మంగళవారం 26 మే 2020
Zindagi - May 21, 2020 , 23:06:52

హౌస్‌ నంబర్‌: 300 చెట్లు!

హౌస్‌ నంబర్‌: 300 చెట్లు!

మంచిర్యాల జిల్లా. దండేపల్లి గ్రామం. మేక రఘునాథరెడ్డి ఇల్లు. ఇల్లంటే ఇల్లు కాదు. ఆ ఆవరణ ఎకరానికి పైనే ఉంటుంది. లోపలికి కాలుపెడుతుంటే, ‘రండి రండి... దయచేయండి!’ అంటూ  రెండు వైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. రంగుల పూలు కుశల ప్రశ్నలు అడుగుతాయి. పర్యావరణం మీద మక్కువతో ఆ ఇంటి యజమాని  చిన్నపాటి వనాన్నే సృష్టించారు. 

ఎవరైనా బంగారం మీద మదుపు చేస్తారు. భూముల మీద పెట్టుబడి పెడతారు. కానీ, రఘునాథరెడ్డి మాత్రం మొక్కల కోసమే పదిహేను లక్షల వరకూ ఖర్చు చేసి ఉంటారు. పచ్చదనం ఇచ్చే ఆనందం ముందు పచ్చనోట్లు ఓ లెక్కే కాదంటారు ఆయన. తనతో కలిసి అడుగులేస్తే ... అడుగు అడుగుకో చెట్టునో, పూల మొక్కనో పరిచయం చేస్తూ రకరకాల అనుభవాలు పంచుకుంటారు. ఒకటా రెండా మూడు వందల పైచిలుకు చెట్లు, వందకు పైగా పూల మొక్కలు. మామిడి, వేప, జామ, కొబ్బరి, పంపర పనస, పనస, లిచ్చి, నిమ్మ, సూది నిమ్మ, చెర్రీ (ఒగ్గాయి), మోసంబి, అంజూర, వాటర్‌ ఆపిల్‌, రామఫలం, మునగ, సీతాఫలం, మర్రి, రావి, సింధూర...ఇలా దాదాపు 30 రకాల చెట్లు ఉన్నాయి. ఐదు రకాల తులసి మొక్కల్ని మక్కువతో చూపిస్తారు. ఇంకా, ఐదు రకాల అరటి చెట్లూ! చక్కెర కేళీ, కూర అరటి, రెడ్‌ బనానా, వామన, సాధారణ అరటి .. దేనికదే రుచికరం. పలు రకాల ఔషధ మొక్కలనూ పరిచయం చేస్తారు ఆ పెద్ద మనిషి. నిమ్మజాతికి చెందిన సూది నిమ్మలకు మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందట. అందుకే, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ నిమ్మకాయలను తీసుకుపోతుంటారు. కాలో చేయో విరిగినప్పుడు ఔషధంలా పనిచేసే నల్లేరు మొక్క కూడా ఉంది ఇక్కడ. పరమేశ్వరుడికి బిల్వార్చన అంటే మహా ఇష్టమని అంటారు. ఆయన తోటలో ఏకబిల్వం, మహాబిల్వం మొక్కలూ ఉన్నాయి.  

పుష్ప విలాసం: ఆ పూల తోటలో అడుగుపెడితే  ఏ గంధర్వ వనానికో వెళ్లిన అనుభూతి కలుగుతుంది. నాలుగు రకాల మల్లెలు, రకరకాల గులాబీలు, సంపెంగ, తామర,  బ్రహ్మకమలం, చామంతి, చక్రం పూలు, కాగితం పూలు, మందారం, ముద్ద మందారం, బంతి... చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. ఆస్వాదించడానికి ఒక హృదయం సరిపోదు. ఇంటి వెనకాల ప్రత్యేకంగా ఒక పెద్ద బావిని తవ్వించి అక్కడి నుంచి.. ప్రతి మొక్కకూ నీళ్లు వెళ్లేలా పైపులు వేశారు. ఆ పచ్చదనంతో ప్రేమలో పడిపోయి రకరకాల పక్షులు ఇక్కడే కాపురం పెట్టాయి. రఘునాథ్‌ దగ్గర వీడ్కోలు తీసుకుని తిరిగివస్తున్నప్పుడు... నిత్య జీవితంలో మనం కోల్పోతున్నది ఏదో ఆ ఆవరణ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఓ సాకుతో మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. ఆ ఇంటికి ఎవరైనా ఉత్తరాలు రాస్తే అడ్రస్‌లో.. మూడువందల చెట్లు ఉన్న ఇల్లు అని రాస్తే  చాలు. పోస్ట్‌మ్యాన్‌కు అర్థమైపోతుంది. తీసుకువెళ్లి రఘునాథరెడ్డికే ఇస్తాడు.


-మహ్మద్‌ శరీఫుద్దీన్‌  


logo