శనివారం 06 జూన్ 2020
Zindagi - May 20, 2020 , 23:08:45

బెడిసికొట్టిన మోసం

బెడిసికొట్టిన మోసం

నక్క జిత్తులమారిది అని అన్ని జంతువులకూ  తెలుసు. అయినా దాని మాయమాటలు విని చాలా జంతువులు బుట్టలో పడిపోతుంటాయి. ఒక దశలో ఓ గాడిద ఈ జిత్తులమారి నక్కతో  స్నేహం చేసింది. నక్కతో కలిసి చెట్టూ, పుట్టా తిరగడం మొదలుపెట్టింది. ఒకరిని విడిచి మరొకరు ఎక్కడికీ వెళ్ళకూడదని  షరతులు  పెట్టుకున్నాయి.  నక్క గురించి తెలిసి కూడా గాడిద ఎలా స్నేహం చేస్తున్నదని మిగిలిన జంతువులు ఆశ్చర్యపడ్డాయి. వాటి మాటలు పట్టించుకునే పరిస్థితిలో గాడిద కూడా లేదు. పూర్తిగా నక్క చెప్పినట్టుగా ప్రవర్తించసాగింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి.  ఓ రోజు నక్క, గాడిద కలిసి అడవిలో సంచరిస్తుంటే హఠాత్తుగా సింహగర్జన వినిపించింది. ఆ రెండు జంతువులూ భయపడ్డాయి. పారిపోవాలని వెనక్కి తిరిగాయి.  వెనకాలే ఉన్న సింహాన్ని చూసేసరికి వాటి గుండెలు జారిపోయాయి. నక్క తేరుకుని ‘ముందు ఆ సింహంతో స్నేహంగా ఉండకపోతే మన ప్రాణాలు పోతాయి’ అంటూ ధైర్యంగా సింహం వైపు నడిచింది.  సింహాన్ని కాసేపు  పొగిడింది. ‘ఆ గాడిద బాగా బలిసి ఉంది కాబట్టి, దాన్ని తింటేనే మీ ఆకలి చల్లారుతుంది’ అని నెమ్మదిగా చెప్పింది. సింహానికి నక్క తెలివి అర్థమైంది. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం గాడిదని ఎరగా పెడుతున్నదని ఊహించింది. అయినా అమాయకంగా ‘అలాగే’ అని తల ఊపింది. అది నిజమే అనుకున్న నక్క  గాడిద దగ్గరకు వెళ్లింది. ‘నాతో రా..’ అంటూ గాడిదను కొద్ది దూరం తీసుకెళ్ళి గుంతలో పడేట్లు చేసింది. గాడిద గుంతలో పడీపడక ముందే సింహం నక్కమీదకి దూకింది. ‘గోతిలో ఉంది కాబట్టి  గాడిద పారిపోలేదు. కానీ నువ్వు పారిపోతావ్‌' అంటూ నక్కని చీల్చి తన ఆకలిని తీర్చుకుంది సింహం. మళ్ళీ ఆకలి వేసినపుడు తినవచ్చని  గాడిదను వదిలేసి వెళ్ళిపోయింది. 

నీతి: ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు! 


logo