మంగళవారం 26 మే 2020
Zindagi - May 20, 2020 , 23:01:11

సుస్మితాసేన్‌.. మళ్లీ నవ్వింది!

సుస్మితాసేన్‌.. మళ్లీ నవ్వింది!

ఒకనాటి విశ్వ సుందరి సుస్మితాసేన్‌ మొహం మీద కొంతకాలం   చిరునవ్వు మాయమైంది. ఆమె ప్రేమగా తీర్చిదిద్దుకున్న శరీరమే   ఆమె మీద తిరుగుబాటు చేసింది. ఓ భయంకరమైన వ్యాధి రూపంలో శత్రువులా దాడి చేసింది.  సుస్మిత మనోబలంతో తన శరీరం మీద తానే పోరాడారు. నాలుగేళ్లలో సంపూర్ణ విజయం సాధించారు.  సుస్మితాసేన్‌ పోరాడి గెలిచిన  వ్యాధి పేరు.. అడిసన్స్‌ డిసీజ్‌, అరుదైన ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. ఇప్పుడు సుస్మిత నవ్వుతున్నారు.. హాయిగా, ఆత్మవిశ్వాసంతో,  విజయగర్వంతో!

కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు శారీరకంగానూ మానసికంగానూ హింసకు గురిచేస్తాయి. తీవ్రంగా  కుంగదీస్తాయి. ఆ వలయంలోంచి బయటపడాలంటే ఆత్మబలం కావాలి.  సుస్మిత ఓ తీవ్ర వ్యాధి నుంచి ఆ మనోశక్తితోనే బయటపడింది. 2014వ సంవత్సరం.. సెప్టెంబరు నెలలో సుస్మితకు అడిసన్స్‌ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆమెలో హఠాత్తుగా చిరాకు ఎక్కువైంది. ఏదో తెలియని భయం, ఆందోళన వెంటాడాయి. తరచూ భ్రాంతులకు లోనయ్యేది. అప్పుడప్పుడూ ఏం మాట్లాడుతున్నదో కూడా తెలియకపోయేది. నిద్ర సరిగా పట్టేది కాదు. చివరికి డిప్రెషన్‌కి లోనైంది. పైగా కడుపునొప్పి, నడుమునొప్పి, కాళ్ల నొప్పులు.. పిగ్మెంటేషన్‌ వల్ల చర్మం  కమిలిపోయినట్టు అయింది. కండ్ల కింద నల్లటి వలయాలు వెక్కిరించేవి. పోరాడటానికి కూడా ఏమీ మిగల్లేదని బాధపడేది. చికిత్స కోసం తీసుకున్న స్టిరాయిడ్స్‌ దుష్ప్రభావాలు మరోవైపు. 

అడిసన్స్‌ డిసీజ్‌ అంటే..?

మన రెండు కిడ్నీల పైన రెండు అడ్రినల్‌ గ్రంథులు ఉంటాయి. ఇవి ఎండోక్రైన్‌ గ్రంథులు. ప్రధానంగా కార్టిసాల్‌, ఆల్డోస్టిరాన్‌ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు  రకరకాల ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ గ్రంథులు కనుక తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే అడ్రినల్‌ ఇన్‌సఫీషియన్సీ అంటారు. ఇదే అడిసన్స్‌ డిసీజ్‌. ఈ వ్యాధి ఉన్నప్పుడు వ్యాధి నిరోధక వ్యవస్థ పొరపాటున అడ్రినల్‌ గ్రంథులపై దాడి చేస్తుంది. ఇలా మన వ్యాధి నిరోధక వ్యవస్థ తన సొంత కణాల పైనే దాడిచేయడాన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులని అంటారు. అడిసన్స్‌ వ్యాధి వల్ల అడ్రినల్‌ గ్రంథులు... కార్టిసాల్‌, ఆల్డోస్టిరాన్‌లను తగినంతగా ఉత్పత్తి చేయవు. చికిత్సగా,మనలో లోపించిన హార్మోన్‌నే స్టిరాయిడ్‌ రూపంలో ఇస్తారు. 

‘నుంచాకు’ సాయంతో...

ఏ సమస్యకైనా ఏదో ఒక రూపంలో పరిష్కారం దొరుకుతుంది. సుస్మితకూ వెలుగురేఖ కనిపించింది... నుంచాకు అనే జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్‌  రూపంలో. అదే ఆమెలో ధైర్యాన్ని నింపింది. నుంచాకు అంటే రెండు కర్రముక్కల్ని గొలుసుతో అనుసంధానించిన సాధనం. దీన్ని మెరుపువేగంతో తిప్పాల్సి ఉంటుంది. ఆ చురుకుదనం మనసు మీదా సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ సాధనతో పాటు నిత్యం మెడిటేషన్‌ చేసేది. ‘వ్యాధి గురించి తెలియగానే కుంగిపోయా. కానీ నా మనో బలాన్ని పెంచుకుంటే తప్ప శరీరం కుదుటపడదని అర్థమైపోయింది. నేను చేసింది అదే. మన శరీరం గురించి మనకన్నా మంచిగా ఎవరికీ తెలియదు. అందుకే శరీరంతో సంభాషించాలి. అదేం చెబుతుందో వింటూ ఉండాలి. మనందరిలోనూ ఒక పోరాట యోధుడు ఉంటాడు. తనని మేల్కొలపాలి’ అంటూ తన యూట్యూబ్‌ చానల్‌లో చెప్పింది సుస్మిత. ఇదో విజయ ప్రకటన. శత్రు సంహారం తర్వాత ఓ విజేత మాట్లాడే యుద్ధభాష. 


logo