మంగళవారం 26 మే 2020
Zindagi - May 20, 2020 , 23:01:07

కథ- ప్రేమ పాయల్‌

కథ- ప్రేమ పాయల్‌

 పాయల్‌ రాజ్‌పుత్‌.. తెలుగు కుర్రకారుకు పరిచయం అవసరం లేని పేరు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్స్‌ అన్నీ ఆగిపోయాయి. ఈ సమయంలో రాజ్‌పుత్‌ ‘ఎ రైటర్‌' అనే లేడీ ఓరియెంటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌లో నటించింది. 

ఓ రచయిత్రి స్వభావాన్ని తెలియజేసే లఘుచిత్రం ‘ఎ రైటర్‌'. ప్రియ అనే రైటర్‌ రాసుకునే.. గృహహింస చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె నిత్యం కథలు రాస్తూ ఉంటుంది. ఒకరోజు  కథను ప్రారంభించగానే కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. ఏదో పార్సిల్‌ వస్తుంది. దాన్ని తీసుకున్నాక, మళ్లీ కథలో లీనం అవుతుంది. మరోవైపు ఇవేమీ పట్టని ఆమె భర్త అనిరుధ్‌ తనను తరచూ వేధింపులకు గురి చేస్తూ ఉంటాడు. వ్యాపారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఫోన్‌లోనూ వదలడు. ఓ రోజు అనిరుధ్‌ బ్యాగులో పరాయి స్త్రీ లోదుస్తులను గమనిస్తుంది ప్రియ. బిజినెస్‌ కోసమని వెళ్లే భర్త బయట చేస్తున్నది ఇదా అని ఆవేదన చెందుతుంది. ఇంట్లో వేధింపులు, బయట వివాహేతర సంబంధం.. ప్రియను మానసికంగా తీవ్ర ఇబ్బంది పెడతాయి. ఒకరోజు చిన్న విషయంలోనే ప్రియను కొడతాడు అనిరుధ్‌. ఆత్మరక్షణ కోసం ప్రియ అతని మీద కత్తితో దాడి చేస్తుంది. తర్వాత తనూ అపస్మార స్థితిలోకి వెళ్తుంది. ఇంతలో కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. మళ్లీ పార్సిల్‌. ప్రియ పార్సిల్‌ తీసుకోవడానికి వెళ్తుంది. పార్సిల్‌ బాయ్‌ని చూసి షాక్‌ అవుతుంది. అతనిలో భర్త పోలికలు! పేరూ అదే... అనిరుధ్‌.  ‘రచయితలు కథలు రాయడమే కాదు. ఆ కథలో జీవిస్తారు. ఆ ఆలోచనలతో ప్రేమలో పడతారు’ అనే సందేశంతో లఘుచిత్రం ముగుస్తుంది. పాయల్‌ ఈ పాత్రలో జీవించింది. 


logo