స్ర్కైబర్లు: లక్షా పదిహేను వేలు 

తను తూర్పుగోదావరి జిల్లాలోని పడియపర్తిలో  పుట్టింది. గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా బిజీ బిజీగా ఉన్న సమయంలో ఏదో వెలితిగా అనిపించింది. తనకంటూ ఒక గుర్తింపు ఎక్కడా లేదనుకుంది. తనకు తెలిసిన విషయాలనే ఒక సరైన పద్ధతిలో చెప్పాలనుకుంది. వంటలకే పరిమితం కాకుండా హెల్త్‌, స్కిన్‌, హెయిర్‌, బ్యూటీ, మేకప్‌ టిప్స్‌తో.. గోదావరి రుచులు పేరుతో 2012లో యూట్యూబ్‌లో చానెల్‌ని మొదలుపెట్టింది. హఠాత్తుగా తట్టే ఐడియాలను కూడా క్రియేటివ్‌గా ఇంప్లిమెంట్‌ చేస్తుంది. కొన్నిసార్లు ఆ రోజు మొత్తం తాను చేసే పనుల్ని చానెల్‌ ద్వారా వీక్షకులకు అందిస్తుంది. లాక్‌డౌన్‌ కాలంలో మ్యాంగో ఐస్‌క్రీం, మటన్‌ కర్రీ, కొబ్బరి బూరెలు చాలా ఫేమస్‌ అయ్యాయి. వీటికి వ్యూస్‌  బాగా వచ్చాయి. కొవిడ్‌ నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పింది. ఈ వీడియోకి కూడా ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి. తను చానెల్‌ కోసం ప్రత్యేకంగా ఏ వంటా చేయదు. ఇంట్లో వాళ్ల కోసం చేసిన వంటకాలనే వీడియోల ద్వారా అందిస్తున్నది. 

అమ్మ చేతి వంటలాగే.. 

పేరు : భార్గవి

చానెల్‌ : అమ్మ చేతి వంట 

సబ్‌స్ర్కైబర్లు: తొమ్మిదిన్నర లక్షలు 

ఎంత బయటి తిండి తిన్నా, తల్లి చేతి వంట రుచే వేరు. అలా అనుకొనే ‘అమ్మ చేతి వంట’ పేరుతో ఒక యూట్యూబ్‌ చానెల్‌ని మొదలుపెట్టింది భార్గవి. వైజాగ్‌కి చెందిన ఈ అమ్మాయి బీఎస్సీ చదివింది. పెండ్లి తర్వాత హైదరాబాద్‌కి మకాం మార్చింది. ఉద్యోగం కాకుండా తనకంటూ సొంత ఐడెంటిటీ ఉండాలనుకుంది. అలా 2017లో ఆంధ్రా, తెలంగాణ వంటకాలను యూట్యూబ్‌ ద్వారా పరిచయం చేయడం మొదలుపెట్టింది. ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌తో అందరికీ అర్థమయ్యేలా తన యూట్యూబ్‌ చానెల్‌ని డిజైన్‌ చేసుకుంది. ఆరోగ్యానికి, ఆహారానికి సంబంధించిన టిప్స్‌ని కూడా తన చానెల్‌ ద్వారా అందిస్తున్నది. ట్రావెల్‌ వీడియోలను కూడా పెట్టింది. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు, బ్యాచిలర్‌ కుర్రాళ్లు చిటికెలో వంట చేసుకునే మార్గాన్ని కనిపెట్టడమే తన ప్రధాన ధ్యేయమని చెబుతున్నది. లాక్‌డౌన్‌లో తన చానెల్‌కి మరింత పాపులారిటీ లభించింది. ఈ సమయంలో పానీపూరీ, డాల్గోనా కాఫీలకి మంచి వ్యూస్‌ వచ్చాయి. 


logo