శనివారం 06 జూన్ 2020
Zindagi - May 21, 2020 , 23:06:45

కూల్‌డ్రింక్స్‌తో ఆస్టియోపొరోసిస్‌?

కూల్‌డ్రింక్స్‌తో ఆస్టియోపొరోసిస్‌?

కూల్‌డ్రింకులో కోడిగుడ్డు వేయడం.. కొద్దిసేపటికి కోడిగుడ్డుకి రంధ్రాలు పడటం... వెంటనే లోపలి సొన అంతా బయటికి రావడం...  స్కూల్ల్లో సైన్సు పాఠాల్లో భాగంగా ఈ యాక్టివిటీని చూపిస్తుంటారు. మన ఎముకలు కూడా దాదాపుగా కోడిగుడ్డు పెంకు లాంటివే. అందుకే కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగేవాళ్లకు ఆస్టియోపొరోసిస్‌ వచ్చే ఆస్కారం ఎక్కువని అంటారు. 

ఎండకి సేదదీర్చినట్టుగా కనిపించే కూల్‌డ్రింకులలో ఎముకల్ని దెబ్బతీసే పదార్థాలు కూడా ఉన్నాయని అనేక అధ్యయనాల్లో బయటపడింది. అతిగా శీతల పానీయాలు తాగేవారిలో ఆస్టియోపొరోసిస్‌ వ్యాధి తలెత్తే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎముకలు, ప్రత్యేకించి తుంటి ఎముకలు త్వరగా విరిగిపోయేందుకు ఈ పానీయాలు కారణమవుతున్నాయని కూడా చెబుతున్నారు. వృద్ధాప్యంలో అయితే ఆస్టియోపొరోసిస్‌ అంగవైకల్యంతో పాటు ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. అయితే పురుషులతో పోలిస్తే  నాలుగు రెట్లు అధికంగా ఈ సమస్యకు లోనవుతున్నారు మహిళలు. రోజూ మూడుసార్లకు మించి  కూల్‌డ్రింక్స్‌ తీసుకునేవారిలో ఎముకల్లో సాంద్రత తగ్గి, సన్నబడిపోతున్నాయి.  కాల్షియం, విటమిన్‌-డి, పండ్లు, కూరగాయలు బాగానే తీసుకున్నా, పానీయాల దుష్ప్రభావం ఎముకల మీద పడుతుందని చెబుతున్నారు బోస్టన్‌లోని టఫ్ట్స్‌ యూనివర్సిటీ నిపుణులు డాక్టర్‌ టాకర్‌. ఎముకలను కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం గట్టిపరుస్తాయి. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్‌ ఆమ్లం వీటన్నింటినీ దెబ్బతీస్తుందంటున్నారు ఆయన. అందుకే కూల్‌డ్రింక్స్‌ తాగడాన్ని తగ్గించి, ఆ మేరకు రోజూ పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు. logo