శనివారం 06 జూన్ 2020
Zindagi - May 20, 2020 , 23:01:15

అతివల మార్కు.. ఆయుర్వేద మాస్కు!

అతివల మార్కు.. ఆయుర్వేద మాస్కు!

కొన్ని మాస్కులు కట్టుకుంటే ఊపిరి ఆడదు. రసాయనాల్లో అద్ది తీసినట్టు ఏదో వాసన . కొద్ది సేపటికే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. కానీ, నారాయణపేట మాస్కులు ధరిస్తే మాత్రం... హాయిగా అనిపిస్తుంది. తల్లి కొంగులో తలదాచుకున్నట్టు ఉంటుంది. కాబట్టే, చిన్న ప్రయోగంగా మొదలైన మాస్కుల తయారీ... ఓ పరిశ్రమగా విస్తరించింది. జిల్లాలో ఉపాధి కరువైన చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించింది. మహిళా సంఘాల విజయానికి సాక్షి సంతకమైంది.

కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏదో ఓ రక్షణ కవచం తప్పనిసరి. ఆ వైరస్‌తో దీర్ఘకాలిక సహజీవనమూ తప్పదు. ఇదే అదనుగా, మార్కెట్‌లోకి వివిధ రకాల మాస్కులు వచ్చాయి. అందులో ప్రముఖ బ్రాండ్లూ ఉన్నాయి. వాటన్నిటినీ తలదన్నేలా... నారాయణపేట జిల్లా చేనేత కార్మికులు, మహిళా సమాఖ్య సభ్యులు డీఆర్‌డీఏ సహకారంతో రూపొందిస్తున్న ఆయుర్వేద మాస్కులు కొద్దికాలంలోనే గుర్తింపును తెచ్చుకున్నాయి. బంగారం విక్రయాల్లో, చేనేత రంగంలో, కంది పంట సాగులో ప్రత్యేకతను చాటుకున్న జిల్లా.. ఆయుర్వేద మాస్కుల తయారీలోనూ తనదైన ముద్ర వేసుకున్నది. ఇప్పుడు నారాయణపేట మాస్కులంటే ఓ బ్రాండ్‌!

ఓ సంక్షోభం నుంచి...

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులులేక ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయనీ కుటుంబాల్ని పోషించుకోలేక పోతున్నామనీ చేనేత కార్మికులూ, మహిళా సంఘాల సభ్యులూ కలెక్టర్‌ హరిచందనకు విన్నవించారు. ప్రతి సమస్యలోనూ ఓ అవకాశం ఉంటుందన్న కోణం నుంచీ ఆలోచించారు కలెక్టరు. అప్పటికే మార్కెట్‌లో రకరకాల మాస్కులు రాజ్యమేలుతున్నాయి. వాటితో పోటీ పడాలంటే... ఏదో ఓ ప్రత్యేకత ఉండాలి. బిజినెస్‌ పరిభాషలో అయితే, యునీక్‌ సెల్లింగ్‌ ప్రపోజిషన్‌ (యూఎస్‌పీ) అవసరం. ఆ ఆలోచనతోనే మాస్కులకు ఔషధీయ విలువలు జోడించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ ఎక్కడా ఇలాంటి ప్రయోగం జరగలేదు. ఆయుర్వేద వైద్యులతో సమాలోచనలు జరిపి, మూలికల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు. పూర్తి స్థాయి ఉత్పత్తి, మార్కెటింగ్‌ బాధ్యతలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు అప్పగించారు. చేనేత కార్మికులతోపాటు మూడువేల మంది మహిళా సంఘాల సభ్యులకు మాస్కుల తయారీపై అవగాహన కల్పించారు. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు.

 అమ్మకాలలో రికార్డు 

ఆయుర్వేద మాస్కులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఏర్పడింది. జిల్లా కేంద్రంలో ప్రారంభమైన అమ్మకాలు  అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. ఇప్పటికే జిల్లాలో నాలుగు లక్షల మాస్కులు విక్రయించారు. హైదరాబాద్‌లో రూ.50 లక్షల టర్నోవర్‌ జరిగింది.   ‘మాకు శిక్షణ ఇచ్చి, ఖాదీ వస్ర్తాలను సమకూర్చారు. రోజూ ఐదు వందల వరకూ సంపాదిస్తున్నాం. మార్కెట్‌ పెరిగేకొద్దీ మాకూ మేలు జరుగుతుంది’ అంటున్నారు నారాయణపేట మహిళా సమాఖ్య పట్టణ అధ్యక్షురాలు బీ.మాధవి. ‘ఆయుర్వేద మాస్కులను మార్కెటింగ్‌ చేసేందుకు మెట్రో రైలు, ఫిక్కీ, రాంకీ తదితర సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి’ అని చెబుతున్నారు  నారాయణపేట డీఆర్‌డీవో కాళిందిని. హీరో విజయ్‌ దేవరకొండకు చెందిన రౌడీ బ్రాండ్‌ కూడా భారీ ఆర్డర్లు ఇచ్చింది. ‘రౌడీ’లో ఆన్‌లైన్‌లో అమ్మకాలు మొదలయ్యాయి. సమస్యలూ, సంక్షోభాలూ ఎప్పుడూ ఉండేవే. వాటిని ఓ సవాలుగా భావిస్తే ఓ అవకాశమై చేయి అందిస్తాయి. కరోనా కాలంలో నారాయణపేట మహిళలు కనిపెట్టిన గెలుపు ఫార్ములా ఇది.  (ఆర్డర్ల కోసం... 8790990606)ఉపాధి కల్పించాలని..

 జిల్లాలోని చేనేత కార్మికులకు, మహిళా సంఘాల సభ్యులకు లాక్‌డౌన్‌ సమయంలో ఏదో ఒక ఉపాధి కల్పించాలని అనుకున్నాం. ఈ ఉద్దేశంతోనే మాస్కుల తయారీని ప్రారంభించాం. మొదట్లో నలుగురిలా సాధారణ మాస్కులనే తయారు చేయించాం. వీటితో పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఆయుర్వేద వైద్యుల సలహాలు, సూచనల మేరకు ఔషధ విలువలు కలిగిన మాస్కుల తయారీని మొదలుపెట్టాం. వీటికి డిమాండ్‌ పెరిగింది. ప్రత్యేక గుర్తింపూ వచ్చింది.                                                     

- హరిచందన, కలెక్టర్‌, నారాయణపేట జిల్లా

చాలా ప్రత్యేకతలు 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల్ని కచ్చితంగా పాటిస్తూ ఈ మాస్కులను తయారు చేస్తున్నారు. తయారీకి నారాయణపేట, పోచంపల్లి కాటన్‌ వస్త్రాలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. కుట్టు పనులు పూర్తయిన మాస్కులను కర్పూరం, వామ, పుదీన, నీలగిరి ఆకులు, లవంగ నూనెలతో తయారు చేసిన ద్రావణంలో ముంచి ఆరబెడుతారు. అనంతరం జాగ్రత్తగా ప్యాక్‌ చేసి మార్కెట్‌ చేస్తున్నారు. ఈ మాస్కులు దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వరుసగా వారం రోజులు వీటిని ధరించవచ్చు. తర్వాత శుభ్రం చేసి, లిక్విడ్‌ను వేసి మరో నాలుగైదు రోజులు వాడుకోవచ్చు. ఈ ద్రావకాన్ని మాస్కు కొనుగోలు సమయంలోనే ఇస్తారు.-చేకూరి నర్సింహులు


logo